విశ్లేషణం: ‘మన’ సత్య
సత్య నాదెళ్ల.. మనవాడు... మన తెలుగువాడు... మన దేశంవాడు... భారతదేశ మేధాశక్తిని ప్రపంచానికి చాటినవాడు... ప్రపంచ పత్రికల పతాక శీర్షికలలో నిలిచినవాడు... ఈ బుక్కాపురం బుల్లోడు మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎలా కాగలిగాడు? హైదరాబాద్ చదివి అమెరికాలో ఎలా పాగా వేయగలిగాడు?
ఓపెన్ అండ్ క్లారిటీ
సత్య మాట్లాడుతున్నప్పుడు గమనిస్తే... అతని చేతులు ఓపెన్‌గా ఉంటాయి. తాను చెప్తున్న విషయాలకు అనుగుణంగా చేతుల కదలికలు ఉంటాయి. బొటనవేలును చూపుడువేలును కలిసే చిన్ముద్రను ఎక్కువగా ఉపయోగిస్తాడు. ఇవి అతను ఓపెన్‌గా ఉంటాడని, ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని చెప్తాయి. చిన్ముద్ర అతను చెప్తున్నది నిజమేనన్న భావనను కలిగిస్తుంది. నిల్చున్నప్పుడు నిలకడగా ఉంటాడు, కదలికలు తక్కువగా ఉంటాయి. కూర్చున్నప్పుడు కాలుమీద కాలు వేసుకుని కూర్చుంటాడు. సత్య నిలకడగా ఉంటాడని, తొందరపాటు లేదని, ఆత్మవిశ్వాసంతో ఉంటాడని ఇవి చెప్తాయి.
సత్య మాటల్లో మొదటగా ఆకట్టుకునేది స్పష్టత. అతని మాటల్లో, పదాలను ఉచ్ఛరించడంలో, ఆలోచనను వ్యక్తీకరించడంలో స్పష్టత కనిపిస్తుంది... ఎక్కడా ఎలాంటి తొట్రుబాటు, గందరగోళం కనిపించదు. పదాల ఎంపికలో జాగ్రత్తగా ఉంటాడని తెలుస్తుంది. అలాగే తాను ప్రధానంగా చెప్పదలచుకున్న విషయాలను చెప్తున్నప్పుడు, కీలక పదాలను పలుకుతున్నప్పుడు నొక్కి చెప్పడం గమనించవచ్చు. స్వరం హైపిచ్‌లో ఉంటుంది. వ్యక్తిగత అభిప్రాయాలకన్నా కంపెనీ విజన్ గురించే ఎక్కువగా మాట్లాడతాడు. ఇవన్నీ అతనో విజువల్ పర్సన్ అని చెప్తాయి. ఈ వ్యక్తిత్వమున్నవారు పనిని ఆనందిస్తారు. వేగంగా పనిచేస్తారు. చేసే పని పర్‌ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. అసంపూర్తి పనులంటే వీరికి అసౌకర్యంగా ఉంటుంది. సత్య మాట్లాడటం చూసినప్పుడు, సత్య గురించి చదివినప్పుడు ఈ లక్షణాలన్నీ మనం గమనించవచ్చు.
జ్ఞాన పిపాసి...
ఒక వ్యక్తి తన ప్రవర్తను ఎంతగా నియంత్రించుకోవాలని ప్రయత్నించినా సాధ్యంకాదు. అతను ఎంచుకునే పదాలు, మాట్లాడే తీరు, బాడీ లాంగ్వేజ్.. ఇవన్నీ అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికైన తర్వాత సత్య ఇచ్చిన ఇంటర్వ్యూలు, మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు అతను రాసిన తొలి ఉత్తరం మూలాలపట్ల అతనికున్న అనురక్తిని, అతను ఈ స్థాయికి రావడానికి కారణాలను మనకు చూపిస్తాయి. అలాగే ఇన్నోవేషన్, కోర్, డూ మోర్... అని పలికేటప్పుడు ఆ పదాలపై ఒత్తిడి పెడతాడు. ఇవన్నీ అతని జ్ఞాన జిజ్ఞాసను ప్రతిఫలిస్తాయి. ఉద్యోగం చేస్తూకూడా వందలాది కిలోమీటర్లు ప్రయాణంచేసి కోర్సు చేయడం ఇందులో భాగమే. స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్ట్, ఎంఐటీల్లో చదవకపోయినా తన జ్ఞాన జిజ్ఞాసతో అంతకంటే ఎక్కువే నేర్చుకున్నాడు.
విలువలు, విశ్వాసాలే బలం...
సత్య బలం అతని విలువల్లో, విశ్వాసాల్లో ఉంది. ఉద్యోగం కేవలం జీతంకోసమే కాదు... పలువురి జీవితాల్లో మార్పు తీసుకురావడానికని బలంగా విశ్వసిస్తాడు. ఆ శక్తి అందరిలోనూ ఉందని నమ్ముతాడు. అందరినీ అందులో భాగస్వాములను చేస్తాడు. సత్య మాటల్లో ‘నేను’కన్నా ‘మనం’ అనే పదం ఎక్కువగా వినిపించేది ఇందుకే.
నా కుటుంబం, నా జీవితానుభవాలే నన్నీ స్థాయికి తెచ్చాయంటాడు సత్య. కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఉత్సుకతే తన వ్యక్తిత్వమంటాడు. కొత్తవిషయాలు నేర్చుకోకపోతే కొత్తవి కనిపెట్టలేమని చెప్తాడు.
లక్ష్యంకన్నా విజన్ ఇంకా గొప్పది. వ్యక్తిగత విజన్‌ను సంస్థ విజన్‌తో మమేకం చేయడం మరింత గొప్పపని. అది సత్యలో గమనించవచ్చు. ఏడాదికి, రెండేళ్లకు ఉద్యోగాలు మారే సాఫ్ట్‌వేర్ రంగంలో 22 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్‌లోనే పనిచేయడం సంస్థపట్ల తనకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. అంతగా అతను సంస్థను ప్రేమించాడు, సంస్థతో మమేకమయ్యాడు, సంస్థ విజన్‌ను తనతో ఐక్యం చేసుకున్నాడు. ఇవన్నీ గమనించారు కాబట్టే మైక్రోసాఫ్ట్ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ అందరూ ఏకగ్రీవంగా సత్యకే ఓటేశారు.
- విశేష్, సైకాలజిస్ట్