సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఉప్పు దగ్గర నుంచి సబ్బు వరకు దేన్నీ ఆమె వదల్లేదు.. సరుకులను రవాణా చేసే కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు. సరఫరా చేసిన సరుకులు తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నట్లు నకిలీ రికార్డులు సృష్టించి.. ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. దోచిపెట్టిన సొమ్ములో వాటాలు దండుకుని కోట్లకు పడగలెత్తారు. విద్యార్థుల నోళ్లు కొట్టి.. విలాసాలకు మరిగారు.
కోట్లకు పడగలెత్తిన ఆ అక్రమాధికారిణే సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ అరుణకుమారి. అవినీతి నిరోధకశాఖ దర్యాప్తులో అరుణకుమారి అక్రమాల బాగోతం మొత్తం బహిర్గతమవుతోంది. ఇప్పటికే ఏసీబీ దర్యాప్తులో రూ.నాలుగు కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగుచూడగా.. మరో రూ.ఎనిమిది కోట్ల విలువైన అక్రమాస్తులు బహిర్గతమయ్యే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
హిందూపురంలో సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తోన్న అరుణకుమారి.. జిల్లాలో ఉన్న 13 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలకు కన్వీనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టైలరింగ్ పనుల కాంట్రాక్టర్ సుస్మిత తరఫున లక్ష్మిరెడ్డి నుంచి రూ.ఐదు వేలు లంచం తీసుకుంటుండగా అక్టోబరు 26న ఏసీబీ అధికారులు దాడి చేసి, ఆమెను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. అదే రోజున ఆమె నివాసంలో జరిపిన సోదాల్లో రూ.4.47 లక్షల నగదు, 18 తులాల బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సోదాల్లో ఆమెకు రెండు బ్యాంకుల్లో ఉన్న లాకర్లకు సంబంధించిన తాళాలు, విలువైన డాక్యుమెంట్లు కూడా బయటపడ్డాయి. వాటి ఆధారంగా వారం రోజులుగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. శనివారం అనంతపురంలో కరూర్ వైశ్యా బ్యాంకులో ఆమెకు సంబంధించిన లాకర్‌ను తెరిచారు.
ఇందులో రూ.40 లక్షల నగదు, ఆరు తులాల బంగారం ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. సోమవారం హిందూపురం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో మరో లాకర్‌ను తెరిచారు. అందులోంచి రూ.పది లక్షలు, రూ.27 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటూ అనంతపురంలో 17 పోర్షన్లతో కూడిన ఐదు భవనాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. అనంతపురం, హిందూపురం, బెంగళూరులలో విలువైన ఇంటి స్థలాలు ఉన్నట్లు తేల్చారు. వాటి విలువ రూ.నాలుగు కోట్లకుపైగానే ఉంటుందని ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి చెప్పారు.
మరో రూ.ఎనిమిది కోట్ల ఆస్తులు
అత్యంత విలువైన ఇళ్లు, భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, భారీ ఎత్తున బంగారు అభరణాలు నిల్వ చేసిన బ్యాంకు లాకర్ తాళం అరుణకుమారి తన సమీప బంధువుల ఇళ్లలో దాచినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. అనంతపురంలో ప్రస్తుతం వెలుగుచూసిన ఐదు భవనాలు కాకుండా మరో ఎనిమిది భవంతులు ఉన్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనంతపురంలోని ఓ జాతీయ బ్యాంకులో అరుణకుమారికి లాకర్ ఉందని.. అందులో భారీ ఎత్తున బంగారు అభరణాలు దాచారని కూడా ఆ ఫిర్యాదులో స్పష్టం చేస్తూ వివరాలను పొందుపరిచారు. ఈ ఫిర్యాదు అరుణకుమారి సమీప బంధువులే చేయడంతో ఏసీబీ అధికారులు దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆ ఫిర్యాదులో పేర్కొన్న ఆస్తుల విలువను పరిగణనలోకి తీసుకుంటే మరో రూ.ఎనిమిది కోట్లు ఉంటుందని లెక్క వేస్తున్నారు. అరుణకుమారి సమీప బంధువులు ఇచ్చిన సమాచారం ఆధారంగా రెండు రోజులుగా ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఆమె అక్రమాస్తులపై వారం రోజుల్లోగా స్పష్టమైన ప్రకటన చేస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అరుణకుమారి భారీ ఎత్తున అక్రమాస్తులను కూడబెట్టడం అధికారవర్గాల్లో కలకలం రేపింది. గతంలో అరుణకుమారి అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా చూసీచూడనట్లు వ్యవహరించారని సాంఘిక సంక్షేమశాఖ వర్గాలు వెల్లడించాయి. సంపాదించిన ప్రతి పైసాలోనూ ఉన్నతాధికారులకు ఆమె వాటాలు అప్పగించడం వల్లే.. ఆ శాఖలో ఆమె మాటకు ఎదురులేకుండా పోయిందని సిబ్బంది వాపోతున్నారు.
తవ్విన కొద్దీ అక్రమాస్తులే!
Published Fri, Nov 22 2013 2:41 AM | Last Updated on Thu, Mar 21 2019 9:07 PM
Advertisement
Advertisement