ప్రేమ పేరిట వంచించి ప్రాణం తీశాడు...
* పెళ్లి చేసుకుంటానని మోసం
* గర్భిణి అని తెలియడంతో తప్పించుకునే యత్నం
* గర్భస్రావం చేసుకుంటేనే పెళ్లంటూ ఒత్తిడి
* చివరికి ప్రాణాలు కోల్పోయిన బాలిక
విజయవాడ, న్యూస్‌లైన్ : ప్రేమించానని వెంటబడ్డాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగదీసుకున్నాడు.. తీరా ఆమె ఐదు నెలల గర్భిణి అని తెలియడంతో ముఖం చాటేశాడు. అదేమంటే ముందు గర్భస్రావం చేయించుకో.. అప్పుడు పెళ్లి చేసుకుంటానన్నాడు. దీంతో సరేనని అతనిచ్చిన మాత్రలు మింగిన ఆమె అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోయింది. విషాదకరమైన ఈ ఘటనపై పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలివీ... స్థానిక రామరాజ్యనగర్ కొండ ప్రాంతానికి చెందిన బోయి అప్పలస్వామి రిక్షా నడుపుతుండగా, భార్య మణి షాపుల్లో చిన్నపాటి పనులు చేస్తుంది. వీరి కుమార్తె నందిని (17) టైలరింగ్ నేర్చుకొని ఇంటివద్దే ఉంటుండగా.. కుమారుడు దుర్గారెడ్డి (15) పదో తరగతి చదువుతున్నాడు.
భార్యాభర్తలు ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వస్తుంటారు. కొడుకు చదువుకునేందుకు వెళ్లి సాయంత్రం వస్తాడు. దీన్ని అవకాశంగా చేసుకుని సమీపంలో నివాసముండే ఆటో డ్రైవరు నెర్సు దుర్గారావు (23) ఆమెను లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లి కోసం ఒత్తిడి తెస్తుండటంతో తనకు రూ.3 లక్షల కట్నం ఇచ్చేందుకు సంబంధం వచ్చిందని దుర్గారావు చెప్పాడు. ఈ వ్యవహారంలో వారి మధ్య కొద్దిరోజులుగా ఘర్షణ జరుగుతోంది.
గర్భస్రావం చేయించుకుంటే.. పెళ్లి చేసుకుంటానన్నాడు..
వివాదం పెరుగుతుండటంతో ఇక లాభం లేదనుకున్న దుర్గారావు గర్భస్రావం చేయించుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతని మాటలను మరోసారి విశ్వసించిన నందిని గురువారం రాత్రి దుర్గారావు తెచ్చిన మాత్రలు వేసుకుంది. ఉదయం లేచేసరికే తీవ్ర అస్వస్థతకు లోనైంది. కంగారుపడిన తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళతామన్నారు. విషయం బయటపడితే కుటుంబ సభ్యులు ఏమంటారోననే ఆందోళనతో ఆమె నిరాకరించింది. దీంతో మందుల షాపులో మాత్రలు తెచ్చిచ్చారు.
అయినా నొప్పి తగ్గకపోవడంతో ఆర్‌ఎంపీ వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. అతను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడినుంచి పాత ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో జరిగిన విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు తెలిపింది. ఆస్పత్రిలో ఆమెను పరీక్షించిన వైద్యులు ఐదు నెలల గర్భిణిగా తేల్చారు. ఆమెను బతికించేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నందిని మృతితో హతాశులైన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకుని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి న్యాయం చేయాలంటూ అక్కడే బైఠాయించారు. న్యాయం చేస్తామని వారు హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
నెలసరి నొప్పి అని సరిపెట్టుకున్నా...
అప్పుడప్పుడు కడుపు నొప్పి అనేది. నెలసరి నొప్పేమో అని మందుల షాపు నుంచి బిళ్లలు తెచ్చిచ్చేవాళ్లం. మరీ నొప్పి అంటే ఆస్పత్రికెళదామన్నా ఒప్పుకొనేది కాదు. ముందే చెప్పి ఉంటే ఇంతవరకు రానిచ్చేవాళ్లం కాదు. చెప్పి మమ్మల్ని బాధపెట్టకూడదని.. తాను మాత్రం ప్రాణాలు తీసుకుంది.. అంటూ నందిని తల్లి మణి పడే వేదన చూపరుల హృదయాలను ద్రవింపజేసింది.
వేణ్ణీళ్లెవరు పెడతారు...
ఉదయం వెళితే రాత్రికి గాని ఇంటికి రాను. రాగానే ఆప్యాయంగా పలకరించేది. వెంటనే స్నానానికి వేణ్ణీళ్లు పెట్టేది. స్నానం చేసిన తర్వాత ‘కష్టపడి వచ్చావు నాన్నా’ అంటూ ఒళ్లంతా కొబ్బరి నూనె రాసి మర్దనా చేసేది. ఇకపై నాకు వేణ్ణీళ్లు ఎవరు పెడతారంటూ అప్పారావు కన్నీరుమున్నీరుగా రోదించడం పోలీసులను సైతం చలింపజేసింది.