విజయ్ ఒక ప్రముఖ ఎమ్మెన్సీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పెళ్లిచేసుకున్నాడు. జీవితంలోనూ, ఉద్యోగంలోనూ త్వరత్వరగా ప్రమోషన్లు అందుకున్నాడు. కానీ గత మూడు నెలలుగా రాత్రిళ్లు నిద్రపట్టక నానా ఇబ్బందులు పడుతున్నాడు. సాధారణంగా ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం.
కానీ విజయ్‌కు త్వరగా మెలకువ వస్తుంది. ఆ తర్వాత అస్సలు నిద్ర పట్టదు. ఉదయం చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే చిరాకు వస్తుంది. ఏ పనిౖ పెనా శ్రద్ధ నిలవడంలేదు. నిరంతరం నిద్ర గురించిన ఆలోచనలే. పనిలో ఎక్కువ తప్పులు జరుగుతున్నాయి. దాంతో ఆఫీసులో రెడ్ స్లిప్ వచ్చింది.
ఏం చేయాలో అర్థంకాక, స్లీపింగ్ పిల్స్ వాడటం ఇష్టంలేక కౌన్సెలింగ్‌కి వెళ్లాడు. ఫస్ట్ సెషన్‌లోనే అతను నిద్రలేమి (ఇన్ సోమ్నియా)తో బాధపడుతున్నట్టు తేలింది. ముగ్గురిలో ఒకరు ఇలాంటి రుగ్మతతో బాధపడుతున్నారు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నాయేమో చెక్ చేయించుకోమని సూచించారు.
ఎలాంటి శారీరక కారణాలు లేవని పరీక్షల్లో తేలింది. ఆ తర్వాత రెండు వారాలపాటు ఏ సమయంలో నిద్రపోతున్నాడో, ఏ సమయంలో మేల్కొంటున్నాడో డైరీ రాయమని సూచించారు. విజయ్ భార్యతో మాట్లాడి స్లీప్ ఆప్నియా లేదా రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటివి లేవని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత రిలాక్సేషన్ టెక్నిక్స్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా విజయ్ కొద్దివారాల్లో తన నిద్రలేమిని అధిగమించగలిగాడు.
నిద్రలేమికి కారణాలు..
- దీర్ఘకాలిక నిద్రలేమికి రకరకాల కారణాలున్నాయి. ఒత్తిడి, పని, పాఠశాల, ఆరోగ్యం, డబ్బు లేదా కుటుంబం గురించిన ఆందోళనలు రాత్రిపూట మన మనస్సును చురుకుగా ఉంచుతాయి, నిద్రను కష్టతరం చేస్తాయి.
- షిఫ్ట్ లను తరచుగా మార్చడం లేదా వివిధ టైమ్ జోన్లలో ప్రయాణించడం వల్లా శరీరంలోని గడియారానికి (సర్కేడియన్ రిథమ్స్) భంగం కలుగుతుంది
- ఒక్కోరోజు ఒక్కో సమయంలో పడుకోవడం, మేల్కోవడం, మంచంపై ఉన్నప్పుడు తినడం, టీవీ చూడటం, పనిచేయడం, స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం లాంటివి నిద్రను డిస్టర్బ్ చేస్తాయి.
- యాంగ్జయిటీ, డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతలు..
- మధుమేహం, ఉబ్బసం, గుండె జబ్బుల వల్ల లేదా వాటికి వాడుతున్న మందులు..
- స్లీప్ ఆప్నియా, రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటి స్లీప్ డిజార్డర్స్..
- రాత్రిళ్లు నికోటిన్, ఆల్కహాల్, కెఫీన్ ఉన్న పదార్థాలు, పానీయాలను తీసుకోవడమూ నిద్రలేమికి కారణమవుతాయి.
మంచి అలవాట్లతో మంచి నిద్ర..
మంచి అలవాట్లు నిద్రలేమిని నివారించడంలో సహాయపడతాయి.
- వారాంతాలు సహా ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, మేల్కోవడం చేయాలి.
- రోజూ వ్యాయామం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది.
- పగలు అస్సలు నిద్రపోవద్దు, లేదా పరిమితం చేసుకోవాలి.
- కెఫీన్, ఆల్కహాల్, నికోటిన్లను పరిమితం చేయాలి.. వీలైతే పూర్తిగా మానేయాలి.
- నిద్రవేళకు ముందు భారీగా తినొద్దు, తాగొద్దు.
- పడకగదిని కేవలం నిద్ర కోసమే ఉపయోగించాలి.
- గోరువెచ్చని నీటితో స్నానం, చదవడం లేదా శ్రావ్యమైన సంగీతం వినడం ద్వారా నిద్రకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టించుకోవాలి.
- ఇవన్నీ చేసినా నిద్ర పట్టనప్పుడు సైకాలజిస్ట్‌ను కలవడం తప్పనిసరి.
- నిద్రకు దూరంచేసే నెగెటివ్ ఆలోచనలు, చర్యలను సీబీటీ ద్వారా నియంత్రించవచ్చు. ఇది స్లీపింగ్ పిల్స్ కంటే ప్రభావవంతంగా ఉంటుంది.
- లైట్ థెరపీ, స్టిములస్ కంట్రోల్ థెరపీ లాంటివి శరీరాన్ని, మనసును మంచి నిద్రకు సిద్ధం చేస్తాయి.
- ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ టెక్నిక్, బయోఫీడ్ బ్యాక్, బ్రీతింగ్ టెక్నిక్స్ లాంటివి కూడా నిద్రవేళల్లో ఆందోళనను తగ్గించడానికి ఉపయోగపడతాయి.
ఎవరి నిద్ర వారిదే..
నిద్ర అలవాట్లు, అవసరాలు ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఉంటాయి. అందువల్ల తక్కువ నిద్రపోయేవాళ్లందరికీ నిద్రలేమి ఉన్నట్లు కాదు. నిపుణులు అనేక రకాల నిద్ర లక్షణాలను సాధారణంగా పరిగణిస్తారు.
- త్వరగా పడుకొని, త్వరగా లేచేవారిని ఎర్లీబర్డ్స్ అంటారు.
- గుడ్లగూబల్లా రాత్రంతా మేలుకుని, ఆలస్యంగా పడుకుని, ఆలస్యంగా లేచేవారిని గుడ్లగూబలనే అంటారు.
- ఇతరుల కంటే తక్కువ నిద్ర అవసరమైన వారిని షార్ట్ స్లీపర్స్ అంటారు.
- పోలీసు, సైన్యం లాంటి విభాగాల్లో ఉండేవారు ఎప్పుడంటే అప్పుడు మేల్కొనేలా ఉంటారు. వారిని లైట్ స్లీపర్స్ అంటారు.
– సైకాలజిస్ట్ విశేష్
Comments
Please login to add a commentAdd a comment