సేంద్రీయ వ్యవసాయంతో ‘నారియల్‌ అమ్మ’ కు పద్మశ్రీ | Meet Nariyal Amma gets Padma Shri for organic coconut farming | Sakshi
Sakshi News home page

సేంద్రీయ వ్యవసాయంతో ‘నారియల్‌ అమ్మ’ కు పద్మశ్రీ

Published Fri, Jan 26 2024 6:17 PM | Last Updated on Fri, Jan 26 2024 6:23 PM

Meet Nariyal Amma gets Padma Shri for organic coconut farming - Sakshi

సేంద్రీయ  వ్యవసాయంతో పద్మశ్రీ అవార్డు దక్కించుకుని ‘నారియల్‌ అమ్మ’  వార్తల్లోనిలిచారు. అండమాన్  అండ్‌ నికోబార్ దీవుల్లోని మారుమూల ప్రాంతానికిచెందిన  67 ఏళ్ల కామాచి చెల్లమ్మాళ్ కేంద్ర ప్రభుత్వ పద్మ పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషంగా నిలిచింది.  సేంద్రీయ కొబ్బరి తోటల పెంపకంలో  విశేషకృషికి గాను ఆమెకు  ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు దక్కింది. సాంప్రదాయ వ్యవసాయం, కొబ్బరి సాగుతో    'నారియల్ అమ్మ' గా ఖ్యాతి గడించారు. 

దక్షిణ అండమాన్‌లోని రంగాచాంగ్‌కు చెందిన చెల్లమ్మాళ్ కొబ్బరి సాగులో విప్లవాత్మకమైన, వినూత్న పద్ధతులను అవలబించారు. స్థిరమైన వ్యవసాయానికి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్‌ను కూడా అలవర్చుకున్నారు. కొబ్బరి ఆకులు, పొట్టును మల్చింగ్‌గా ఉపయోగించి వర్షానంతర కాలంలో నేల తేమను కాపాడుకుంటూ తేమ నష్టాన్ని తగ్గించడమే కాకుండా కలుపు, తెగుళ్ల బెడదను నివారించారు. అలాగే హానికర రసాయనాలకు దూరంగా 'ట్రాప్ ప్లాంట్స్'తో  తెగుళ్ల నివారణలో వ్యూహాత్మక విధానాన్ని అవలంబించారు.  ఫలితంగా ఆరోగ్యకరమైన కొబ్బరి దిగుబడిని సాధించారు. అంతేకాదు తనతోపాటు తోటి రైతులు కూడా సేంద్రీయ పద్ధతులను  పాటించేలా కృషి చేశారు..

తన 10 ఎకరాల భూమిలో బహుళ జాతుల పంటలను పండిస్తారు చెల్లమ్మాల్. అలాగే ఏనుగు పాదం, అరటి, వేరుశెనగ, పైనాపిల్, బత్తాయి, పచ్చిమిర్చి, ట్యూబ్ రోజ్, గ్లాడియోలస్‌, ఆకు, కూరగాయలతో వైవిధ్యమైన సాగు ఆమె ప్రత్యేకత.  సమీకృత వ్యవసాయ విధానంతో తక్కువ కొబ్బరి మార్కెట్ ధరల సవాళ్లను అధిగమించడమే కాకుండా ఆదాయాన్ని కూడా పెంచింది.

స్థిర వ్యవసాయ పద్ధతులు, సరికొత్త ఆవిష్కరణలతో మారుమూల గ్రామం నుంచిజాతీయ  అవార్డు దాకా  సాగిన చెల్లమ్మాళ్‌ అద్భుత ప్రయాణం భావి తరం రైతులకు, ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. చెల్లమ్మాళ్ కొడుకు రామచంద్రన్, ఆమెకు వ్యవసాయంలో ఆసరాగా ఉంటారు. విభిన్న పంటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, చేపల పెంపక విశేషాలను స్థానిక విద్యార్థులకు మాత్రమే కాకుండా పర్యాటకులకు కూడా ప్రదర్శిస్తూ వ్యవసాయ-పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని యోచిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement