సుమ రెండేళ్ల కిందట బ్యూటీ పార్లర్ మొదలు పెట్టింది. కానీ తాను ఊహించినంత గొప్పగా సాగడంలేదు. దాంతో ఫ్రస్ట్రేషన్‌కి లోనయ్యింది. అదే సమయంలో పర్స్‌లో ప్రతి శుక్రవారం ఆరు యాలకులు పెట్టుకుంటే కోరుకున్నది జరుగుతుందని యూట్యూబ్‌లో ఒక వీడియో చూసింది. రెండు మూడు నెలల పాటు దాన్ని ఫాలో అయ్యింది.
కానీ తన బిజినెస్‌లో ఎలాంటి మార్పూ రాలేదు. ఆ సమయంలోనే యూట్యూబ్‌లో మరో వీడియో కనిపించింది.. మీకేం కావాలనుకున్నారో అది బిర్యానీ ఆకుపై రాసి, కాల్చి బూడిద చేసి, ఆ బూడిదను ఆకాశంలోకి ఊదుతూ మీకేం కావాలో కోరుకుంటే అది జరుగుతుంది అని! చాలా ఆశగా ఆ పని చేసింది. ఒకసారి కాదు, పలుసార్లు. ఫలితం శూన్యం. పది వేల రూపాయలు ఖర్చుపెట్టి ఒక వర్క్‌షాప్‌కి హాజరయ్యింది. విజన్ బోర్డ్ తయారు చేసుకుంది. తనకేం కావాలో అఫర్మేషన్స్ రూపంలో రోజూ క్రమం తప్పకుండా రాసింది.
కానీ తన బ్యూటీ పార్లర్ బిజినెస్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలానే ఉంది. ఏం చేయాలో అర్థం కాక తీవ్రమైన ఒత్తిడికి లోనయింది. ఆ ఒత్తిడిని భర్తపై, పిల్లలపై చూపించింది. వీటన్నింటినీ గమనించిన భర్త.. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని కౌన్సెలింగ్‌కి తీసుకువచ్చాడు.
అశాస్త్రీయం.. అభూత కల్పనలు..
సుమలానే చాలామంది సక్సెస్ కోసం, సంతోషం కోసం, కోరుకున్నది జరగడం కోసం షార్ట్ కట్స్ వెతుకుతుంటారు. అలాంటివారికి సులువైన చిట్కాలిస్తూ యూట్యూబ్‌లో వందలు, వేల వీడియోలు కనిపిస్తాయి. ఆ మార్గాలు సులువుగా ఉండటం వల్ల వాటిని పాటిస్తూ, ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వీటన్నింటికీ మూలం ‘లా ఆఫ్ అట్రాక్షన్’ అనే సిద్ధాంతం.
‘ప్రతికూల ఆలోచనల వల్ల ప్రతికూల ఫలితాలే వస్తాయి. సానుకూల ఆలోచనల వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు సానుకూలంగా ఆలోచిస్తుంటే అవి నెరవేరేలా విశ్వం మీకు సహాయపడుతుంది. విశ్వంలోని శక్తులన్నింటినీ మీవైపు ఆకర్షించి మీ ఆలోచనలు సాకారమయ్యేలా చేస్తుంది’ అనేదే లా ఆఫ్ అట్రాక్షన్. ఆలోచనలకు విశ్వం ప్రతిస్పందిస్తుందని దీన్ని నమ్మేవారు చెప్తారు.
ఎనర్జీ, ఎలక్ట్రాన్స్, ఫ్రీక్వెన్సీ, క్వాంటమ్ ఫిజిక్స్ లాంటి సైన్స్‌కి సంబంధించిన పదాలను వాడుతుంటారు. కానీ నిజానికి సైన్స్‌కి ‘లా ఆఫ్ అట్రాక్షన్’కి ఎలాంటి సంబంధమూ లేదు. ఇది అశాస్త్రీయమైన అభూత కల్పనలతో నిండిన ఒక మెటాఫిజికల్ సూడోసైన్స్ మాత్రమే.
మీకు ఎప్పుడేది ఇవ్వాలో విశ్వానికి తెలుసునని, దాన్ని నమ్ముకుని లక్ష్యాన్ని సాధించినట్లు విశ్వసిస్తే చాలని ప్రబోధిస్తారు. కన్ఫర్మేషన్ బయాస్ వల్ల చాలామంది ఈ మాటలను, సిద్ధాంతాన్ని నమ్ముతారు. అఫర్మేషన్స్ రాసుకుంటూ, జపిస్తూ సుమలానే కాలాన్ని వృథా చేస్తుంటారు. తాము కోరుకున్నది ఎప్పటికీ జరక్క ఫ్రస్ట్రేషన్‌కి, ఒత్తిడికి లోనవుతారు.
యూనివర్సిటీల అధ్యయనం
లా ఆఫ్ అట్రాక్షన్, విజన్ బోర్డ్‌ల ప్రభావాన్ని అధ్యయనం చేయడం కోసం కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఒక ప్రయోగం జరిగింది. అక్కడ చదువుతున్న కొందరు విద్యార్థులను మూడు గ్రూపులుగా విభజించారు. టాప్ గ్రేడ్స్ సాధిస్తే ఎలా ఉంటుందో మొదటి గ్రూప్‌ని ఊహించమన్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చదువుకోవాలో ఊహించమని రెండో గ్రూప్‌కి చెప్పారు. మూడో గ్రూప్‌కి ఎలాంటి సలహాలూ ఇవ్వలేదు.
మొదటి గ్రూప్ విద్యార్థులు ఎక్కువ విజువలైజ్ చేసి, తక్కువ చదివి, తక్కువ గ్రేడ్‌లు సాధించారు. చదువుతున్నట్లు ఊహించుకుని చదివిన రెండో గ్రూప్ విద్యార్థులు తక్కువ వత్తిడితో ఎక్కువ మార్కులు సాధించారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో జరిగిన అధ్యయనంలో కూడా ఇలాంటి ఫలితాలే వెలువడ్డాయి.
పని చేయాల్సిందే..
►గాలిలో దీపం పెట్టి ఆరిపోకూడదని కోరుకున్నట్లుగా.. లవంగాలు, యాలకులను బ్యాగుల్లో.. జేబుల్లో పెట్టుకోవడం వల్ల, బిర్యానీ ఆకులను కాల్చి గాలిలో ఊదడం లాంటి చిట్కాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని గుర్తించాలి.
►అఫర్మేషన్స్, విజన్ బోర్డ్ లాంటివి లక్ష్యం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడటానికి ఉపయోగపడతాయి. వాటి ప్రయోజనం అంతవరకేనని గుర్తించాలి.
►విశ్వం ఒక వ్యక్తి కాదని, అది మన ఆలోచనలు, మాటలు వినదని అర్థం చేసుకోవాలి.
►‘‘కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి’’ అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పారు. అంటే కలలు కనడంతోనే సంతృప్తిపడితే సరిపోదు. వాటిని సాకారం చేసుకోవడానికి ప్రణాళికలు వేసుకుని తదనుగుణంగా శ్రమించాలి.
►లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకుని, అంచెలంచెలుగా దాన్ని పూర్తి చేసుకుంటూ కలలను సాకారం చేసుకోవాలి.
-సైకాలజిస్ట్ విశేష్
Comments
Please login to add a commentAdd a comment