కౌలుకు తీసుకున్న అరెకరంలో వ్యవసాయం చేస్తున్న అర్బన్ ఫార్మర్స్ షాన్ జోసెఫ్, రిచర్డ్ మేయర్స్
అర్బన్ కౌలు రైతుల పాట్లు కనెక్టికట్.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటి. కనెక్టికట్ రాష్ట్రంలో అధిక జనసాంద్రత గల నగరం బ్రిడ్జ్‌పోర్ట్. జీవన వ్యయం దేశంలోనే అత్యధికంగా ఉండే కనెక్టికట్‌లో.. తాజా కూరగాయలు, పండ్లు అందుబాటులో లేని ప్రాంతాలకు ఆహారాన్ని స్థానికంగానే పండించి అందించడానికి అర్బన్ ఫార్మర్స్ కృషి చేస్తున్నారు. నగరీకరణ కారణంగా వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున నివాస ప్రాంతాలుగా మార్చటం వల్ల నగరంలో పావు ఎకరం చోటు కౌలుకు దొరకటమే గగనంగా ఉందని బ్రిడ్జ్‌పోర్ట్ నగర రైతులు వాపోతున్నారు. అందుబాటులో ఉన్న చిన్న పాటి స్థలాలతోనే సిటీ ఫార్మింగ్ చేసే వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు సరిపెట్టుకుంటున్నారు.
బ్రిడ్జ్‌పోర్ట్ యువరైతు ట్రావిస్ స్టీవర్ట్ 20 సెంట్ల పెరటి స్థలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. భారలోహాలతో కలుషితమైన నేల కావటంతో ఎత్తు మడుల్లో కూరగాయలను పండిస్తున్నాడు. అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ హైడ్రోపోనిక్ పద్ధతిలోనూ పంటలు పండించటంతో పాటు గుడ్లు పెట్టే కోళ్లను, చిన్నపాటి ట్యాంకుల్లో తిలాపియా వంటి చేపలను సైతం పెంచుతున్నాడు. ‘ఒకప్పుడు సరదాగా కూరగాయలు పెంచేవాడిని. ఇప్పుడు అదే నాకు ఉపాధిగా మారింది. ఇదొక జీవన విధానం అని నమ్ముతున్నా. దీంతో పాటు పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతున్నా’ అన్నాడు స్టీవర్ట్.
షాన్ జోసెఫ్ అనే మరో యువ సిటీ ఫార్మర్ తన భాగస్వామి రిచర్డ్ మేయర్స్‌తో కలసి నగరంలోనే కౌలుకు తీసుకున్న అరెకరంలో వ్యవసాయం చేస్తున్నాడు. ఆయనకు ఏడేళ్ల ప్రాయం నుంచే తోట పని అలవాటుంది. అలాగని చదువుకోలేదనుకునేరు సుమా! నోగటక్ వ్యాలీ కమ్యూనిటీ కళాశాల నుంచి హార్టికల్చర్ డిగ్రీ పొందాడు. కార్పొరేట్ ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే మానుకోవాల్సి వచ్చింది. ఏడేళ్ల క్రితం ఒకామె తన ఇంటి పక్కన ఖాళీగా ఉన్న అరెకరం స్థలాన్ని కౌలుకు ఇవ్వటంతో అక్కడ ‘పార్క్ సిటీ హార్వెస్ట్’ పేరుతో సిటీ ఫార్మింగ్ మొదలుపెట్టారు.
బ్రిడ్జ్‌పోర్ట్‌లో 20 సెంట్ల పెరటి స్థలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న అర్బన్ రైతు ట్రావిస్ స్టీవర్ట్
తమ ఉత్పత్తులను స్థానిక రైతు మార్కెట్లలో విక్రయిస్తుంటారు. అక్కడ ఏడాదికి 7 నెలలే ఆరుబయట పంటల సాగుకు అనుకూల వాతావరణం ఉంటుంది. అందుకని, ఇంట్లోనే చిన్న కంటెయినర్లలో ఏడాది పొడవునా పెరిగే మైక్రోగ్రీన్స్‌తో పాటు ఆలివ్ ఆయిల్, కొవ్వొత్తులు, మసాలా మిశ్రమాలు, హెర్బల్ టీ, హాట్ సాస్, ఊరగాయలు, దుస్తులను కూడా తమ వెబ్‌సైట్ ద్వారా అమ్ముతూ ఈ నల్లజాతి యువ సిటీ ఫార్మర్స్ ఆదాయం పొందుతున్నారు.
జాతీయ వ్యవసాయ గణాంకాల సంస్థ ప్రకారం కనెక్టికట్ ప్రజల్లో మూడో వంతు మంది నల్లజాతీయులు, ఆదివాసులే. అయితే, అర్బన్ ఫార్మర్స్ సహా మొత్తం రైతుల్లో వీళ్లు 2 శాతం మంది మాత్రమే ఉన్నారు. భూ లభ్యత, శిక్షణ, వనరుల లేమి పెద్ద సవాళ్లుగా నిలిచాయి. వీరికి న్యాయబద్ధమైన వాటా మేరకు తాజా ఆహారాన్ని స్థానికంగా పండించి అందుబాటులోకి తేవడానికి అర్బన్ అగ్రికల్చర్, ఫుడ్ జస్టిస్ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి.
అమెరికా వ్యవసాయ శాఖ పట్టణ వ్యవసాయానికి మద్దతు ఇచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కనెక్టికట్ వ్యవసాయ వ్యవస్థలో అర్బన్ ఫార్మర్స్ కీలకమైన భాగమని అందరూ అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో పండించే పంటల్లో అద్భుతమైన వైవిధ్యం ఉంది. ఆయా పంటలను సాగు చేసే వారి సంఖ్యను పెంపొందించాలి అని ప్రభుత్వమూ భావిస్తోంది.
ఇష్టమైన పని.. ఆదాయం..
భారంగా అనిపించని ఇష్టమైన పనిని ఎంపిక చేసుకున్నాను. నాకు ముగ్గురు అబ్బాయిలు. వారికి నేను చూపించాలనుకున్నది, చెప్పాలనుకున్నది ఏమిటంటే.. తాము ఆనందంగా చేయగలిగిన పని ఏదో ఎవరికి వారు కనుగొనగలగాలి. ఆ పని ద్వారా ఆదాయం పొందే ఉపాయమూ చేయాలి.
– షాన్ జోసెఫ్, అర్బన్ ఫార్మర్, బ్రిడ్జ్‌పోర్ట్
పతంగి రాంబాబు
Prambabu.35@gmail.com
(చదవండి: దేశీ వరి పరిరక్షకుడు డా.దేబల్ దేవ్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం!)
Comments
Please login to add a commentAdd a comment