self confindence
-
ఆత్మవిశ్వాసం కోసమే ఆంగ్లమాధ్యమ చదువులు
కన్యాశుల్కం నాటకంలో గురువు గిరీశం, శిష్యుడు వెంకటేశం పాత్రలు మన కింకా జ్ఞాపకం వుండే ఉంటాయి. శిష్యుడు వెంకటేశం తన తల్లిదండ్రులు అగ్నిహోత్రావధానులు, వెంకమ్మల ముందర ఇంగ్లిష్ పరిజ్ఞానం ప్రదర్శిం చటం కోసం గురుశిష్యులు ఇద్దరూ ‘ట్వింకిల్ టింక్విల్ లిటిల్ స్టార్‘ అని ఏదో ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నట్లుగా నాటకం ఆడటం... దాన్ని తల్లీ తండ్రీ అబ్బురంగా చూడటం ఇప్పటికీ ఈనాటి పెద్దల్లో చాలామందికి గుర్తుండే ఉంటుంది. వందేళ్ల క్రితమే ఇంగ్లిష్ (దొరల) భాషకు ఎంత క్రేజ్ ఉందో చెప్పటానికే ఈ ప్రస్తావన తప్ప, తెలుగు భాషను తక్కువ చేసి చూడటానికి మాత్రం కాదు. మాతృ భాషల ఎదుగుదలకు ఇంగ్లిషు అవరోధంగా మారిందన్నా, మాతృ భాషలు సంకరంగా మారుతున్నాయన్నా, శతాబ్ది పైగా ఎన్ని భాషా ఉద్యమాలు జరిగినా కూడా... ఇంగ్లిష్ భాషా ప్రాబల్యం దినదిన ప్రవర్ధమానంగా తన ప్రభావం పెంచుకుం టూనే ఉంది. గ్లోబలైజేషన్ ప్రభావం ఆంగ్ల భాషా ప్రభావాన్ని పెంచిందే తప్ప తగ్గించలేదు సరిగదా... విదేశాల్లో ఉద్యోగాల అవకాశాల కోసం మన యువత లక్షలాదిగా ఎగబాకటం మన కళ్ళ ముందున్న సజీవ చిత్రాలే! కానీ సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బడుగు బలహీన వర్గాల వారికి ఈ కాన్వెంట్ చదువులు నేటికీ అందని ద్రాక్ష పండ్లే. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చిన్న చిన్న కాన్వెంట్స్ సైతం ఇంగ్లిష్ విద్యా బోధనకే అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. గత ప్రభుత్వం హేతుబద్ధంగా క్షేత్ర స్థాయిలో విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా దిశగా విద్యా విధానాలు అమలుచేయకపోవడం వాస్తవం. కానీ ప్రస్తుతం ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంగ్లిష్ మీడియంతోపాటు తప్పని సరిగా ఒక తెలుగు సబ్జెక్టు అమలుపై కొందరు అనవసర రాద్దాంతం చేయటం విడ్డూరమే! ఇది బడుగు బలహీన వర్గాలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల చదువులకు దూరంచేయటం కాదా? ‘చదువుకోలేము! చదువు కొనలేమని’ దిగులుపడే తల్లిదండ్రులకు, విద్యార్థులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లిష్ మీడియం బడుల నిర్వహణా నిర్ణయం నిజంగా ఒక గొప్ప సంస్కరణే అని అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. దీంట్లో మాతృభాషకు అన్యాయం అనే మాటే లేదు, ఉన్నత చదువులు చదవాలనే విద్యార్థుల ఆలోచనలకు విఘాతమే లేదు, పైగా, చదవలేము, చదువు కొనలేమనే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనస్సులను ఆత్మన్యూనత నుండి ఆత్మవిశ్వాసంతో ఇది బలపరుస్తుంది. అందుకే నేటి ఏపీలో మాతృభాషకు విఘాతం కలుగనివ్వని ఇంగ్లిష్ మీడియం చదువుల బడులు ‘అందని మామిడి పండు’ కాదు ఈ నాటి ఈ చదువుల తల్లి, అందరికీ అందే మామిడి పండే’ అనేది ప్రతి ఒక్కరూ ఆహ్వానించే పరిణామమే! ఇది కచ్చితంగా ఆర్థికంగా వెనుకబడిన వారి పాలిట కల్పతరువే! విద్యా, వైద్యం, న్యాయం ప్రభుత్వాల అధీనంలో ఉంటేనే కదా ప్రజా క్షేమం పది కాలాల పాటు పరిఢవిల్లుతుందని పెద్దల మాట! అందులో మొదటిదైన చదువుకు సంబంధించి, ఏపీలో దాదాపు 45,000 పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 15,000కు పైగా పాఠశాలలు వేలాది కోట్ల రూపాయల ఖర్చుతో కొత్త సొబగులు దిద్దుకొని విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపటానికి స్వర్ణ వాద్యాలు సంరావిస్తూ సిద్ధమయ్యాయి. అలాగే రెండవ విడతలో మరో 15,000 ప్రభుత్వ పాఠశాలలు సిద్ధం కానున్నాయి. ఎటువంటి రాజకీయ సంకుచిత విమర్శలూ, హేళనలూ, ఎత్తిపొడుపు మాటలూ. అపసవ్య వార్తలు తమ పిల్లల అభివృద్ధిని కాంక్షించే తల్లిదండ్రుల మీద కనీసం ప్రభావం చూపలేదు సరి కదా.. ప్రభుత్వం చేతల్లో చేసి చూపిస్తున్న అభివృద్ధి బాటవైపే తమ పిల్లలను మళ్లిస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది! ఒక నూతన శకానికి ద్వారాలు తెరిచి, లక్షలాది విద్యార్థుల భవితవ్యానికి అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలలో ఈ విద్యాసంవత్సరంలో సీట్లు అయిపోయాయనే బోర్డులు కూడా కనిపిస్తున్నాయనే వార్తలు ఈ సందర్భంగా కొసమెరుపు! -అమరనాధ్ జాగర్లపూడి వ్యాసకర్త కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, ఫ్రీలాన్స్ రైటర్ మొబైల్ : 98495 45257 -
విశ్లేషణం: ‘మన’ సత్య
సత్య నాదెళ్ల.. మనవాడు... మన తెలుగువాడు... మన దేశంవాడు... భారతదేశ మేధాశక్తిని ప్రపంచానికి చాటినవాడు... ప్రపంచ పత్రికల పతాక శీర్షికలలో నిలిచినవాడు... ఈ బుక్కాపురం బుల్లోడు మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎలా కాగలిగాడు? హైదరాబాద్ చదివి అమెరికాలో ఎలా పాగా వేయగలిగాడు? ఓపెన్ అండ్ క్లారిటీ సత్య మాట్లాడుతున్నప్పుడు గమనిస్తే... అతని చేతులు ఓపెన్‌గా ఉంటాయి. తాను చెప్తున్న విషయాలకు అనుగుణంగా చేతుల కదలికలు ఉంటాయి. బొటనవేలును చూపుడువేలును కలిసే చిన్ముద్రను ఎక్కువగా ఉపయోగిస్తాడు. ఇవి అతను ఓపెన్‌గా ఉంటాడని, ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని చెప్తాయి. చిన్ముద్ర అతను చెప్తున్నది నిజమేనన్న భావనను కలిగిస్తుంది. నిల్చున్నప్పుడు నిలకడగా ఉంటాడు, కదలికలు తక్కువగా ఉంటాయి. కూర్చున్నప్పుడు కాలుమీద కాలు వేసుకుని కూర్చుంటాడు. సత్య నిలకడగా ఉంటాడని, తొందరపాటు లేదని, ఆత్మవిశ్వాసంతో ఉంటాడని ఇవి చెప్తాయి. సత్య మాటల్లో మొదటగా ఆకట్టుకునేది స్పష్టత. అతని మాటల్లో, పదాలను ఉచ్ఛరించడంలో, ఆలోచనను వ్యక్తీకరించడంలో స్పష్టత కనిపిస్తుంది... ఎక్కడా ఎలాంటి తొట్రుబాటు, గందరగోళం కనిపించదు. పదాల ఎంపికలో జాగ్రత్తగా ఉంటాడని తెలుస్తుంది. అలాగే తాను ప్రధానంగా చెప్పదలచుకున్న విషయాలను చెప్తున్నప్పుడు, కీలక పదాలను పలుకుతున్నప్పుడు నొక్కి చెప్పడం గమనించవచ్చు. స్వరం హైపిచ్‌లో ఉంటుంది. వ్యక్తిగత అభిప్రాయాలకన్నా కంపెనీ విజన్ గురించే ఎక్కువగా మాట్లాడతాడు. ఇవన్నీ అతనో విజువల్ పర్సన్ అని చెప్తాయి. ఈ వ్యక్తిత్వమున్నవారు పనిని ఆనందిస్తారు. వేగంగా పనిచేస్తారు. చేసే పని పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటారు. అసంపూర్తి పనులంటే వీరికి అసౌకర్యంగా ఉంటుంది. సత్య మాట్లాడటం చూసినప్పుడు, సత్య గురించి చదివినప్పుడు ఈ లక్షణాలన్నీ మనం గమనించవచ్చు. జ్ఞాన పిపాసి... ఒక వ్యక్తి తన ప్రవర్తను ఎంతగా నియంత్రించుకోవాలని ప్రయత్నించినా సాధ్యంకాదు. అతను ఎంచుకునే పదాలు, మాట్లాడే తీరు, బాడీ లాంగ్వేజ్.. ఇవన్నీ అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికైన తర్వాత సత్య ఇచ్చిన ఇంటర్వ్యూలు, మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు అతను రాసిన తొలి ఉత్తరం మూలాలపట్ల అతనికున్న అనురక్తిని, అతను ఈ స్థాయికి రావడానికి కారణాలను మనకు చూపిస్తాయి. అలాగే ఇన్నోవేషన్, కోర్, డూ మోర్... అని పలికేటప్పుడు ఆ పదాలపై ఒత్తిడి పెడతాడు. ఇవన్నీ అతని జ్ఞాన జిజ్ఞాసను ప్రతిఫలిస్తాయి. ఉద్యోగం చేస్తూకూడా వందలాది కిలోమీటర్లు ప్రయాణంచేసి కోర్సు చేయడం ఇందులో భాగమే. స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్ట్, ఎంఐటీల్లో చదవకపోయినా తన జ్ఞాన జిజ్ఞాసతో అంతకంటే ఎక్కువే నేర్చుకున్నాడు. విలువలు, విశ్వాసాలే బలం... సత్య బలం అతని విలువల్లో, విశ్వాసాల్లో ఉంది. ఉద్యోగం కేవలం జీతంకోసమే కాదు... పలువురి జీవితాల్లో మార్పు తీసుకురావడానికని బలంగా విశ్వసిస్తాడు. ఆ శక్తి అందరిలోనూ ఉందని నమ్ముతాడు. అందరినీ అందులో భాగస్వాములను చేస్తాడు. సత్య మాటల్లో ‘నేను’కన్నా ‘మనం’ అనే పదం ఎక్కువగా వినిపించేది ఇందుకే. నా కుటుంబం, నా జీవితానుభవాలే నన్నీ స్థాయికి తెచ్చాయంటాడు సత్య. కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఉత్సుకతే తన వ్యక్తిత్వమంటాడు. కొత్తవిషయాలు నేర్చుకోకపోతే కొత్తవి కనిపెట్టలేమని చెప్తాడు. లక్ష్యంకన్నా విజన్ ఇంకా గొప్పది. వ్యక్తిగత విజన్‌ను సంస్థ విజన్‌తో మమేకం చేయడం మరింత గొప్పపని. అది సత్యలో గమనించవచ్చు. ఏడాదికి, రెండేళ్లకు ఉద్యోగాలు మారే సాఫ్ట్వేర్ రంగంలో 22 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్‌లోనే పనిచేయడం సంస్థపట్ల తనకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. అంతగా అతను సంస్థను ప్రేమించాడు, సంస్థతో మమేకమయ్యాడు, సంస్థ విజన్‌ను తనతో ఐక్యం చేసుకున్నాడు. ఇవన్నీ గమనించారు కాబట్టే మైక్రోసాఫ్ట్ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ అందరూ ఏకగ్రీవంగా సత్యకే ఓటేశారు. - విశేష్, సైకాలజిస్ట్ -
దేవతా వస్త్రాలతో ‘యోగ’o
న్యూయార్క్: పురుషుల నగ్నయోగాకు ఇటీవల అమెరికాలోని న్యూయార్క్‌లో ప్రాముఖ్యత బాగా పెరుగుతోంది. దీంతో అక్కడి యోగా సెంటర్ల నిర్వాహకులకు మరోకొత్త ఆలోచన వచ్చింది. యోగాను మరింత పాపులర్ చేయడానికి కో-ఎడ్ నేకెడ్ యోగా( సహా నగ్న యోగా)అనే కొత్త కోర్సును ప్రవేశపెట్టారు. దీనికి ‘బోల్డ్ అండ్ ఆంప్’ అని నామకరణం కూడా చేశారు. ఈ కోర్సు ప్రత్యేకత ఏంటంటే ... ఆడామగా తేడాలేకుండా అందరూ బట్టలులేకుండా యోగా తరగతులకు హాజరవడం. ఈ రకమైన యోగా చేయడం వల్ల శరీరానికి సౌకర్యవంతంగా ఉండి ఆత్మవిశ్వాసం కూడా బాగా పెరుగుతుందని నిర్వాహకులు నమ్మకంగా చెబుతున్నారు.