నెల్లూరు (పొగతోట) : జిల్లా పరిషత్ తరఫున స్త్రీ,శిశు సంక్షేమ నిధులతో రాబోయే ఐదేళ్లలో 50 వేల మంది మహిళలకు టైలరింగ్‌పై ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి చెప్పారు. మంగళవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడారు. టైలరింగ్‌కు మంచి డిమాండ్ ఉందన్నారు. టైలరింగ్ శిక్షణ కోసం గ్రామీణ మహిళలు జిల్లా కేంద్రానికి రాలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
శిక్షణకు వచ్చే మహిళలు 3 నెలల పాటు జిల్లా కేంద్రంలోనే ఉండాల్సి వస్తుందన్నారు. ఆ సమయంలో మహిళలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా ప్రతి మండల కేంద్రంలో టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కొక్క కేంద్రంలో 5 నుంచి 10 కుట్టుమిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు బ్యాంకర్లతో సంప్రదించి కుట్టుమిషన్లు కొనుగోలుకు రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
నిరుపేద మహిళలకు కుట్టుమిషన్ కొనుగోలుకు జెడ్పీ నిధుల్లో రూ.1000 మంజూరు చేస్తామన్నారు. మిగిలిన మొత్తం బ్యాంక్‌ల ద్వారా రుణంగా మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తొలివిడతగా వచ్చే నెలలో 10 మండలాల్లో టైలరింగ్ శిక్షణ కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. దశల వారీగా జిల్లాలోని అన్ని మండలాల్లో కేంద్రాలు ప్రారంభిస్తామమన్నారు. శిక్షణ తరగుతుల నిర్వహణ, కుట్టు మిషన్ల కొనుగోలు తదితర కార్యక్రమాలకు రూ.కోటి ఖర్చవుతుందన్నారు.
శిశుగృహకు సొంత భవనం నిర్మించేందుకు రూ.10 లక్షలు కేటాయించామన్నారు. నగరంలోని మహిళ ప్రాంగణానికి ప్రహరి నిర్మించేందుకు నిధుల కేటాయించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. నూతన జిల్లా పరిషత్ భవానాన్ని అధునాతన హంగులతో డిసెంబర్ లేదా జనవరిలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా పరిషత్ అనుబంధ శాఖలన్నీ ఒకే ప్రారంగణంలో ఉంటాయన్నారు. రూ. 20 లక్షల ఖర్చుతో జిల్లా పరిషత్ గెస్ట్‌హౌస్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ హస్టల్స్, పాఠశాలల దత్త ప్రక్రియ వేగంగ జరుగుతుందన్నారు.
మహిళా ప్రగతికి బాటలు
Published Wed, Nov 12 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
Advertisement