విశ్లేషణం: మనసున్న మేథావి
అతనేం పెద్దగా చదువుకోలేదు... కానీ గొప్పగా ఆలోచించాడు. ‘కిటికీల’తో సాంకేతిక సామ్రాజ్యాధిపతిగా నిలిచాడు. ప్రపంచంలో ఎవరూ సంపాదించలేనంత ధనాన్ని ఆర్జించాడు. సంపాదించడమే కాదు పంచడమూ తెలుసంటూ వేలకోట్ల రూపాయలు విరాళాలుగా ఇస్తున్నాడు. తానో హృదయమున్న మేధావినని నిరూపించుకున్నాడు. ఆయనే... మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్.
మాటలు, చేతులు కలిసి జంటగా...
గేట్స్ కాస్తంత తల పెకైత్తి, కాలు మీద కాలువేసుకుని ధారాళంగా, స్వేచ్ఛగా మాట్లాడతారు. ఇవన్నీ ఆయన మంచి భావనలున్న విజువల్ పర్సన్ అనీ, ఆత్మవిశ్వాసం మెండుగా ఉందనీ చెప్తాయి. ఆయన తన ఫీలింగ్స్‌ను ఎంతో కొంత నిగ్రహించుకుంటాడని పెదవులు దాటని నవ్వు చెప్తుంది. నిజాయితీగా మాట్లాడతాడని ఓపెన్‌గా చాచిన చేతులు వివరిస్తాయి. అయితే ఈ చేతుల కదలికలు సందర్భాన్ని బట్టి మారిపోతూంటాయి. అప్పుడప్పుడూ అథారిటేటివ్‌గా హస్తాలను కిందకు కూడా ఉంచుతాడు. ఎవరు మాట్లాడుతున్నా ఆయన శ్రద్ధగా వింటారు. కళ్లజోడు సవరించుకుంటున్నారంటే తానేదో చెప్పబోతున్నాడన్నమాట. అంతేకాదు గేట్స్ చేతులు కూడా మాటలతో జతకలిసి జంటగా కదులుతాయి. అంటే ఆయన మనసులో ఉన్నదే నిజాయితీగా చెప్తున్నాడని అర్థం.
ఆలోచనాజీవి...
బిల్‌గేట్స్ చిన్నప్పటినుంచీ ఆలోచనా జీవి. ఆరేళ్ల వయసులో గేట్స్‌ను తల్లి ఏం చేస్తున్నావ్? అని అడిగితే.. ఆలోచిస్తున్నాను అని చెప్పాడట. ఆవిడకు అర్థంకాక ‘ఏంటీ.. ఆలోచిస్తున్నావా?’ అని అడిగితే... ‘అవును, ఆలోచిస్తున్నాను, నువ్వెప్పుడైనా ఆ ప్రయత్నం చేశావా?’ అని అడిగాడట. బాల్యంనుంచే గేట్స్ ఆలోచించడానికి అత్యంత ప్రాధాన్యమిచ్చాడు కనుకనే నూనూగు మీసాల వయసులోనే విండోస్ సాఫ్ట్‌వేర్‌ను సృష్టించి, మైక్రోసాఫ్ట్ కంపెనీ స్థాపించి సాఫ్ట్‌వేర్ కింగ్‌గా నిలిచాడు. ఆలోచనలు మెరుపువేగంలో వినూత్నంగా, లక్ష్యం దిశగా సాగిపోవడమే అందుకు కారణం. ఆయన పుస్తకాల్లో ఒకదానికి ‘బిజినెస్ ఎట్ స్పీడ్ ఆఫ్ థాట్’ అని పెట్టడం కూడా కాకతాళీయమేమీ కాదు.
బిల్‌గేట్స్‌ది ట్రాన్స్‌ఫర్మేషనల్ లీడర్‌షిప్. తన తెలివితేటలు, ఆత్మవిశ్వాసం, కార్యసాధన, చురుకైన ఆలోచనాధోరణితో సహచరులను, అనుచరులను ప్రభావితం చేస్తాడు. తన విజన్‌ను అందరితోనూ పంచుకుంటాడు, అందరూ దానిలో భాగస్వాములై దాన్ని సఫలం చేయాలనుకుంటాడు. తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడంకోసం ఎన్ని గంటలైనా శ్రమిస్తాడు, దేనికైనా సిద్ధమవుతాడు. ఈ క్రమంలో తన ఉద్యోగులను అదిలించడంలో, విమర్శించడంలో ఏ మాత్రం వెనుకాడడు. అలాగే పోటీ సంస్థలను అధిగమించేందుకు కూడా. అయితే ఫౌండేషన్ స్థాపించాక ఆయన నాయకత్వ ధోరణిలో కొంత మార్పు వచ్చిందని చెప్పవచ్చు. ఫౌండేషన్ అకౌంట్లను భాగస్వాములందరికీ అందుబాటులో ఉంచడమే అందుకు ఉదాహరణ.
మనసున్న మారాజు...
బిల్‌గేట్స్ తెలివైనవాడు, మేధావి మాత్రమే కాదు... మనసున్న మారాజు కూడా. కాబట్టే ప్రపంచంలో పేదరికంతో, జబ్బుల బారిన పడి మరణిస్తున్న పిల్లలను చూసి చలించాడు. ఫౌండేషన్‌ను స్థాపించి అనేక దేశాల్లో బాలలకు వ్యాక్సిన్ అందిస్తున్నాడు. డబ్బు సంపాదించడం చాలామందికి తెలుసు, కానీ సంపాదించిన డబ్బును విరాళంగా ఇవ్వాలంటే గొప్ప మనసుండాలి. ఆ మంచి మనసు, స్పందించే హృదయం గేట్స్ సొంతం. సమాజంలో ప్రజలందరూ మెరుగైన జీవనాన్ని పొందినప్పుడే తన వ్యాపార విస్తరణ మరింతగా జరుగుతుందన్న స్వార్థం అందులో లేకపోలేదు. అయినా అది మంచి స్వార్థమే. కంప్యూటర్ రంగంలో విస్తృత పరిజ్ఞానం, విజన్, చిత్తశుద్ధి, పట్టుదల, పవర్, కరిష్మా గేట్స్ బలాలు కాగా... ఆధిప్యత ధోరణి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడం, లక్ష్యాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఆయన బలహీనతలు.
- విశేష్, సైకాలజిస్ట్