women self help groups
-
మహిళల సారథ్యంలో అభివృద్ధి వైపు భారత్
న్యూఢిల్లీ: భారతదేశం గత 9 ఏళ్లలో మహిళాభివృద్ధి నుంచి మహిళల నేతృత్వంలో అభివృద్ధి వైపు పయనించిందని ప్రధాని మోదీ అన్నారు. మహిళాస్వయం సహాయక బృందా(ఎస్‌హెచ్‌జీ)లను యూనికార్న్‌ల స్థాయికి తీసుకెళతామని చెప్పారు. మహిళా సాధికారతపై శుక్రవారం జరిగిన పోస్ట్ బడ్జెట్ వెబినార్‌లో ప్రధాని ప్రసంగించారు. ‘ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ, మేథ్స్ రంగాల్లో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం 43%కి చేరుకుంది. స్వయం సహాయ సంఘాలను కూడా ఈ ఏడాది యూనికార్న్‌లుగా మార్చాలని బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం ఎస్‌హెచ్‌జీలకు మద్దతుగా నిలుస్తాం. గత 9 ఏళ్లలో ఎస్‌హెచ్‌జీల్లో 7 కోట్ల మంది మహిళలు చేరారు. ఎస్‌హెచ్‌జీల ద్వారా అందించిన రుణాలు రూ.6.25 లక్షల కోట్లకు చేరాయి. వ్యవసాయేతర ప్రతి ఐదు వ్యాపారాల్లో ఒకటి మహిళే నడుపుతున్నారు’అని ఆయన చెప్పారు. స్టాక్ మార్కెట్లో నమోదు కాకుండానే 1 బిలియన్ డాలర్ల స్థాయికి ఎదిగిన కంపెనీలనే యూనికార్న్‌లంటారు. ‘ముద్రా రుణ గ్రహీతల్లో 70% మంది మహిళలే. వీరు తమ కుటుంబ సంపాదనను పెంచడంతోపాటు దేశానికి నూతన ఆర్థిక మార్గాలను తెరుస్తున్నారు. మహిళల పట్ల గౌరవం, సమానత్వ భావన స్థాయిలను పెంచడం ద్వారా మాత్రమే దేశం ముందుకు సాగుతుంది’అని ప్రధాని చెప్పారు. విపత్తులొస్తే నష్టాన్ని తగ్గించుకోగలగాలి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారం తీసుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. విపత్తు ముంచుకొచ్చాక స్పందించడం కంటే, ముందుగానే ఫ్యూచర్ టెక్నాలజీస్‌ని వినియోగించుకొని జరిగే నష్టాన్ని తగ్గించుకోవాలన్నారు. నేషనల్ ప్లాట్‌ఫారమ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (ఎన్పీడీఆర్ఆర్) మూడో సదస్సును శుక్రవారం ప్రారంభించి ప్రధాని మాట్లాడారు. -
గ్రామ స్వరాజ్యం.. మహిళలకే పెద్దపీట.. రాష్ట్రంలో 4,30,684 సంఘాలు
సాక్షి, హైదరాబాద్: గ్రామస్వరాజ్య లక్ష్య సాధనలో గ్రామీ ణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద, ఇతర వర్గాల మహిళలు సొంతంగా తమ కాళ్లపై నిలబడడంతో పాటు ఒక సంఘటిత శక్తిగా ఎదిగేందుకు వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని వారితో సమానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఘాలు మహిళలను పొదుపు వైపు మళ్ళించి, ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు తోడ్పతున్నాయి. మెరుగైన స్వయం ఉపాధి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 4,30,648 సంఘాలు ఉండగా, వాటిలో 46,09,843 మంది సభ్యులున్నారు. ఈ సంఘాల ద్వారా తీసుకున్న రుణాలతో అనేకమంది మహిళల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ప్రజలు రోజూ ఉపయోగించే వస్తువులను స్థానికంగా ఉత్పత్తి చేయడంలో శిక్షణనిచ్చి వారిని తయారీరంగం వైపు మళ్ళి స్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు 32 జిల్లా, 553 మండల, 17,980 గ్రామ సమాఖ్యలు పనిచేస్తున్నాయి. మహిళలు తమకున్న నైపుణ్యాలతో రకర కాల వస్తువులను తయారు చేస్తున్నారు. వీటి విక్రయానికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మేళాలు ఏర్పా టు చేస్తున్నారు. బంగ్లాదేశ్ సహా వివిధ దేశా ల్లో నిర్వహించిన ప్రదర్శనలకు రాష్ట్ర మహిళలు హాజరయ్యారు. సెర్ప్ ద్వారా రూ.65 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ రాష్ట్రంలో గ్రామీణ దారిద్య్ర నిర్మూలనా సంస్థ (సెర్ప్) ద్వారా 2022–23లో ఈ సంఘాలకు రూ.15 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ కల్పన లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు 32 జిల్లాల్లోని మహిళా సంఘాలకు నిర్దేశిత బ్యాంక్ లింకేజీ లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందించే చర్యలు ఊపందుకున్నాయి. ఇప్పటికే రూ.6,887 కోట్ల మేర లింకేజీ కల్పించారు. 2023 మార్చి 31 లోగా ఈ లింకేజీలు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు. సెర్ప్ ద్వారా గత 8 ఏళ్లలో (2014–15 నుంచి 2021–22 వరకు) రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ కలి్పంచినట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్లిప్‌కార్ట్, ప్లాంట్ లిపిడ్స్‌తో సెర్ప్ ఒప్పందం మహిళా సంఘాల ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో విస్తృత మార్కెటింగ్ అవకాశాల కల్పనకు ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, ప్లాంట్ లిపిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో సెర్ప్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా 140 రకాల ఉత్పత్తులు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆన్లైన్లో విక్రయానికి వీలు కుదిరింది. ఇలాంటి ఎంవోయూ కుదరడం దేశంలోనే మొదటిసారి. కాగా దీనివల్ల స్థానికంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి. ఈ ఏడాది రూ. 500 కోట్ల వ్యాపార లక్ష్యంగా నిర్దేశించారు. మహిళా సంఘాలకు చెందిన ఎండుమిర్చి ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఈ ఏడాది రూ.200 కోట్ల వ్యాపారం లక్ష్యంగా ప్లాంట్ లిపిడ్స్‌తో ఒప్పందం కుదిరింది. చదవండి: వానాకాలం సీఎంఆర్‌పై నీలినీడలు -
ఉపకార వేతనాలు రావట్లే..
ఖమ్మంమయూరిసెంటర్: మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల పిల్లల చదువుల కోసం మంజూరు చేసే ఉపకార వేతనాలు నిలిచి ఏళ్లు గడుస్తున్నాయి. అభయహస్తం, ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాల కింద 2014లో 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఆ తర్వాత ఈ మంజూరు ప్రక్రియ నిలవడంతో పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత కరువైంది. ఇటు మహిళల పొదుపును ప్రోత్సహిస్తూనే..వారి పిల్లల చదువులకు పోత్సాహకం అందించే ఉద్దేశంతో ఈ పథకాలు గతంలో అమలైనప్పటికీ..ఇప్పుడు పట్టింపు కరువైంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో లబ్ధిదారులను ఎంపిక చేసినా.. ఆ తర్వాత రెండేళ్లుగా అసలు ఊసే లేదు. అభయహస్తం, ఆమ్ఆద్మీ బీమా యోజన పథకాలకు నగదు చెల్లిస్తున్న మహిళల పిల్లలకు లబ్ధి కలగట్లేదు. 2014–15 ఏడాదికి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.1,200 అందజేశారు. ఆ తర్వాతి ఏడాది జాబితా రూపొందించినా స్కాలర్షిప్లు మాత్రం రాలేదు. 2015–16 ఏడాదిలో అభయహస్తం, ఆమ్‌ఆద్మీయోజన పథకాలకు సంబంధించిన స్కాలర్షిప్లు 18,943 మంది విద్యార్థులకు రావాల్సి ఉంది. అయితే 2014–15 అభయహస్తం, ఆమ్‌ఆద్మీయోజన పథకం కింద 23,698 మంది విద్యార్థులకు రూ.2,84,36,400 ఉపకార వేతనాలు అందించారు. మరో 1,200 మందికి రావాల్సి ఉంది. 2014–15, 2015–16 సంవత్సరాలకు గాను 20,143 మందిని ఉపకార వేతనాలకు అర్హులుగా అధికారులు గుర్తించారు. విద్యార్థుల డాటాను సైతం అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు. వీరికి కూడా ఒక్కో విద్యార్థికి రూ.1,200 చొప్పున ఉపకార వేతనం రావాలి. మొత్తం రూ.2,41,71,600 అందించాల్సి ఉంది. ఆర్థికంగా వెనుకబడి మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉండి పొదుపు చేసుకుంటున్న సభ్యుల పిల్లలు చదువుకునేందుకు ప్రకటించిన ఉపకార వేతనాలపై ప్రభుత్వం ఊసెత్తకపోవడంతో సభ్యుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 2016–17, 2017–18లో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను కూడా చేపట్టలేదు. ఉపకార వేతనాలకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయలేదు. దీంతో అభయహస్తం, ఆమ్ఆద్మీబీమా యోజన పథకంలో నగదు చెల్లిస్తున్న మహిళా సభ్యులు అసలు ఉపకార వేతనాలు ఇస్తారా..? ఇవ్వరా..? అనేది అర్థంగాక అయోమయానికి గురవుతున్నారు. అయితే..ఈసారైనా ప్రభుత్వం తమ పిల్లల చదువులకు సాయం చేస్తుందని మహిళా సంఘాలు ఆశిస్తున్నాయి. పథకాల లబ్ధిని అందించకపోతే కనీసం తాము చెల్లించిన నగదు అయినా తిరిగి ఇస్తే ఆర్థికంగా నష్టపోకుండా ఉంటామనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో సర్కారు ఏమైనా మార్గదర్శకాలు జారీ చేస్తుందేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. -
ఇక 'అమ్మ' మొబైల్ ఫోన్లు వస్తున్నాయి...
చెన్నై: అమ్మ క్యాంటీన్లు, అమ్మ సిమెంట్, అమ్మ మినరల్ వాటర్, అమ్మ ఉప్పు, అమ్మ స్కీమ్.. ఇలా తమిళనాడులో ప్రభుత్వ పథకాలన్నీ 'అమ్మ' మయం. తమిళులు, ముఖ్యంగా అధికార అన్నా డీఎంకే కార్యకర్తలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలితను 'అమ్మ' గా ఆరాధిస్తారు. అమ్మ పేరు మీద తమిళనాడులో మరో కానుకను మహిళలకు అందించనున్నారు. మహిళా స్వయం సహాయక గ్రూపుల్లో పనిచేసే 20 వేల మంది శిక్షకులకు 'అమ్మ' మొబైల్ ఫోన్లను అందించారు. సోమవారం జయలలిత ఈ పథకాన్ని అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని, ఇందుకోసం 15 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్టు తెలిపారు. మహిళా గ్రూపులు మీటింగ్‌లు నిర్వహించడం, నగదు చెల్లింపులు, పొదుపు, లోన్ సమాచారం తదితర విషయాలన్నింటినీ రికార్డుల్లో పొందుపరుస్తాయి. వీరికోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించనున్నట్టు జయలలిత చెప్పారు. తమిళనాడులో 6.08 లక్షల మహిళా గ్రూపులు ఉన్నారు. ఇందులో 92 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు.