నాలుగు సెట్‌లలో నెగ్గిన సెర్బియా దిగ్గజం
డిఫెండింగ్ చాంపియన్ సినెర్ శుభారంభం
తొలి రౌండ్‌లోనే ఓడిన 11వ సీడ్ సిట్సిపాస్
అటువైపు ప్రత్యర్థి 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత... ఏకంగా 1126 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ప్లేయర్... కెరీర్‌లో ఇప్పటికే 76 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన అనుభవం సొంతం... ఇటువైపు ప్లేయర్‌కు ‘వైల్డ్ కార్డు’ ద్వారా కెరీర్‌లోనే తొలి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడే అవకాశం... ఎదురైన ప్రత్యర్థి తానెంతో ఇష్టపడే ఆటగాడు... ఇద్దరి బలాబలాలు పరిశీలిస్తే మ్యాచ్ ఏకపక్షంగా వరుస సెట్‌లలో ముగియడం ఖాయమని విశ్లేషకుల ఏకాభిప్రాయం... కానీ అలాంటిదేమీ జరగలేదు.
ఒకే ఒక్క మ్యాచ్‌తో టెన్నిస్ ప్రపంచాన్ని ఆకర్షించేందుకు వచ్చిన అవకాశాన్ని ఆ కుర్రాడు వదులుకోలేదు. తన అసమాన పోరాటపటిమతో అందరి దృష్టిలో పడ్డాడు. అతడే 19 ఏళ్ల నిశేష్ బసవరెడ్డి... తెలుగు సంతతికి చెందిన అమెరికన్ టెన్నిస్ టీనేజ్ రైజింగ్ స్టార్.. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో నిశేష్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయినా... ప్రతి పాయింట్ సాధించేందుకు జొకోవిచ్‌ను తెగ కష్టపెట్టాడు. నిశేష్‌కు ఎంతో భవిష్యత్ ఉందని మ్యాచ్ అనంతరం జొకోవిచ్ కూడా వ్యాఖ్యానించడం విశేషం.
మెల్‌బోర్న్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌సింగిల్స్ టైటిల్ లక్ష్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తొలి అడ్డంకిని అధిగమించాడు. ప్రపంచ 107వ ర్యాంకర్, అమెరికన్ రైజింగ్ టీనేజ్ టెన్నిస్ స్టార్ నిశేష్ బసవరెడ్డితో జరిగిన తొలి రౌండ్ పోరులో జొకోవిచ్ గెలిచి 18వ సారి ఈ టోర్నీలో రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. 2 గంటల 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నిశేష్ 6–4, 3–6, 4–6, 2–6తో జొకోవిచ్ చేతిలో పోరాడి ఓడిపోయాడు.
గత నెలలోనే ప్రొఫెషనల్‌గా మారిన 19 ఏళ్ల నిశేష్ ఏమాత్రం తడబడకుండా తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బేస్‌లైన్ వద్ద సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూనే... అడపాదడపా డ్రాప్ షాట్‌లు... కళ్లు చెదిరే రిటర్న్‌లతో వరుసగా 21వ ఏడాది గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న జొకోవిచ్‌కు ఇబ్బంది పెట్టడంలో నిశేష్ సఫలమయ్యాడు. తొలి సెట్‌లోని ఎనిమిదో గేమ్‌లో జొకోవిచ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన నిశేష్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 5–3తో ముందంజ వేశాడు.
తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్ కాపాడుకోగా... పదో గేమ్‌లో నిశేష్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను 49 నిమిషాల్లో 6–4తో సొంతం చేసుకోవడంతో మ్యాచ్‌ను మైదానంలో ప్రత్యక్షంగా చూస్తున్న వేలాది మంది ప్రేక్షకులు, టీవీల ముందున్న లక్షలాది వీక్షకులు ఆశ్చర్యపోయారు. తొలి సెట్ నెగ్గిన ఉత్సాహంతో రెండో సెట్‌లోనూ నిశేష్ భేషుగ్గా ఆడాడు. అయితే అపార అనుభవజ్ఞుడైన జొకోవిచ్ టీనేజర్ నిశేష్ ఆటతీరుపై అవగాహన పెంచుకొని దూకుడు పెంచాడు.
స్కోరు 4–3 వద్ద ఎనిమిదో గేమ్‌లో నిశేష్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని 44 నిమిషాల్లో రెండో సెట్ దక్కించుకొని లయలోకి వచ్చాడు. రెండో సెట్‌లోని చివరి గేమ్ ఆడుతున్న సమయంలో నిశేష్ కాలు బెణకడంతో అతను ఆ తర్వాత చురుగ్గా కదల్లేకపోయాడు. మరోవైపు జొకోవిచ్ మరింత జోరు పెంచాడు. మూడో సెట్‌లోని తొలి గేమ్‌లోనే నిశేష్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సరీ్వస్‌లను కాపాడుకొని 43 నిమిషాల్లో సెట్‌ను సొంతం చేసుకున్నాడు.
నాలుగో సెట్‌లో కూడా తొలి గేమ్‌లో, ఐదో గేమ్‌లో నిశేష్ సర్వీస్‌లను బ్రేక్ చేసిన జొకోవిచ్ కళ్లు చెదిరే ఏస్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ‘నిశేష్ పరిపూర్ణ క్రీడాకారుడిలా ఆడాడు. అతను ఆడిన కొన్ని షాట్‌లు నన్నే ఆశ్చర్యానికి గురి చేశాయి. చివరి పాయింట్ వరకు పోరాటపటిమతో ఆకట్టుకున్నాడు. భవిష్యత్ లో నిశేష్ ఆటతీరును చాలాసార్లు చూస్తాము.
ఇందులో సందేహం లేదు’ అని మ్యాచ్ ముగిశాక జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. 2005లో అమెరికాలో పుట్టి పెరిగిన నిశేష్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశాడు. నిశేష్ తల్లిదండ్రులు మురళీ రెడ్డి, సాయిప్రసన్న స్వస్థలం నెల్లూరు జిల్లా. 1999లో ఉద్యోగరీత్యా భారత్ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తొలి రౌండ్‌లో ఓడిన
నిశేష్‌కు 1,32,000 ఆ్రస్టేలియన్ డాలర్ల (రూ. 70 లక్షల 47 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 10 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీ ముగిశాక విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో నిశేష్ కెరీర్ బెస్ట్ 104వ ర్యాంక్‌కు చేరుకుంటాడు.
అల్‌కరాజ్ అలవోకగా...
పురుషుల సింగిల్స్‌లో సోమవారం స్టార్ ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 11వ సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టగా... డిఫెండింగ్ చాంపియన్ సినెర్ (ఇటలీ), మూడో సీడ్ అల్‌కరాజ్ (స్పెయిన్) రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. 2023 ఆ్రస్టేలియన్ ఓపెన్ రన్నరప్ సిట్సిపాస్ 5–7, 3–6, 6–2, 4–6తో మికిల్సన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు.
2018 తర్వాత ఈ టోర్నీలో సిట్సిపాస్ తొలి రౌండ్‌లోనే ఓడిపోవ డం గమనార్హం. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సినెర్ 7–6 (7/2), 7–6 (7/5), 6–1తో నికోలస్ (చిలీ)పై, అల్‌కరాజ్ 6–1, 7–5, 6–1తో షెవ్‌చెంకో (కజకిస్తాన్)పై విజయం సాధించారు. పసారో (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో పదో సీడ్ దిమిత్రోవ్ గాయం కారణంగా రెండో సెట్‌లో వైదొలిగాడు.
21-టెన్నిస్ ఓపెన్ శకంలో (1968 నుంచి) వరుసగా 21వ ఏడాది జొకోవిచ్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ఒక్క విజయమైనా సాధించాడు. ఈ జాబితాలో రోజర్ ఫెడరర్ (22 ఏళ్లు) మాత్రమే
ముందున్నాడు.
429-ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా ఫెడరర్ (429 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో బరిలోకి దిగితే ఫెడరర్ రికార్డును అధిగమిస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment