మాయా లేదు.. మర్మం లేదు.. అబ్రకదబ్ర అనక్కర్లేదు. కోడి లేకుండానే కోడి మాంసం.. అది కూడా బోన్‌లెస్‌గా మీ ముందుకు వచ్చేస్తుంది. ఇట్టే ఆకలి తీర్చేస్తుంది. ఇదేదో విఠలాచార్య సినిమాలో సరదా సీన్ అనుకోకండి. ఈ ఏడాది నుంచే అమెరికన్ రెస్టారెంట్స్‌లో ఈ తరహా చికెన్ అందుబాటులోకి రానుంది. భారతీయులు దీనిని రుచి చూడాలంటే కనీసం ఐదారేళ్లు ఆగాల్సిందే. 2028 నాటికి భారతీయ కిరాణా దుకాణాల్లోనూ (గ్రోసరీ స్టోర్స్) ఇలాంటి చికెన్ అందుబాటులోకి వస్తుందని అంచనా.
సాక్షి, అమరావతి: చికెన్ కోసం కోడిని చంపనవసరం లేదు. చూడటానికి మృదువుగా.. తినడానికి రుచికరంగా ఉంటుంది. అదే సెల్ కల్చర్డ్ చికెన్. కృత్రిమంగా పండిస్తున్న ఈ కోడి మాంసం తినడానికి ఎంతో సురక్షితమంటూ అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఇటీవల ధ్రువీకరించింది. కోడి స్టెమ్ సెల్స్ నుంచి ఉత్పత్తి అయ్యే సెల్ కల్చర్డ్ చికెన్ త్వరలో అమెరికన్ మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. భవిష్యత్‌లో మేక, గొర్రె స్టెమ్ సెల్స్ నుంచి మటన్, పీత, బాతు వంటి స్టెమ్ సెల్స్ నుంచి ఆయా మాంసాలను కూడా ఉత్పత్తి చేసే ప్రక్రియ కూడా అందుబాటులోకి రానుంది.
విశ్వవ్యాప్తంగా 27.60 కోట్ల కిలోల వినియోగం
ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 27.60 కోట్ల కిలోల చికెన్ వినియోగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ప్రజల్లో నూటికి 95 శాతం మంది బ్రాయిలర్ కోళ్లనే ఇందుకు వినియోగిస్తున్నారు. కోళ్లకు బదులుగా ప్రత్యామ్నాయ పద్ధతిలో మాంసాన్ని పండించే సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. ఇకపై మాంసం కోసం ఏ జీవిని వ«ధించనవసరం లేకుండా.. సంబంధిత జంతువు కణాల (స్టెమ్ సెల్స్) ద్వారా ఆయా రకాల మాంసాలను ఉత్పత్తి చేస్తారు. ఈ విధానాన్ని సెల్ కల్చర్డ్ చికెన్/సెల్ కల్చర్డ్ మీట్ అంటారు. ఈ విధానంలో కోడి స్టెమ్ సెల్‌ను వినియోగించి చికెన్‌ను ఉత్పత్తి చేస్తారు. తొలివిడత చికెన్ ఉత్పత్తికి 14 రోజుల సమయం పడితే.. ఆ తరువాత దాని నుంచి ప్రతి 18, 24 గంటలకు రెట్టింపయ్యే కణాల ద్వారా మాంసం ఉత్పత్తి అవుతుంది.
విప్లవాత్మక మార్పు
ఇది నిజంగా ఆహార చరిత్రలో విప్లవాత్మక పరిణామమని, ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తగినంత కొవ్వుతో పాటు కావాలి్సన స్థాయిలో ప్రొటీన్స్, విటమిన్స్ ఈ కృత్రిమ మాంసంలో ఉంటాయని ఎఫ్‌డీఏ గుర్తించింది. పూర్తిగా బోన్‌లెస్ చికెన్ మాదిరిగా ఉండే ఈ చికెన్ శాఖాహారులకు, వివిధ కారణాలతో మాంసం తినడం మానేసిన, మానాలనుకునే వారికి ప్రత్యామ్నాయంగా ఉంటుందని చెబుతున్నారు. ఎఫ్‌డీఏ అనుమతితో అమెరికాలో ‘అప్‌సైడ్ ఫుడ్స్’ అనే సంస్థ ‘సెల్
కల్చర్డ్ చికెన్’ను ఉత్పత్తి చేస్తోంది. పలు స్టార్టప్ ఫుడ్ కంపెనీలు ఈ తరహా మాంసం ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నాయి. భవిష్యత్‌లో కల్చర్డ్ మాంసం ఉత్పత్తులు సింహభాగం మార్కెట్‌ను ఆక్రమిస్తాయని, ఈ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని
అంచనా వేస్తున్నారు.
జీవహింస చేయక్కర్లేదు
ఈ విధానం అందుబాటులోకి వస్తే మాంసాహారం కోసం జీవాలను వధించే ముప్పు తప్పుతుందని, భవిష్యత్‌లో మిగిలిన మాంసాహార ఉత్పత్తుల్ని కూడా ఇదే తరహాలో తయారు చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. కణం నుంచి ఉత్పత్తి అయ్యే కల్చర్డ్ చికెన్‌లో ఎలాంటి యాంటీబయాటిక్స్ మందుల్ని ఉపయోగించరు. ఈ విధానాన్ని సెల్యులర్ వ్యవసాయం అని పిలుస్తున్నారు. సెల్ కల్చర్డ్ మాంసాన్ని సృష్టించే ప్రక్రియ ఒక కణంతో మొదలవుతుంది. ఒక కోడి నుండి బయాప్సీ ద్వారా కణాలను వేరు చేసి సెల్ బ్యాంక్ రూపొందిస్తారు. వాటిని ఉక్కు పాత్రలో పరిపక్వం చేస్తారు. పూర్తి స్థాయిలో చికెన్ తయారవడానికి కనీసం 14 రోజుల సమయం పడుతుంది. ఆ తరువాత ప్రతి 18 నుంచి 24 గంటలకు ఆ మాంసం రెట్టింపవుతుంది.
అమెరికన్లలో 10 శాతం మంది ఆసక్తి
ప్రస్తుతం అమెరికన్లలో నూటికి 10 శాతం మంది కణాల ద్వారా ఉత్పత్తి అయ్యే ఆహారం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మార్కెట్ పరిశోధన సంస్థ మింటెల్ అసోసియేట్ పేర్కొంది. కోళ్లను వదించగా వెలువడే 10–12 శాతం గ్రీన్‌హౌస్, వా యు ఉద్గారాలకు ఈ సెల్ కల్చర్డ్ చికెన్ ద్వారా చెక్ పెట్టవచ్చంటున్నారు. కల్చర్డ్ లేదా మొక్కల ఆధారిత మాంసం ఉత్పత్తులకు భవిష్యత్‌లో మంచి డి మాండ్ ఉంటుందని, మాంసం మార్కెట్‌లో కనీ సం 10 శాతం వాటా ఆక్రమిస్తుందని చెబుతున్నా రు. అమెరికాలో ఈ ఏడాదే పూర్తిస్థాయిలో మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుండగా.. 2028 నాటికి మన దేశంలోనూ దర్శనమివ్వనుంది.
ఎఫ్‌డీఏ అనుమతి పొందిన తొలి సంస్థ మాదే
పండించిన మాంసం కోసం ఎఫ్‌డీఏ నుంచి అనుమతి పొందిన మొదటి కంపెనీగా మా సంస్థ నిలవడం ఆనందంగా ఉంది. ఈ మాంసం తినడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు సంభవించలేదని పరిశోధనల్లో వెల్లడైంది. భవిష్యత్‌లో ఇదే తరహాలో పశు మాంసం, ఎండ్రకాయలు, బాతు మాంసంతో పాటు ఇతర ఆహారాలను కూడా తయారు చేసే ఆలోచనలో ఉన్నాం. పేటెంట్ హక్కు కోసం కూడా దరఖాస్తు చేశాం.
– ఉమా వాలేటి, సీఈవో, అప్‌సైడ్ ఫుడ్స్, యూఎస్‌ఏ.
Comments
Please login to add a commentAdd a comment