టెన్నిస్ చరిత్రలో 'ఆల్ టైమ్ గ్రేట్' ఎవరు..? టెన్నిస్ అభిమానులు గంటల తరబడి ఈ ప్రశ్న గురించి చర్చించుకుంటారు. ఇంతకీ పురుషుల టెన్నిస్‌లో "GOAT" ఎవరు..? ఈ ప్రశ్నపై జరిగే చర్చలో జాన్ మెకెన్రో, జాన్ బోర్గ్, పీట్ సాంప్రస్, జిమ్మీ కానర్స్ వంటి దిగ్గజాల పేర్లు కచ్చితంగా ప్రస్తావనకు వస్తాయి. కానీ ఇటీవల కాలంలో గ్రాండ్ స్లాం టెన్నిస్ టోర్నమెంట్లను శాసించిన నోవాక్ జకోవిచ్, రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్‌ల పేర్లు ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటాయి.
ముగ్గురిలో ఒక్కడే మిగిలాడు
సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్ ఈ జాబితా లో అగ్రస్థానంలో ఉన్నాడు. 2023 యుఎస్ ఓపెన్ విజయం తరువాత జకోవిచ్ మొత్తం 24 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల తో ఎవ్వరికీ అందనంత ఎత్తు కి చేరుకున్నాడు. జకోవిచ్ తన 24 స్లామ్‌లలో 10 ఆస్ట్రేలియా ఓపెన్ లో సాధించి, మెల్‌బోర్న్ హార్డ్ కోర్టులపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు.
ఆల్ టైమ్ "క్లే కింగ్" గా పేరుపొందిన నాదల్ తన 22 గ్రాండ్ స్లాం టైటిళ్ల లో 14 ఫ్రెంచ్ ఓపెన్ లో చేజిక్కించుకోగా.. ఫెదరర్ సాధించిన 20 గ్రాండ్ స్లాం విజయాలలో ఎనిమిది వింబుల్డన్ టైటిళ్లు కావడం విశేషం.
ఈ ముగ్గురి లో ప్రస్తుతం జకోవిచ్ మాత్రమే టెన్నిస్ బరిలో మిగిలాడు. ఫెదరర్ 2022 సెప్టెంబర్ లో రిటైర్మెంట్ ప్రకటించాడు. గాయాల బారిన పడిన స్పానిష్ ఆటగాడు నాదల్ సైతం గత నవంబర్ లో ఆటకి స్వస్తి చెప్పాడు.
గత ఏడాది ఒలింపిక్ స్వర్ణం ఒక్కటే
జకోవిచ్ విషయానికి వస్తే, గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో జకో తన మొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించాడు. అయితే జకోవిచ్ గతేడాది ఒలింపిక్ స్వర్ణం మినహా మరే గ్రాండ్ స్లాం టైటిల్ గెలవలేక పోయాడు. వచ్చే ఆదివారం ప్రారంభమయ్యే 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకో తన ప్రారంభ రౌండ్‌లోభారత సంతతి కి చెందిన వైల్డ్‌కార్డ్ ఆటగాడు నిశేష్ బసవరెడ్డితో తలపడనున్నాడు.
జకోవిచ్ ఇప్పటికీ తన అద్భుతమైన ప్రదర్శనతో టెన్నిస్ కెరీర్‌ను కొనసాగిస్తున్నప్పటికీ అతని చిరకాల ప్రత్యర్థులైన ఫెదరర్, రాఫెల్ నాదల్ రిటైర్మెంట్ లతో అతని దృక్పధం లో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా జకోవిచ్ తండ్రి అతని రిటైర్మెంట్ గురుంచి ఒత్తిడి తెస్తున్నాడు. "గత కొంత కాలంగా నన్ను టెన్నిస్ నుంచి రిటైర్ చేయించడానికి నాన్న ప్రయత్నిస్తున్నారు. టెన్నిస్ లో ఇంకా ఏమి సాధించాలని భావిస్తున్నావ్" అని అయన ప్రశ్నిస్తున్నారు.
శరీరం పై టెన్నిస్ ప్రభావం
సుదీర్ఘంగా టెన్నిస్ ఆడటం వల్ల అది జకో శరీరం పై ప్రభావం చూపుతోంది. ఈ కారణంగానే జకోవిచ్ ని అతని తండ్రి రిటైర్మెంట్ గురుంచి ఒత్తిడి చేసున్నానడంలో సందేహం లేదు. ఈ నేపధ్యం లో తన రిటైర్మెంట్ గురుంచి జకోవిచ్ ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇందుకు ఖచ్చితమైన సమయం ఎప్పుడు, ఎక్కడా అన్న విషయం పై దృష్టి పెట్టాడు.
తన కెరీర్‌ను ఎలా ముగించాలనుకుంటున్నాడనే దానిపై ప్రస్తుతం ఎక్కువ దృష్టి పెట్టాడు. "నేను నా టెన్నిస్ కెరీర్ ని ఎలా ముగించాలి, ఎక్కడ ముగించాలి అన్న విషయం పై వ్యూహం సిద్ధం చేయాలి అని భావిస్తున్నాను. అయితే ఇప్పుడే రిటైర్ అవుతానని చెప్పలేను. ప్రస్తుతం టెన్నిస్ లో అగ్ర స్థాయి ఆటగాళ్ల పై విజయం సాధిస్తున్నందున ఇప్పుడే రిటైర్ అవుతానని చెప్పడం లేదు" అని నర్మగర్భంగా తన ఆలోచనని బయటపెట్టాడు.
జకోవిచ్ రిటైర్మెంట్ నిర్ణయం.. ఆతను గ్రాండ్ స్లాం పోటీల్లో తలబడే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. గ్రాండ్ స్లాం టోర్నమెంట్ల విషయానికి వస్తే గతేడాది జకోవిచ్ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు. అడపాదప కొన్ని టైటిళ్లు గెలిచినా, గ్రాండ్ స్లాం టైటిల్ సాధిస్తేనే జకోవిచ్ తన క్రీడా జీవితాన్ని మరింత కాలం కొనసాగించే అవకాశముంది. లేనిపక్షంలో జకోవిచ్ ఎక్కువ కాలం టెన్నిస్ లో కొనసాగడం కష్టమే.
తన కెరీర్‌ను పొడిగించుకోవడానికి, జొకోవిచ్ ఇప్పటికే తన షెడ్యూల్‌ను సర్దుబాటు చేసుకున్నాడు. తక్కువ టోర్నమెంట్లు ఆడుతున్నాడు మరియు గ్రాండ్ స్లాం వంటి మేజర్‌లపై దృష్టి పెట్టాడు. చాలా మంది తాను ఉన్నత స్థాయిలో రిటైర్ కావాలని నమ్ముతున్నప్పటికీ, జకోవిచ్ శారీరకంగా మరియు మానసికంగా సమర్థుడిగా ఉన్నంత వరకు టెన్నిస్ లో కొనసాగాలని నిశ్చయించుకున్నాడు. "గ్రాండ్ స్లామ్‌లలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లను ఓడించగల సత్తా నాలో ఇప్పటికీ ఉందని భావిస్తే, నేను నా టెన్నిస్ జీవితానికి ఎందుకు గుడ్ బై చెప్పాలనుకుంటాను" అని జకోవిచ్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment