బిడ్డలకు భారం కాకూడదని..
► ప్రాణ త్యాగానికి పాల్పడిన ఓ మాతృమూర్తి
► పట్టెడన్నం కూడా పెట్టలేమన్న ప్రబుద్ధులు
వినుకొండ రూరల్ : కన్న కొడుకులకు భారంగా మారానన్న ఆవేదనతో ఓ మాతృమూర్తి ప్రాణ త్యాగానికి పాల్పడింది. రెండస్థుల మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వినుకొండ 21వ వార్డులోని సట్టు బజారుకు చెందిన షేక్ బషీరూన్ (55) కు ఇద్దరు కొడుకులు. భర్త చనిపోయి పదేళ్లు దాటింది. అప్పటి నుంచి ఇద్దరు కొడుకుల వద్ద వంతులవారీగా ఉంటూ రోజులు నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో కొడుకులు రెండు రోజులుగా.. నేను చూడనంటే, నేను చూడనంటూ వాదనకు దిగారు. దీంతో ఆ తల్లి హృదయం గాయపడింది. తాను చనిపోవడమే సమస్యకు పరిష్కారం అనుకుంది. ఆలోచన వచ్చిన వెంటనే ఒక్క ఉదుటున పరుగు పరుగున వెళ్లి ఎదురుగా ఉన్న రెండస్థుల భవనంపైకి ఎక్కి దూకేసింది. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కన్న తల్లికి పట్టెడన్నం కూడా..
నవమాసాలు మోసి ప్రాణాలు ఫణంగా పెట్టి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లికి పెరిగి పెద్దయిన కొడుకులు పట్టెడన్నం కూడా పెట్టకుండా రోజులు, నెలలు అంటూ వంతులు వేసుకోవటం ఆ మాతృమూర్తి మనస్సును కలచివేసింది. ఇంట్లో ఒక్కరికే అన్నం ఉంటే నాకు ఆకలిగా లేదు.. అని చెప్పే తల్లి మాటలు ఒక్కసారి కూడా గుర్తుకు తెచ్చుకోలేని కొడుకులు ఉన్నా లేనట్లేనని చుట్టుపక్కల వారు చీత్కరించుకుంటున్నారు. బషీరూన్‌కు ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు కరిముల్లా వాటర్ సర్వీసింగ్ పని చేస్తుంటాడు. చిన్న కుమారుడు కాలేషా టైలరింగ్ చేస్తుంటాడు. భర్త మృతి చెందటంతో బషీరూన్ పూర్తిగా కొడుకుల సంపాదనపైనే ఆధారపడాల్సిన స్థితి ఏర్పడింది. అప్పటి నుంచి కొడుకులు ఇద్దరూ తల్లికి అన్నం పెట్టేందుకు వంతులు వేసుకున్నారు.
నెలకు ఒకరు చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇటీవల ఒప్పందం ప్రకారం కూడా అన్నం పెట్టలేమని తేల్చటంతో విరక్తి చెందిన ఆ మాతృమూర్తి ప్రాణ త్యాగానికి పాల్పడింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.