ఇక 'అమ్మ' మొబైల్ ఫోన్లు వస్తున్నాయి...
చెన్నై: అమ్మ క్యాంటీన్లు, అమ్మ సిమెంట్, అమ్మ మినరల్ వాటర్, అమ్మ ఉప్పు, అమ్మ స్కీమ్.. ఇలా తమిళనాడులో ప్రభుత్వ పథకాలన్నీ 'అమ్మ' మయం. తమిళులు, ముఖ్యంగా అధికార అన్నా డీఎంకే కార్యకర్తలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలితను 'అమ్మ' గా ఆరాధిస్తారు. అమ్మ పేరు మీద తమిళనాడులో మరో కానుకను మహిళలకు అందించనున్నారు.
మహిళా స్వయం సహాయక గ్రూపుల్లో పనిచేసే 20 వేల మంది శిక్షకులకు 'అమ్మ' మొబైల్ ఫోన్లను అందించారు. సోమవారం జయలలిత ఈ పథకాన్ని అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని, ఇందుకోసం 15 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్టు తెలిపారు. మహిళా గ్రూపులు మీటింగ్లు నిర్వహించడం, నగదు చెల్లింపులు, పొదుపు, లోన్ సమాచారం తదితర విషయాలన్నింటినీ రికార్డుల్లో పొందుపరుస్తాయి. వీరికోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ను రూపొందించనున్నట్టు జయలలిత చెప్పారు. తమిళనాడులో 6.08 లక్షల మహిళా గ్రూపులు ఉన్నారు. ఇందులో 92 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు.