దేశంలోని చాలామంది రైతులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ రకాల వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రైతులు ఆవులు, గేదెల పెంపకాన్ని వదిలి కోళ్ల పెంపకంవైపు దృష్టి సారిస్తున్నారు. ఇది వారికి లాభదాయకమైన వ్యాపారంగా మారుతోంది.
ప్రస్తుతం దేశీ కోడి మాంసానికి మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో చిన్న, సన్నకారు పశుపోషకులు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లా భగవాన్‌పూర్ బ్లాక్‌కు చెందిన ముఖేష్ పాశ్వాన్ భార్య సంగీతా దేవి గతంలో గేదెలను పోషిస్తూ ఆదాయాన్ని ఆర్జించేవారు. దీనిలో అంతగా లాభాలు లేకపోవడంతో ఆమె దేశవాళీ కోళ్లను వాణిజ్యపరంగా పెంచడం ప్రారంభించారు.
బీహార్ ప్రభుత్వం అందించే జీవిక ఐపీడీఎస్ థర్డ్ ఫేజ్ పథకం కింద రూ.450 వెచ్చించి, 25 దేశీకోళ్లను కొనుగోలు చేసి వాటి పెంపకాన్ని చేపట్టినట్లు సంగీత మీడియాకు తెలిపారు. ఆమె దేశవాళీ కోళ్లతో పాటు కడక్‌నాథ్, సోనాలి, ఎఫ్‌ఎఫ్‌జీ జాతుల కోళ్లను కూడా పెంచసాగారు. కోడి మాంసంతో పాటు గుడ్లు, కోడిపిల్లలను సిద్ధం చేయడం ద్వారా ఆమె వ్యాపారాన్ని మరింత వృద్ధి చేశారు. ఇప్పుడు గ్రామానికి చెందిన పలువురు మహిళలు సంగీత దగ్గర దేశీ కోళ్ల పెంపకంలో మెళకువలు నేర్చుకునేందుకు వస్తున్నారు.
25 కోళ్లతో వ్యాపారం ప్రారంభించిన ఆమె దగ్గర ప్రస్తుతం 100 కోళ్లు ఉన్నాయి. స్థానికంగా కోడి గుడ్డు ధర మార్కెట్‌లో రూ.20 వరకూ ఉంది. ప్రస్తుతం ఆమె పెంచుతున్న కోళ్ల నుంచి ప్రతిరోజూ రూ. 200 విలువైన గుడ్లు వస్తున్నాయి. అలాగే రోజుకు నాలుగు నుంచి ఐదు కిలోల కోడి మాంసం సిద్ధమవుతోంది. వీటిని విక్రయిస్తూ ఆమె రోజుకు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఆదాయాన్ని అందుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment