వైఎస్సార్ చేయూత, ఆసరా వంటి పథకాలను వినియోగించుకుని లబ్ధి పొందుతున్న మహిళల ద్వారా సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించి వారి స్వయం ఉపాధికి ఊతమివ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఆరు వేల మైక్రో యూనిట్లు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలి. మార్కెట్‌తో సమన్వయం చేసుకుంటూ ఇతర పంటల్లో కూడా మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నిరోధించేలా అడుగులు ముందుకు వేయాలి.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : రైతులు పండించిన ప్రతి పంటకు కనీస మద్దతు ధర దక్కేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరిపైనా ఉందని, ప్రభుత్వం నిర్ధేశించిన కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఏ ఒక్క రైతూ పంట ఉత్పత్తులను అమ్ముకోడానికి వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు ఎవరైనా సరే.. కనీస మద్దతు ధర చెల్లించిన తర్వాతే రైతుల నుంచి పంట ఉత్పత్తులు సేకరించేలా చూడాలన్నారు. డిమాండ్ లేదనో మరే కారణంతోనైనా మద్దతు ధర దక్కకుండా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏపీ ఎంఎస్‌పీ యాక్టు–2023 తీసుకురావాలని చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల్లో జరుగుతోన్న వివిధ కార్యక్రమాల పురోగతిపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం ప్రకటించే ఎమ్మెస్పీ ధీమా కల్పించేలా ఈ చట్టం ఉండేలా చూడాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకే కాకుండా ఆక్వా, డెయిరీ రైతుల ఉత్పత్తులకు కూడా రక్షణ కల్పించేలా ఈ చట్టాన్ని రూపొందించాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
మార్కెటింగ్‌లో ఆర్బీకేల ప్రమేయం
►విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు.. వేటిలోనూ నకిలీ, కల్తీ లేకుండా నివారించడంలో ఆర్బీకేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అదే రీతిలో మార్కెటింగ్‌లో కూడా ఆర్బీకేల ప్రమేయం ఉండాలి. పంటల సాగు, బీమా కల్పన, ధాన్యం కొనుగోలులో ఆర్బీకేలు ఇప్పటికే రైతులను చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి.
►ధాన్యం సేకరణలో ఆర్బీకేల ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేశాం. కనీస గిట్టుబాటు ధరలు రాని ఏ పంట కొనుగోళ్లలో అయినా ఆర్బీకే జోక్యం చేసుకుంటుంది. మిగిలిన పంటల కొనుగోలు కూడా ఆర్బీకే కేంద్రంగా జరిగేలా చూడాలి. ఏ రకమైన కొనుగోళ్లకు అయినా ఆర్బీకే కేంద్రం కావాలి.
డ్రోన్ టెక్నాలజీ విస్తృతం
►వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో బహుళ ప్రయోజనాలు పొందాలి. ఇప్పటికే సూక్ష్మ ఎరువులు, పురుగు మందుల వినియోగం లాంటి కార్యక్రమాలు డ్రోన్ల ద్వారా చేస్తున్నాం. ఇదే కాకుండా డ్రోన్ల ద్వారా భూసార పరీక్షలు చేయించే పరిస్థితిని తీసుకురావాలి. తద్వారా ఆర్బీకే స్థాయిలో భూసార పరీక్షలు జరిగేలా చూడాలి.
►భూసార పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించడమే కాకుండా, ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా తెలుసుకునే పరిస్థితి వస్తే ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. పైగా సేకరించే డేటాలో కచ్చితత్వం ఉండేందుకు అవకాశం ఉంటుంది.
►సాగులోనే కాదు పంట దిగుబడులపై అంచనాలకు కూడా డ్రోన్లను వినియోగిస్తున్నారు. వరి దిగుబడులను డ్రోన్ల సాయంతో అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మిగిలిన పంటల విషయంలో కూడా ఇదే తరహా ప్రయోజనాలు డ్రోన్ టెక్నాలజీ ద్వారా పొందేలా చూడాలి. బహుళ ప్రయోజనకారిగా డ్రోన్లను వినియోగించు కోవడం వల్ల వ్యవసాయ రంగానికి, రైతులకు మరింత మేలు జరుగుతుంది.
వీడియోల ద్వారా సాగులో శిక్షణ
►10 వేల ఆర్బీకేల్లో 10 వేల డ్రోన్ల ద్వారా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలి. సాగులో శిక్షణ కార్యక్రమాలపై మరిన్ని వీడియోలు రూపొందించి ఆర్బీకే ఛానెల్ ద్వారా మరింతగా రైతులకు చేరువ చేయాలి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సాధ్యమైనంత ఎక్కువ మంది కౌలుదారులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేయాలి. వీరికి రైతు భరోసా అందేలా చర్యలు తీసుకోవాలి.
►వైఎస్సార్ ఉచిత పంటల బీమా దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ నాలుగేళ్లలో ఇప్పటి వరకు 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.5 కోట్లు పరిహారంగా అందించాం. రబీ సీజన్‌కు సంబంధించి పంటల బీమా పరిహారాన్ని అక్టోబర్‌లో ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి.
పంటల ఆధారంగా పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
► జిల్లాల్లో స్థానికంగా పండే పంటల ఆధారంగా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు దిశగా కృషి చేయాలి. నియోజకవర్గాల వారీగా మ్యాపింగ్ చేయాలి. ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధ్యమైనంత త్వరగా ఈ యూనిట్లను అందుబాటులోకి తీసుకురావాలి.
► రెగ్యులర్ మార్కెట్‌కే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్‌కు అనుకూలమైన వంగడాలను ఉద్యానవన పంటల్లో ప్రోత్సహించాలి. గత నాలుగేళ్లలో 4.34 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటల నుంచి ఉద్యానవన పంటల వైపు మళ్లింపు జరిగింది. ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి.
► తరచూ ధరల్లో తీవ్ర హెచ్చు తగ్గులకు గురయ్యే టమాటా, ఉల్లి లాంటి పంటల ప్రాసెసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ పంటల సాగు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలి. ఆయా జిల్లాల్లో మహిళలతో నడిచేలా సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లను తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి.
► ఇందుకోసం అవసరమైన వ్యవసాయ ఉపకరణాలు, డ్రైయింగ్ ప్లాట్ ఫామ్‌లతో పాటు ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. గోడౌన్లు, కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూమ్‌ల నిర్మాణాన్ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. వీటి వల్ల పంట ఉత్పత్తుల జీవితకాలం పెరుగుతుంది. రైతులకు మంచి ధరలు వస్తాయి. ఉద్యానవన పంటలకు ఈ మౌలిక సదుపాయాలు ఎంతగానో అవసరం.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఏపీ అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారు ఐ.తిరుపాల్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఉద్యాన శాఖ కమిషనర్ ఎస్‌ఎస్ శ్రీధర్, ఏపీ మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ పాండే, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఏపీడీడీసీఎఫ్ ఎండీ అహ్మద్ బాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment