Pomegranate fruits
-
గర్భిణులు దానిమ్మ రసం తాగితే.. పిల్లలకు ఏమవుతుందో తెలుసా?
పిండం మెదడు ఎదుగుదలను తీవ్రంగా ప్రభావితం చేసే ఓ ఆరోగ్య సమస్యను దానిమ్మ రసంతో నివారించొచ్చని బ్రైగమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంట్రాయుటేరియన్ గ్రోత్ రిస్ట్రిక్షన్(ఐయూజీఆర్)అని పిలిచే ఈ సమస్య ప్రతి పదిమంది పిల్లల్లో ఒకరిని పీడిస్తుంది. పిండానికి ఆక్సిజన్‌తో పాటు ఇతర పోషకాలను అందించే ఉమ్మనీటిలో తేడాలుంటే వచ్చే ఐయూజీఆర్కు దానిమ్మతో చెక్ పెట్టొచ్చని అధ్యయనంలో రుజువైంది. దానిమ్మలో పుష్కలంగా ఉండే పాలీఫినాల్స్ మెదడు వరకు నేరుగా ప్రవేశించగలవని ఇప్పటికే రుజువైన నేపథ్యంలో శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేశారు. ఐయూజీఆర్ సమస్య ఉన్న 78 మంది గర్భిణులను ఎంచుకుని వారిలో సగం మందికి కాన్పు వరకు రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం అందించారు. మిగిలిన వారికి పాలీఫినాల్స్ లేని జ్యూస్ అందించారు. అందరి కాన్పుల తర్వాత పిల్లలను పరిశీలించగా.. దానిమ్మ రసం తీసుకున్న తల్లుల పిల్లల మెదళ్లలోని కనెక్షన్లు బలంగా ఉన్నట్లు తెలిసింది. -
దానిమ్మ ఎన్ని వ్యాధులకు చెక్ పెడుతుందో తెలుసా!
దానిమ్మ పండు, పువ్వులు, బెరడు, వేర్లు ఆకులు అనేక వ్యాధులు చికిత్స చేయడానికి ఉపయోగించేలా పాలీఫెనాల్స్ వంటి రసాయనాలను కలిగి ఉంటాయి. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నిఇన్ని కావు. ఇది జీర్ణ రుగ్మతలు, చర్మ రుగ్మతలు, పేగు సంబధింత వ్యాధులకు చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుందంటున్నారు ఆయుర్వేద డైటిషన్ శిరీష రాకోటి. ఈ పండును తీసుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు మన దరిదాపుల్లోకి రావో డైటిషన్ శిరీష రాకోటి మాటల్లో తెలుసుకుందామా!. ఇందులో వివిధ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఒక పోషకమైన పండు దానిమ్మ. ఈ పండ్లను తీసుకోవడం ఏఏ వ్యాధులు దరిదాపుల్లోకి రావంటే.. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ ప్యూనికాలాగిన్స్ ఎలాజిక్ యాసిడ్ వంటి పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం, ఇది ఫ్రీ రాడికల్స్ అని పిలిచే హానికరమైన అణువుల వల్ల కలిగే నష్టం నుంచి మీ శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. దానిమ్మలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు మీ శరీరం అంతటా మంటను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలవు. రక్తపోటును తగ్గిస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారిలో దానిమ్మ రసం తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండెకు రక్త ప్రసరణ మెరుగ్గా అయ్యేలా చేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. దానిమ్మ రసం తీసుకోవడం వల్ల వృద్ధులలో జ్ఞాపకశక్తి పెరిగేలా మెదడు పనితీరు మెరుగుపడుతుందని కొన్ని పరిశోధనలు కనుగొన్నాయి. క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంది. అంతేగాదు కొన్ని అధ్యయనాలు దానిమ్మ సారం క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉండవచ్చని సూచించాయి, ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తంమీద, దానిమ్మ, దానిమ్మ రసం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. ఆఖరికి వంధ్యత్వాన్ని నయం చేయడానికి కొన్ని దేశాల్లో దానిమ్మపండ్ల రసాన్ని ఉపయోగిస్తారని అధ్యయనాలు తెలిపాయి... ---శిరీష రాకోటి, ఆయుర్వేద డైటిషన్ (చదవండి: మీ ఆహారంలో ఇవి చేర్చితే మధుమేహం దరిదాపుల్లోకి రాదు!) -
ప్రకృతి సేద్యం.. దానిమ్మ తోటతో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు
ప్రకృతి వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం అందిస్తున్న మార్గదర్శకత్వంలో ప్రకృతి సేద్యం చేస్తూ దానిమ్మ తోటలో చక్కని దిగుబడిని పొందుతూ శభాష్ అని ప్రశంసలు అందుకుంటున్నారు రైతు రవి ప్రతాప్ రెడ్డి. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం కొత్తలం గ్రామానికి చెందిన రవి ప్రతాప్ రెడ్డి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తూ.చ. తప్పకుండా పాటిస్తూ 6 ఎకరాల్లో భగువ రకం దానిమ్మ పంటను సాగు చేసి తక్కువ ఖర్చుతోనే అధిక లాభాలు పొందుతున్నారు. 2021 ఫిబ్రవరిలో దానిమ్మ మొక్క రూ.40 చొప్పున కోనుగోలు చేసి, 12“12 అడుగుల దూరంలో ఎకరాకు 350–380 వరకు మొక్కలను నాటి డ్రిప్‌తో సాగు చేస్తున్నారు. గత ఏడాది మొదటి పంటలో రూ.10 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ప్రసుత్తం రెండున్నరేళ్ల వయసులో రెండో పంట కోతకు సిద్ధంగా ఉంది. చెట్ల నిండా కాయలు ఉండటంతో కన్నుల పండువగా ఉంది. రైతులు, వ్యాపారులతో పాటు జాతీయ, అంతర్జాతీయ పాత్రికేయులు, నిపుణులు సైతం ఈ తోటను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆరెకరాల్లో 40–42 టన్నుల దానిమ్మ దిగుబడి వస్తుందని, రూ. 45 లక్షల వరకు ఆదాయం రావచ్చని రవి ప్రతాప్ రెడ్డి ఆశిస్తున్నారు. అదే విధంగా, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 13 ఎకరాల్లో అల్లనేరేడు పంటను సాగు చేసిన ఆయన రూ.8 లక్షల ఆదాయం పొందారు. ఎకరానికి ఖర్చు రూ. 25 వేలు! రసాయనిక వ్యవసాయం చేసే దానిమ్మ తోటను తెగుళ్ల నుంచి రక్షించుకోవడానికి రోజు మార్చి రోజు ఏదో ఒక మందు కొడుతూనే ఉంటారు. దాంతో ఖర్చు ఎకరానికి ఏడాదికి రూ. 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ, తన తోటలో జీవామృతం, కషాయాలకు మొత్తంగా రూ. 25 వేలే ఖర్చయ్యిందని రవి ప్రతాప్ రెడ్డి తెలిపారు. చెట్టుకు 2 కేజీల ఘనజీవామృతం వేసిన తర్వాత నామాస్త్రం, సొంఠిపాల కషాయం, జీవామృతం అవసరం మేరకు క్రమం తప్పకుండా శ్రద్ధగా తయారు చేసుకొని అందిస్తున్నారు. నాలుగు నాటు ఆవుల పేడ, మూత్రం వినియోగిస్తున్నారు. కాయ కుళ్లు తెగులు వచ్చిందంటే రసాయనిక సేద్యం చేసే తోటల్లో కంట్రోల్ కాదు. అయితే, ప్రకృతి సేద్యంలో దీని నివారణకు సొంఠిపాల కషాయం సమర్థవంతంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఆరోగ్యంగా పెరగటం వల్లనే చీడపీడల బెడద కూడా లేదని ఆయన అన్నారు. ప్రకృతి వ్యవసాయ విభాగం మాస్టర్ ట్రైనర్ రమేష్, డీపీఎం లక్ష్మానాయక్ ప్రత్యేక శ్రద్ధతో ఎప్పటికప్పుడు అందిస్తున్న సూచనలు, సలహాలను పూర్తిగా పాటించటం వల్ల సత్ఫలితాలు పొందగలుగతున్నానని రైతు రవి ప్రతాప్ రెడ్డి తెలిపారు. మడకశిర డివిజన్ పరిధిలోని 134 గ్రామాల్లో 16,662 మంది రైతులు 32 వేల ఎకరాల్లో ప్రకృతి వ్వయసాయ పద్ధతుల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. గత నెలలో జర్నలిస్టులు ఢీల్లీకి చెందిన సునీతా నారాయణ్, క్రిస్టియన్ గ్రేప్తో పాటు జర్మనీకి చెందిన రాజ్ పటేల్, అమెరికాకు చెందిన ప్రణయ్ తదితరుల బృందం తన తోటను సందర్శించి ఆశ్చర్యచకితులయ్యారని ఆయన సంతోషంగా చెప్పారు. – ఎస్.క్రిష్ణారెడ్డి, సాక్షి, మడకశిర రూరల్, శ్రీసత్యసాయి జిల్లా చెప్పింది చెప్పినట్టు చేసే రైతు! ప్రకృతి వ్యవసాయంలో మెలకువలను చెప్పింది చెప్పినట్టు వంద శాతం పాటించే నిబద్ధత కలిగిన రైతు రవిప్రతాప్రెడ్డి. దానిమ్మ చెట్ల మధ్య 30 రకాల విత్తనాలను వానకు ముందే విత్తి(పిఎండిఎస్), పెరిగిన తర్వాత కోసి మల్చింగ్ చేస్తే మంచి ఫలితాలు వస్తున్నాయి. మడకశిర ప్రాంతంలో ఈ ఏడాది సగం కన్నా తక్కువ వర్షతపామే నమోదైంది. అయినా మంచి పంట దిగుబడి వచ్చింది. రెండున్నర ఏళ్ల దానిమ్మ తోటలో ఎకరానికి 7 టన్నుల దిగుబడిని అతి తక్కువ ఖర్చుతోనే రవిప్రతాప్రెడ్డి సాధించారు. – లక్ష్మణ్ నాయక్ (83310 57583), జిల్లా ΄జెక్టు మేనేజర్, ప్రకృతి వ్యవసాయ విభాగం, శ్రీసత్యసాయి జిల్లా ఓపికగా చెయ్యాలి ప్రకృతి సేద్యాన్ని శ్రద్ధగా, ఓపికగా చేయాలి. ముందుగానే ప్రణాళిక ప్రకారం జీవామృతం, కషాయాలను జాగ్రత్తగా తయారు చేసుకొని వాడాలి. జీవామృతం కలిపిన 8 రోజులు మురగబెట్టి వాడాలి. రోజూ రెండు పూటలు కలియదిప్పాలి. దీనికి వాడే శనగపిండి సొంతంగా మరపట్టించుకొని వాడాలి. మార్కెట్లో కొని వాడితే కల్తీ వల్ల ఫలితం సరిగ్గారాదు. నన్ను చూసి పది మంది రైతులైనా మారితే అదే నాకు సంతోషం. సొంతంగా తయారు చేసుకొని వాడే ద్రావణాలు, కషాయాలు చాలు మంచి దిగుబడులు పొందడానికి. కెమికల్స్, బయో/ఆర్గానిక్ ఉత్పత్తుల కొని వాడటం ప్రమాదకరం. – రవి ప్రతాప్‌రెడ్డి(93989 80129), దానిమ్మ రైతు, కొత్తలం, మడకశిర మండలం, శ్రీసత్యసాయి జిల్లా -
దానిమ్మతో కేక్ టేస్ట్ అదిరిపోతుంది.. వీకెండ్లో ట్రై చేయండి
దానిమ్మ రైస్ కేక్ తయారీకి కావల్సినవి: అన్నం – 2 కప్పులు దానిమ్మ గింజలు – అర కప్పు పైనే కొబ్బరి కోరు – 2 టేబుల్ స్పూన్లు అరటి పండు గుజ్జు – 4 టేబుల్ స్పూన్లు పాలు – పావు లీటర్ పంచదార – 1 కప్పు నెయ్యి – 1 లేదా 2 టీ స్పూన్లు దాల్చిన చెక్కపొడి – గార్నిష్‌కి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో పాలు, పంచదార వేసి, పంచదార కరిగేవరకు తిప్పుతూ మరిగించాలి. ఆ మిశ్రమంలో అరటి పండు గుజ్జు, కొబ్బరికోరు వేసి మరోసారి కలుపుకోవాలి. చివరిగా అన్నం వేసి బాగా తిప్పి.. కాస్త దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం నచ్చిన షేప్‌లో ఉండే చిన్నచిన్న బౌల్స్ తీసుకుని, వాటికి నూనె లేదా నెయ్యి రాసి.. ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుని, సమాతరంగా ఒత్తుకుని.. గట్టిపడనివ్వాలి. వాటిపై దాల్చిన చెక్క పొడి, దానిమ్మ గింజలు వేసుకుని సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. -
సేంద్రియ విధానంలో దానిమ్మ సాగు..!
-
దానిమ్మ తొక్కలను పడేస్తున్నారా? ఇవి తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు
పండ్లు తిన్న తర్వాత సాధారణంగా తొక్కలను పారేస్తుంటాం. కానీ ఆ తొక్కల్లో ఫైబర్, విటమిన్స్, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయన్న విషయం చాలామందికి తెలియదు. దానిమ్మ పండు విషయానికి వస్తే.. దానిమ్మ గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనారోగ్యంతో ఉన్నవారికి దివ్య ఔషధం దానిమ్మ. ఎన్నో సమస్యలను ఈ పండు నయం చేస్తుంది. దానిమ్మ పండే కాదు, తొక్క కూడా చాలా ఉపయోగకరం. దీనిలో యాంటిఆక్సిడెంట్స్ ,ఫినోలిక్ యాసిడ్స్,ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. అసలు దానిమ్మ తొక్క ప్రయోజనాలు తెలిస్తే మీరు అసలు వదిలిపెట్టరు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ దానిమ్మను ఇష్టపడతారు. దానిమ్మలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్-సి, కె, బి, ఎ ఇందులో పుష్కలంగా ఉంటాయి. దానిమ్మలోని గుణాలు గుండెసమస్యలు, హైపర్ టెన్షన్, క్యాన్సర్, డయాబెటిస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇక దానిమ్మ గింజల్లోనే కాదు, తొక్కలోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యాన్నే కాదు, అందాన్ని కూడా పెంచుతుంది. దానిమ్మ రసం కంటే తొక్కలో 50శాతం అదిక మొత్తం యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మెండుగా యాంటీ ఆక్సిడెంట్లు ► దానిమ్మ తొక్కల్లో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్లు హార్ట్ ఎటాక్ రిస్క్‌ను తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ► చర్మ క్యాన్సర్‌ని తగ్గించడంలో దానిమ్మ తొక్కలు బాగా పనిచేస్తాయి. హానికరమైన యూవీఏ కిరణాల నుంచి ఇది రక్షిస్తుంది. దానిమ్మ తొక్కలతో పొడి చేసుకొని దాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే ముఖం చాలా కాంతివంతంగా మెరిసిపోతుంది. ► దానిమ్మ తొక్కలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల చక్కెర స్థాయిలను తగ్గించి బరువును కంట్రోల్లో ఉంచేలా చేస్తుంది. ► దానిమ్మ తొక్కలను మరిగించి ఆ రసాన్ని తాగితే కీళ్లనొప్పలు, గొంతునొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ► దానిమ్మలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు మెండుగా ఉంటాయి. దానిమ్మ తొక్కల రసాన్ని మహిళల్లో పీరియడ్స్ సమస్య తగ్గిపోతుంది. ► దానిమ్మ తొక్కలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి...తొక్కలను శుభ్రంగా కడిగి రసం తీసి తాగితే , ఆరోగ్యానికి మంచిది. ► కప్పు నీటిలో టీస్పూను దానిమ్మ పొడి, అరచెక్క నిమ్మరసం వేసి తాగినా మంచిదే. దానిమ్మ పొడి చేసుకోండిలా.. దానిమ్మ గింజలను తిని తొక్కలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తొక్కలను ఎండలో ఆరబెట్టాలి. చక్కగా ఎండిన తర్వాత మిక్సీలో వేసి పొడిచేసుకొని గాలి చొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. దానిమ్మతో అందం, మొటిమలు మాయం టేబుల్‌స్పూను దానిమ్మ పొడిలో అరటేబుల్ స్పూను నిమ్మరసం, అరటేబుల్ స్పూను తేనె వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు స్క్రబ్బర్‌లా రుద్ది కడగాలి. ఈ స్క్రబర్ వల్ల మృతకణాలు , ట్యాన్ తొలగి ముఖ చర్మం మృదువుగా మారుతుంది. దానిమ్మ తొక్కలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందుకోసం ఏం చేయాలంటే.. దానిమ్మ పొడిలో కొన్ని నీళ్లు పోసి మెత్తని పేస్టులా చేసుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. 20నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమల సమస్య తగ్గిపోతుంది. వయస్సురీత్యా వచ్చే ముడతలను కూడా దానిమ్మ తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఈ పొడిని రాసుకుంటే మార్పు మీకే కనిపిస్తుంది. కొబ్బరినూనెలో దానిమ్మ తొక్కలను కలపి వేడిచేసి చల్లారాక తలకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చుండ్రు పూర్తిగా తగ్గిపోతుంది. దానిమ్మ తొక్కలు చర్మం pHని సమతుల్యం చేస్తుంది. తేమగా ఉంచుతంది. చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. హానీకరమైన యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. -
దానిమ్మ తెగుళ్లకు చెక్
-
దానిమ్మ రాత్రిపూట తినకూడదా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
దానిమ్మ పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఇందులో ఉంటాయి. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్స్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు దానిమ్మ పండులో మెండుగా ఉంటాయి. సంవత్సరం పొడవునా ఈ పండ్లు మనకు లభిస్తాయి. రక్తహీనతతో బాధపడేవాళ్లు ప్రతిరోజూ దానిమ్మ పండ్లను తీసుకోవడం వల్ల సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు.వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు ఈజీగా పెరుగుతాయి. ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచే దానిమ్మ పండ్లు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అన్నది ఇప్పుడు చూద్దాం. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే దానిమ్మ గింజల్లో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. మీకు తెలుసా? ఒక దానిమ్మ పండులో సుమారు 600 వరకు గింజలు ఉంటాయట. క దానిమ్మ పండులో 7 గ్రాముల ఫైబర్, 3 గ్రాముల ప్రోటీన్, 30 శాతం విటమిన్ సి, 16 శాతం ఫోలేట్ మరియు 12 శాతం పొటాషియం ఉంటాయి. ఒక కప్పు దానిమ్మపండులో 24 గ్రాముల చక్కెర మరియు 144 కేలరీల శక్తి కూడా ఉంటుంది. రెండు వారాల పాటు రోజూ 150 మి.లీ దానిమ్మ రసాన్ని తాగడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది. రక్తహీనతతో బాధపడేవాళ్లకు దానిమ్మను మించిన ఔషధం లేదు. యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండే దానిమ్మ తింటే రక్తకణాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా దానిమ్మ పండ్లతో జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుందని తేలింది. క్రమం తప్పకుండా దానిమ్మను తీసుకుంటే అల్జీమర్స్ వ్యాధిని నివారించొచ్చని వైద్యులు చెబుతున్నారు. దానిమ్మతో ఆ సమస్యలు దూరం ► చలికాలంలో దానిమ్మ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ► దానిమ్మలో యంటీ ఏజింగ్ గుణాలు మెండుగా ఉంటాయి. ► దానిమ్మ రక్తంలో ఐరన్‌ను డెవలప్ చేస్తుంది. ఇది హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచుతుంది. ► ఇందులోని ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ రాడికల్స్‌ను నివారిస్తుంది. ► నిత్యం దానిమ్మ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ► వృద్దాప్యాన్ని దారితీసే ప్రీ రాడికల్స్ నుంచి కాపాడి, యవ్వనంగా ఉంచేలా చేస్తుంది. ► దానిమ్మ గింజల్లో విటమిన్ బి, సి, కెతో పాటు పొటాషియం, కాల్షియం వంటి పలు రకాల మినరల్స్ మెండుగా ఉంటాయి. ► మలబద్దకం, ఒబెసిటీ వంటి సమస్యలను దానిమ్మ దూరం చేస్తుంది. దానిమ్మతో అందం దానిమ్మ తినడం వల్ల చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. రోజూ కప్పు దానిమ్మ గింజలు తినడం వల్ల స్కిన్‌టోన్ మెరుగవుతుంది విటమిన్స్, పీచు అధికంగా ఉంటుంది. ఇవి చర్మంపై ముడతలు రాకుండా అడ్డుకుంటాయి దానిమ్మ పండులో ఉన్న ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ చర్మం తేమ కోల్పోకుండా నివారిస్తుంది. చర్మంపై ఉండే జిడ్డు, మొటిమలను శక్తివంతంగా తగ్గించడంలో దానిమ్మ సూపర్ ఫ్రూట్. వివిధ చర్మ సమస్యలను దూరం చేయడంలో దానిమ్మ ఎంతో సహాయపడుతుంది. దానిమ్మ రాత్రిపూట తినొచ్చా? చాలామంది రాత్రిపూట దానిమ్మ తింటే జలుబు చేస్తుందని, కఫం ఏర్పడుతుందని అనుకుంటారు. కానీ ఒట్టి అపోహ మాత్రమే. రాత్రి పడుకునే ముందు దానిమ్మ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్‌లో ఒక టీ స్పూన్లో అల్లం వేసుకొని తాగితే కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎముకలు కూడా ధృడంగా తయారవుతాయి. నిద్రించే ముందు దానిమ్మను పెరుగు తీసుకుంటే నాణ్యమైన నిద్రపడుతుంది. రాత్రిపూట దానిమ్మను తింటే ఉదయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. -
దానిమ్మలోని పదార్థంతో దీర్ఘాయుష్షు!
దీర్ఘాయుష్షుకు ఉపయోగపడుతుందని భావిస్తున్న ‘యురోలిథిన్ ఏ’ అనే పదార్థాన్ని మనుషుల్లోనూ విజయవంతంగా పరీక్షించారు శాస్త్రవేత్తలు దానిమ్మలో కనిపించే ఈ యురోలిథిన్ ఏ ఇప్పటికే కొన్ని రకాల పురుగులు, ఎలుకల ఆయుష్షును గణనీయంగా పెంచింది. స్విట్జర్లాండ్‌లోని ఈపీఎఫ్‌ఎల్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. యురోలిథిన్ ఏ కణాల్లోని మైటోకాండ్రియా పనితీరును మెరుగుపరచడం ద్వారా వద్ధాప్యంతో వచ్చే సమస్యలను నివారిస్తుందని అంచనా. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ పదార్థం మనకు తెలిసిన ఏ ఆహారంలోనూ ఉండదు. కాకపోతే దానిమ్మ, రాస్ప్బెర్రీ వంటి పండ్లలోని కొన్ని రసాయనాలు మన పేగుల్లో యురోలిథిన్ ఏగా విడిపోతాయి. ఈపీఎఫ్‌ఎల్ శాస్త్రవేత్తలు ఈ యురోలిథిన్ ఏ ను కత్రిమంగా తయారు చేసి ప్రయోగాలు చేశారు. వేర్వేరు మోతాదుల్లో 60 మందికి అందించారు. వీరందరూ ఆరోగ్యంగా ఉన్నవారే. కాకపోతే వ్యాయామాలు వంటివి పెద్దగా చేయనివారు. వీరికి వేర్వేరు మోతాదుల్లో యురోలిథిన్ ఏను అందించారు. 500 నుంచి వెయ్యి మిల్లీగ్రాములు ఇచ్చినప్పుడు మైటోకాండ్రియా పనితీరులో మార్పు కనిపించిందని వ్యాయామం చేస్తే ఎలాంటి వచ్చే ఫలితాలు ఈ మందు ద్వారా వచ్చాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జొహాన్ అవురెక్స్ తెలిపారు. -
క(న)ష్టాలను జయించిన ఆత్మవిశ్వాసం
మహారాష్ట్ర నుంచి మొక్కలు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా మహాత్మాపూలే రావూర్ విద్యాపీఠ్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి 3,200 దానిమ్మ మొక్కలు తీసుకువచ్చాడు. ఒక్కో మొక్కకు రూ.15 చొప్పున చెల్లించాడు. వీటిని తన పొలానికి తరలించే సరికి రవాణా కోసం రూ.80,000 వరకు ఖర్చు అయ్యింది. దానిమ్మ రకం ‘బగువా’ సాగు కోసం ‘బగువా’ రకానికి చెందిన మొక్కలను ఎంచుకున్నాడు. ఒక్కో దానిమ్మ పండు 150 నుంచి 400 గ్రాముల వరకు బరువు తూగుతాయి. ఒక్కో చెట్టుకు 300ల వరకు కాయలు వస్తాయి. మొదటి కాతలో ఒక్కో చెట్టుకు 80 కాయలు కాసి పండ్లుగా మారుతున్నాయి. తెగుళ్లు దానిమ్మ తోటలకు అత్యధికంగా మ చ్చతెగుళ్లు వస్తాయి. దీంతో దానిమ్మ పండ్లు నేలరాలిపోతాయి. అయితే మొక్కలకు ఎలాంటి తెగుళ్లు రాకుండా ఎథ్రిల్ అనే మందును పిచికారీ చేశాడు. తోట పర్యవేక్షణ కోసం పూణెకు చెందిన హార్టికల్చర్ అధికారి గణేశ్ కడాయ్‌ను నియమించుకున్నాడు. ప్రతీ 20 రోజుల కోసారి అతను వచ్చి మొక్క ఎదుగుదలను పర్యవేక్షిస్తున్నాడు. దీనికోసం అతనికి ప్రతీసారి రూ.10వేలు చెల్లిస్తున్నాడు. ఎరువుల వాడకం వెంకటరాంరెడ్డి సాగు చేసిన తోటలో అత్యధికంగా సేంద్రియ ఎరువులను వాడాడు. పచ్చిరొట్ట ఎరువుతో పాటు ప్రతీ మొక్కకు రెండుగంపల పశువుల పేడ ఎరువును మొక్కకు నాలుగు వైపులా వేశాడు. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఇదే పద్ధతిలో ఎరువులు వాడారు. ఏపుగా పెరిగిన తోట మూడో ఏడాది వరకు ఒక్కో మొక్క 12 ఫీట్ల వరకు పెరిగింది. ఏపుగా పెరిగిన మొక్కల కొమ్మలను పూత రాకముందే కత్తిరించాడు. అనంతరం ప్రతీ మొక్కకు వెదురు కట్టెలతో ప్రత్యేక పందిరి వేయించాడు. దీనికోసం రూ.2లక్షల వరకు ఖర్చు చేశాడు. ఈ పందిరి ద్వారా మొక్కల కొమ్మల బరువు వెదురు కట్టెలపై పడుతుంది. దీంతో చెట్టు కొమ్మలు విరిగిపోకుండా కాయలు ఏపుగా ఎదగడంతో పాటు మొక్కకు అవసరమైన వాతావరణం లభిస్తుంది. దానిమ్మ తోట చుట్టూ రూ.60వేలతో 5 లైన్ల సోలార్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశాను. దీంతో తోటకు అడవి జంతువుల నుంచి రక్షణ లభించింది. మొక్కలు నాటే ముందు... 12 ఎకరాల భూమిలో 14-11 ఫీట్ల మేర జేసీబీతో 3,200ల గోతులు తీయిం చాడు. దీనికోసం రూ.1.5లక్షల వరకు పెట్టుబడి వచ్చింది. అనంతరం ప్రతీ గోతిలో చెత్తను నింపి కాల్చేశాడు. ఇలా చేయడం వల్ల గోతిలోని హానికారక క్రిములు (బాక్టీరియా, వైరస్ వంటివి) చనిపోతాయి. అనంతరం ఒక్కో గోతి లో పచ్చిరొట్ట వేసి మొక్కను పెట్టి మట్టితో పూడ్చాడు. అంతకు ముందే డ్రి ప్పు ఏర్పాటు చేసుకుని ప్రతీ గోతి నీటి చుక్కలు పడేలా పైపులు బిగించాడు. మొదటిసారి దిగుబడి పంట వేసి మూడేళ్లైంది. ఈ ఏడాది కాపుగా ఒక్కో మొక్కకు 80 వరకు కాయలు కాశాయి. వీటిని పదిహేను రోజుల క్రితం హైదరాబాద్ మార్కెట్‌కు తరలించాడు. ఒక్కో కాయకు రూ.5 నుంచి రూ.8 వరకు ధర లభించింది. దీంతో 12 ఎకరాల దానిమ్మ తోటలో మొదటి సారి కాసిన పండ్ల విలువ రూ.12లక్షలు. కూలీలు, రవాణా చార్జీలకు గాను రూ.3 లక్షలు ఖర్చయ్యాయి. వచ్చే ఏడాది నుంచి వచ్చే కాతంతా లాభాల పంటే. చాలా కష్టపడ్డా నాకు 12 ఎకరాల బీడు భూమి ఉంది. దాన్ని ఎలాగైనా సాగులోకి తేవాలని చాలా కష్టపడ్డా. రెండేళ్ల క్రితం వేసిన బోరులో అంగుళంన్నర నీరు రావడంతో దానిమ్మ తోటను సాగు చేయాలని నిర్ణయించుకున్నా. దీనికోసం మహారాష్ట్రలోని షిర్డీ ప్రాంతంలో సాగవుతున్న దానిమ్మ తోటలను సందర్శించా. అక్కడి రైతుల కష్టమే నాకు స్ఫూర్తిదాయకంగా మారింది. - వెంకటరమణారెడ్డి