ప్రకృతి వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం అందిస్తున్న మార్గదర్శకత్వంలో ప్రకృతి సేద్యం చేస్తూ దానిమ్మ తోటలో చక్కని దిగుబడిని పొందుతూ శభాష్ అని ప్రశంసలు అందుకుంటున్నారు రైతు రవి ప్రతాప్ రెడ్డి. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం కొత్తలం గ్రామానికి చెందిన రవి ప్రతాప్ రెడ్డి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తూ.చ. తప్పకుండా పాటిస్తూ 6 ఎకరాల్లో భగువ రకం దానిమ్మ పంటను సాగు చేసి తక్కువ ఖర్చుతోనే అధిక లాభాలు పొందుతున్నారు. 2021 ఫిబ్రవరిలో దానిమ్మ మొక్క రూ.40 చొప్పున కోనుగోలు చేసి, 12“12 అడుగుల దూరంలో ఎకరాకు 350–380 వరకు మొక్కలను నాటి డ్రిప్‌తో సాగు చేస్తున్నారు.
గత ఏడాది మొదటి పంటలో రూ.10 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ప్రసుత్తం రెండున్నరేళ్ల వయసులో రెండో పంట కోతకు సిద్ధంగా ఉంది. చెట్ల నిండా కాయలు ఉండటంతో కన్నుల పండువగా ఉంది. రైతులు, వ్యాపారులతో పాటు జాతీయ, అంతర్జాతీయ పాత్రికేయులు, నిపుణులు సైతం ఈ తోటను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆరెకరాల్లో 40–42 టన్నుల దానిమ్మ దిగుబడి వస్తుందని, రూ. 45 లక్షల వరకు ఆదాయం రావచ్చని రవి ప్రతాప్ రెడ్డి ఆశిస్తున్నారు. అదే విధంగా, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 13 ఎకరాల్లో అల్లనేరేడు పంటను సాగు చేసిన ఆయన రూ.8 లక్షల ఆదాయం పొందారు.
ఎకరానికి ఖర్చు రూ. 25 వేలు!
రసాయనిక వ్యవసాయం చేసే దానిమ్మ తోటను తెగుళ్ల నుంచి రక్షించుకోవడానికి రోజు మార్చి రోజు ఏదో ఒక మందు కొడుతూనే ఉంటారు. దాంతో ఖర్చు ఎకరానికి ఏడాదికి రూ. 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ, తన తోటలో జీవామృతం, కషాయాలకు మొత్తంగా రూ. 25 వేలే ఖర్చయ్యిందని రవి ప్రతాప్ రెడ్డి తెలిపారు. చెట్టుకు 2 కేజీల ఘనజీవామృతం వేసిన తర్వాత నామాస్త్రం, సొంఠిపాల కషాయం, జీవామృతం అవసరం మేరకు క్రమం తప్పకుండా శ్రద్ధగా తయారు చేసుకొని అందిస్తున్నారు. నాలుగు నాటు ఆవుల పేడ, మూత్రం వినియోగిస్తున్నారు.
కాయ కుళ్లు తెగులు వచ్చిందంటే రసాయనిక సేద్యం చేసే తోటల్లో కంట్రోల్ కాదు. అయితే, ప్రకృతి సేద్యంలో దీని నివారణకు సొంఠిపాల కషాయం సమర్థవంతంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఆరోగ్యంగా పెరగటం వల్లనే చీడపీడల బెడద కూడా లేదని ఆయన అన్నారు. ప్రకృతి వ్యవసాయ విభాగం మాస్టర్ ట్రైనర్ రమేష్, డీపీఎం లక్ష్మానాయక్ ప్రత్యేక శ్రద్ధతో ఎప్పటికప్పుడు అందిస్తున్న సూచనలు, సలహాలను పూర్తిగా పాటించటం వల్ల సత్ఫలితాలు పొందగలుగతున్నానని రైతు రవి ప్రతాప్ రెడ్డి తెలిపారు. మడకశిర డివిజన్ పరిధిలోని 134 గ్రామాల్లో 16,662 మంది రైతులు 32 వేల ఎకరాల్లో ప్రకృతి వ్వయసాయ పద్ధతుల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. గత నెలలో జర్నలిస్టులు ఢీల్లీకి చెందిన సునీతా నారాయణ్, క్రిస్టియన్ గ్రేప్‌తో పాటు జర్మనీకి చెందిన రాజ్ పటేల్, అమెరికాకు చెందిన ప్రణయ్ తదితరుల బృందం తన తోటను సందర్శించి ఆశ్చర్యచకితులయ్యారని ఆయన సంతోషంగా చెప్పారు.
– ఎస్.క్రిష్ణారెడ్డి, సాక్షి, మడకశిర రూరల్, శ్రీసత్యసాయి జిల్లా
చెప్పింది చెప్పినట్టు చేసే రైతు!
ప్రకృతి వ్యవసాయంలో మెలకువలను చెప్పింది చెప్పినట్టు వంద శాతం పాటించే నిబద్ధత కలిగిన రైతు రవిప్రతాప్‌రెడ్డి. దానిమ్మ చెట్ల మధ్య 30 రకాల విత్తనాలను వానకు ముందే విత్తి(పిఎండిఎస్), పెరిగిన తర్వాత కోసి మల్చింగ్ చేస్తే మంచి ఫలితాలు వస్తున్నాయి. మడకశిర ప్రాంతంలో ఈ ఏడాది సగం కన్నా తక్కువ వర్షతపామే నమోదైంది. అయినా మంచి పంట దిగుబడి వచ్చింది. రెండున్నర ఏళ్ల దానిమ్మ తోటలో ఎకరానికి 7 టన్నుల దిగుబడిని అతి తక్కువ ఖర్చుతోనే రవిప్రతాప్‌రెడ్డి సాధించారు.
– లక్ష్మణ్ నాయక్ (83310 57583),
జిల్లా ΄జెక్టు మేనేజర్, ప్రకృతి వ్యవసాయ విభాగం, శ్రీసత్యసాయి జిల్లా
ఓపికగా చెయ్యాలి
ప్రకృతి సేద్యాన్ని శ్రద్ధగా, ఓపికగా చేయాలి. ముందుగానే ప్రణాళిక ప్రకారం జీవామృతం, కషాయాలను జాగ్రత్తగా తయారు చేసుకొని వాడాలి. జీవామృతం కలిపిన 8 రోజులు మురగబెట్టి వాడాలి. రోజూ రెండు పూటలు కలియదిప్పాలి. దీనికి వాడే శనగపిండి సొంతంగా మరపట్టించుకొని వాడాలి. మార్కెట్‌లో కొని వాడితే కల్తీ వల్ల ఫలితం సరిగ్గారాదు. నన్ను చూసి పది మంది రైతులైనా మారితే అదే నాకు సంతోషం. సొంతంగా తయారు చేసుకొని వాడే ద్రావణాలు, కషాయాలు చాలు మంచి దిగుబడులు పొందడానికి. కెమికల్స్, బయో/ఆర్గానిక్ ఉత్పత్తుల కొని వాడటం ప్రమాదకరం.
– రవి ప్రతాప్‌రెడ్డి(93989 80129),
దానిమ్మ రైతు, కొత్తలం, మడకశిర మండలం,
శ్రీసత్యసాయి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment