‘నీ విద్య నువు సరిగా నేర్చుకో... డబ్బు, గుర్తింపు అవే వస్తాయి’ అంటోంది ఈ టైలరమ్మ. బట్టలు కొత్తగా కుట్టడం కూడా లక్షలు తెచ్చి పెడతాయా? .. పెడతాయి. పల్లెటూళ్లో వ్యవసాయం చేసుకుంటూ రాత్రిళ్లు కుట్టు పని చేసిన ధోలీ యూ ట్యూబ్‌లో అందరూ టాలెంట్ ప్రదర్శించడం చూసి తను కూడా టైలరింగ్‌ను యూ ట్యూబ్‌లో చూపెట్టింది. రకరకాల స్త్రీల దుస్తులను కట్ చేసి కెమెరా ముందు కుడుతుండేసరికి లక్షల మంది ఫాలోయెర్లు ఏర్పడ్డారు. కుట్టడానికి ఆర్డర్లు వచ్చిపడుతున్నాయి. యూ ట్యూబ్ నెల తిరిగే సరికి చెక్ పంపుతోంది. అవార్డులు కూడా మొదలయ్యాయి. కత్తెర, టేప్‌తో ఒక మహిళ సాధించిన విజయం ఇది. నవ్యమైన ఐడియానే ఆమె విజయానికి కారణం.
‘కొందరు విధిని నమ్ముకుని కూచుంటారు. కొందరు మాత్రం తమ విధిరాతను తామే రాసుకుంటారు’ అంటుంది ధోలి. ఈమె ఇప్పుడు రాజ్ మసంద్‌లో ఉంటుంది. ఇది రాజస్థాన్‌లోని ఒక మోస్తరు సిటీ. కాని అక్కడి నుంచే దేశం మొత్తానికి తెలిసింది. ఇంకా చెప్పాలంటే ఎక్కడెక్కడైతే భారతీయులు ఉన్నారో అక్కడి వారికి కూడా తెలిసింది. దానికి కారణం బట్టలు కుట్టడంలో ధోలికి ఉండే విశేష ప్రతిభ, సృజనాత్మకత. వేగం. కొత్తదనం. స్త్రీలు ధరించే అన్ని రకాల వస్త్రాలను మరింత కొత్తగా ఎలా చేయవచ్చో, ఎలా ఆకర్షణీయంగా మలచవచ్చో ధోలి చేసే వీడియోల్లో చూడొచ్చు. కొందరు విద్యను దాచుకుంటారు. కాని ధోలి తనలాంటి స్త్రీలు టైలరింగ్ నేర్చుకుని తమ కాళ్ల మీద తాము నిలబడాలని తెలిసిందంతా చెప్పేస్తుంది. అందుకే ఆమెకు అంత ప్రచారం. మన్నన.
బాల్య వివాహం చేసుకుని
ధోలిది రాజస్థాన్‌లోని భరత్‌పూర్. తండ్రి వ్యవసాయం చేసేవాడు. వెనుకబడిన ్రపాంతం కావడంతో 10 సంవత్సరాలకే పెళ్లి చేసి ఈడేరాక అత్తారింటికి పంపాడు. 18 ఏళ్లు వచ్చేసరికి ధోలి ముగ్గురు పిల్లల తల్లి. అత్తారింటిలో పెద్ద కోడలు కావడం వల్ల బండెడు చాకిరీ ఉండేది. పగలు పొ లంలో కూలి పని చేసేది. పాలు పితికి అమ్మేది. చిన్నప్పటి నుంచి టైలరింగ్ అంటే ఆసక్తి ఉండటం వల్ల నేర్చుకోవడంతో రాత్రిళ్లు కరెంటు లేని ఇంట్లో కిరోసిన్ దీపం కింద కుట్టేది. కాని బతుకు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టుగానే ఉండేది.
సిటీకి మారాక
కొన్ని కారణాల వల్ల పట్నమైన రాజ్ మసంద్‌కు ధోలి కాపురం మార్చింది. అక్కడ టైలరింగ్ మొదలెట్టింది. 2016లో యూట్యూబ్ ఆమె దృష్టికి వచ్చింది. అందులో రకరకాల వ్యక్తులు తమకు తెలిసిన విద్యలు వీడియోలు చేసి పెట్టడం గమనించింది. ‘నేనెందుకు నా టైలర్ విద్యను ప్రదర్శించకూడదు’ అని వీడియోలు చేసి పెట్టింది. రోడ్డు మీద ఉండే తన ఇంటిలో రోడ్డు రణగొణ ధ్వనుల మధ్య ఆ వీడియోలు చేసి అప్‌లోడ్ చేసింది. కాని అంతగా గుర్తింపు రాలేదు. ధోలి ఆగలేదు. వీడియోలు బాగా గమనించి ఎలా చేయాలో తెలుసుకుని 2017లో ‘ఘోరి ఫ్యాషన్ డిజైనర్’ పేరుతో యూట్యూబ్ చానల్ తెరిచింది.
27 కోట్ల వ్యూస్
టైలరింగ్ పని నేర్చుకోవాలని చాలా మంది స్త్రీలకు ఉంటుంది. కొత్త కొత్త ఫ్యాషన్స్ ఫాలో కావాలని మరికొంత మంది స్త్రీలకు ఉంటుంది. వీరంతా వెంటనే ధోలి చేస్తున్న వీడియోలను ఇష్టపడి చానల్‌కు సబ్‌స్క్రయిబ్ చేశారు. ఏ బట్టను ఏ మోడల్‌తో ఎలా కుట్టాలో ధోలి చకచకా చెప్తూ కుట్టి చూపుతుంది కాబట్టి వాటిని ఫాలో కాసాగారు. కుర్తీలు, అనార్కలి డ్రస్సులు, బ్లౌజ్‌లు... ఒకటని ఏముంది చాలా కొత్తరకంగా ధోలి డిజైన్లు ఉంటాయి. యూ ట్యూబ్ నుంచి తొలి పారితోషికంగా 11 వేల రూపాయలు వచ్చాయి. ఇప్పుడు ఆమెకు 16 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. ఇప్పటికి 700 వీడియోలు చేసి అప్‌లోడ్ చేసింది. వీటికి 27 కోట్ల వ్యూస్ వచ్చాయి. యూ ట్యూబ్ నుంచి నెలకు లక్షకు పైగా పారితోషికం అందుతోంది. అంటే ధోలి ఎంత సక్సెస్‌ఫుల్ టైలరమ్మో అర్థం చేసుకోవచ్చు. తన ప్రచారం కోసం ఫేస్‌బుక్‌లోనూ ఇన్‌స్టాలోనూ అకౌంట్లు తెరిచింది.
రోజుకు 20 రూపాయల నుంచి
ఒకప్పుడు పల్లెటూళ్లో రాత్రిళ్లు బట్టలు కుడితే అతి కష్టమ్మీద రోజుకు 20 రూపాయలు వచ్చేవి. ఇవాళ ధోలి కేవలం తన ప్రతిభ, సృజనాత్మకతతో పాటు సోషల్ మీడియా సహాయంగా పెద్ద సంపాదన చూస్తోంది. రాజ్ మసంద్‌లో మంచి ఇల్లు ఏర్పాటు చేసుకుంది. ఆమెను పిలిచి అవార్డులు ఇచ్చి గౌరవిస్తున్నారు. ‘ఎదుటి వారిని ఓడించడం కంటే మనం గెలవడం ముఖ్యం అనుకోవాలి. మనలోని ప్రతికూల భావాలను తీసేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం’ అంటుంది ధోలి.
Comments
Please login to add a commentAdd a comment