
గెలుపు దారి
తోట పని గురించి పెద్దలు చెప్పిన మాట... ‘జీవితానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉత్సాహానికి ప్రయోగశీలతను ఇస్తుంది’ పుదుచ్చేరిలోని తెలుగు సంతతికి చెందిన శ్రీలక్ష్మికి తోట అనేది ఉత్సాహాన్ని ఇచ్చే శక్తి మాత్రమే కాదు ప్రయోగక్షేత్రం కూడా! తాను చదివిన చదువుకు చేసిన ప్రయోగాలకు సంబంధమే లేదు.
ఎంబీఏ చేసిన శ్రీలక్ష్మికి కార్పొరేట్ దారి కనిపించలేదు. పచ్చటి వ్యవసాయ క్షేత్రాలే కనిపించాయి. ప్రయోగాలు దారి చూపించాయి నిమ్మ వాసనతో కూడిన మిరియాల వంగడాన్ని అభివృద్ధి చేయడంలాంటి ఎన్నో ఆవిష్కరణలు చేసింది శ్రీలక్ష్మి...
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడపాక్కం గ్రామంలో తెలుగు సంతతికి చెందిన వెంకటపతి రెడ్డియార్ కుటుంబం ఉంది. వెంకటపతి రెడ్డియార్ 4వ తరగతిలోనే బడి మానేసి వ్యవసాయ పనులలో తల్లిదండ్రులకు సాయంగా పొలం బాట పట్టాడు. హార్టికల్చర్ మీద ఆసక్తితో తనకు ఉన్న స్వీయ అనుభవాలతో కొత్తరకం పూల మొక్కల పెంపకంలో రాణించాడు. వందరకాల కనకాంబరం వంగడాల అభివృద్ధితో రికార్డు సృష్టించాడు. ఎన్నో పేటెంట్లను కలిగిన రెడ్డియార్ పరిశోధనలకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారం వరించింది.
పరిశోధనల కోసం జీవితాన్ని అంకితం చేసిన తండ్రి వెంకటపతి రెడ్డియార్ అడుగు జాడలలో ఆమె కూతురు శ్రీలక్ష్మి(32) నడుస్తోంది. కొత్తరకం సువాసనలతో వివిధ రకాల వంగడాలను సృష్టిస్తోంది. తండ్రి వెంకటపతి రెడ్డియార్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఏడు సంవత్సరాల వయస్సులోనే శ్రీలక్ష్మి పొలం బాట పట్టింది. ఓ వైపు చదువుకుంటూ, మరో వైపు పొలం పనులు చేసేది. కాలక్రమంలో తండ్రి పరిశోధనలకు చేదోడు వాదోడుగా మారింది.
కార్పొరేట్ ప్రపంచాన్ని కాదనుకొని...
ఎంబీఏ చేసినా, వ్యవసాయం మీద మక్కువతో ఆ దిశగానే అడుగులు వేసింది. తండ్రి మెళకువలు అంది పుచ్చుకుంది శ్రీలక్ష్మి. సేంద్రియ, సేంద్రీయేతర విధానాలతో పొలంలో వివిధ రకాల మొక్కల పెంపకం, వాటిని పలు∙రాష్ట్రాలకు ఎగుమతులు చేయడం మొదలు పెట్టింది. ఆరెంజ్, చాక్లెట్, నేరేడు, పన్నీర్ సువాసనలతో కొత్తరకం జామవంగడాల సృష్టి ప్రత్యేకతను సంతరించుకుంది. వీటిలో ఆరంజ్ ఫ్లేవర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, చాక్లెట్ ఫ్లేవర్‌కు కిరణ్ బేడీల పేర్లు పెట్టారు.
నిమ్మ మిరియం!
నిమ్మ సువాసనతో 1.5 ఎకరాలలో కొత్తరకం మిరియాల మొక్కలను పండించారు. సాధారణ రకం మిరియాల మొక్కలతో ఆరేడు సంవత్సరాల తర్వాతే పంట చేతికి వస్తుంది. దీనికి భిన్నంగా సరికొత్త వంగడంతో అంతకన్నా తక్కువ ఖర్చు, తక్కువ సమయం, తక్కువ శ్రమతోనే దిగుబడి ఆశాజనకంగా ఉండే విధానాన్ని శ్రీలక్ష్మి ఆవిష్కరించింది. ‘పది సంవత్సరాలుగా పరిశోధన చేశాం. ఎట్టకేలకు మా కష్టం ఫలించింది. వివిధ మొక్కలను పలు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాం. ఈ కొత్త ఆవిష్కరణకు పేటెంట్ కోసం ప్రయత్నిస్తున్నాం’ అంటుంది శ్రీలక్ష్మి.
మన ఆసక్తే మన శక్తి...
పంటపొలాల్లోకి వెళితే కొత్తప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉంటుంది. ఆ సంతోషమే ఉద్యానరంగంలోకి అడుగుపెట్టేలా చేసింది. ప్రయోగాల విషయంలో నాన్న ఇచ్చిన స్ఫూర్తి ఇంతా అంతా కాదు. ‘మన ఆసక్తే మనశక్తి’ అనేది ఆయన మాట. ఆ ఆసక్తితోనే ప్రయోగాల దారిలో ప్రయాణం చేస్తున్నాను. వ్యవసాయ పరిశోధనల్లో మహిళల కొరత కనిపిస్తోంది. పరిశోధన రంగంలోకి అడుగు పెట్టే మహిళల సంఖ్య పెరిగేకొద్దీ కొత్త ఆవిష్కరణలు సాధ్యం అవుతాయి.
– శ్రీలక్ష్మి
– ఎం. అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై
Comments
Please login to add a commentAdd a comment