హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతున్న కొత్త ఉత్పత్తుల ఊతంతో వచ్చే నాలుగైదేళ్లలో ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని విత్తనాల సంస్థ నూజివీడు సీడ్స్ (ఎన్‌ఎస్‌ఎల్) నిర్దేశించుకుంది. ప్రస్తుతం కాటన్ సీడ్స్ మార్కెట్లో దాదాపు 16–17 శాతంగా ఉన్న వాటాను 30 శాతానికి చేర్చుకోవాలని భావిస్తోంది.
కంపెనీ నెలకొల్పి 50 ఏళ్లయిన సందర్భంగా మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎల్ గ్రూప్ చైర్మన్ ఎం. ప్రభాకరరావు ఈ విషయాలు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో నూజివీడు సీడ్స్ ఆదాయం రూ. 1,100 కోట్లుగా ఉంది. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ కోసం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై గణనీయంగా వెచ్చిస్తున్నట్లు ప్రభాకరరావు తెలిపారు. తమ ఆదాయాల్లో 5 శాతం పైగా కేటాయిస్తున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా 13 ప్రాసెసింగ్ సెంటర్లు, 29 కోల్డ్ స్టోరేజీలు..గిడ్డంగులు ఉన్నట్లు తెలిపారు.
1 లక్ష మంది పైగా రైతుల నుంచి విత్తనాలు సేకరిస్తున్నట్లు, 20 వేల మంది పైచిలుకు రిటైలర్ల ద్వారా దాదాపు 50 లక్షల మంది రైతులకు సేవలు అందిస్తున్నట్లు ప్రభాకరరావు పేర్కొన్నారు. 1973లో మండవ వెంకటరామయ్య ప్రారంభించిన నూజివీడు సీడ్స్‌కి ఒక దశలో కాటన్ సీడ్ మార్కెట్లో మూడో వంతు వాటా దక్కించుకుంది. అప్పట్లో ఏర్పాటైన అనేక విత్తన సంస్థలు కాలక్రమంలో కనుమరుగైనప్పటికీ ఎన్‌ఎస్‌ఎల్ పటిష్టంగా నిలదొక్కుకుందని ప్రభాకరరావు తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ సీఎస్‌వో శరద్ ఖురానా, డైరెక్టర్ పి. సతీష్ కుమార్, సీఎఫ్‌వో వి. శ్రీకాంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment