చిత్ర పరిశ్రమలో రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma)పై రూమర్స్ రావడం చాలా తక్కువ. ఏదైనా ఉంటే ఓపెన్‌గానే మాట్లాడతాడు. అంతేకాని తన ప్రవర్తనతో నటీనటులకు ఇబ్బంది మాత్రం కలగనీయడని సినీ ఇండస్ట్రీ మొత్తం చెబుతుంది. ముఖ్యంగా హీరోయిన్లతో ఎంత చనువుగా ఉన్నప్పటికీ.. హద్దులు దాటి ప్రవర్తించరు. అందుకే అతనితో సినిమా చేసేందుకు చాలా మంది హీరోయిన్లు ఆసక్తి కనబరుస్తారు. అలాంటి ఆర్జీవీపై చాలా కాలంగా ఓ రూమర్ వినిపిస్తోంది. అలనాటి అందాల తార ఊర్మిళా మాతోండ్కర్(Urmila Matondkar)తో ఆర్జీవీకీ గొడవైందని, వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని బాలీవుడ్‌లో వార్తలు వినిపించాయి.తాజాగా ఈ రూమర్స్‌పై ఊర్మిళ స్పందించింది. ఆర్జీవీతో తనకు ఎలాంటి అభిప్రాయభేదాల్లేవని స్పష్టం చేసింది.
ఆర్జీవీ దర్శకత్వంలో నటించినందుకు గర్విస్తున్నా
ఆర్జీవీ దర్శకత్వం వహించిన ‘అంతం’, ‘గాయం’, ‘రంగీలా’, ‘సత్య’ సినిమాల్లో ఊర్మిళ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. అయితే ‘ఆగ్’(2007) తర్వాత ఊర్మిళ మళ్లీ ఆర్జీవీ చిత్రాల్లో నటించలేదు. దీంతో బాలీవుడ్‌లో పలు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ‘సత్య’(satya) రీ రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్జీవీతో విభేదాలు వచ్చాయట కదా?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఊర్మిళ సమాధానం చెబుతూ..‘మా మధ్య ఎలాంటి విభేదాలు రాలేదు. ఆయనతో నాకు మంచి స్నేహమే ఉంది. ఆయన తెరకెక్కించిన ‘కంపెనీ’ (2002), ‘రామ్‌గోపాల్ వర్మ కీ ఆగ్’ (2007) చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లోనూ నటించాను. ఆ తర్వాత మేం మళ్లీ కలిసి పని చేయకపోవడానికి ప్రత్యేక కారణమంటూ ఏం లేదు. ఆయన దర్శకత్వంలో నటించినందుకు గర్వపడుతున్నా. అవకాశం వస్తే రామ్‌గోపాల్ వర్మ, మనోజ్ బాజ్‌పాయ్‌తో కలిసి మళ్లీ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాను’ అని ఊర్మిళ చెప్పుకొచ్చింది.
‘రంగీలా’తో ఫేమస్
ముంబైలో పుట్టి పెరిగిన ఊర్మిళ.. బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. 'కర్మ' మూవీతో పరిచయమైంది. కొన్నాళ్ల తర్వాత హీరోయిన్‌గా మారింది. రాంగోపాల్ వర్మ తీసిన 'రంగీలా'.. ఈమెకు ఎక్కడలేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీని తర్వాత జుదాయి, సత్య తదితర చిత్రాలతో స్టార్ అయిపోయింది. తెలుగు తమిళంలోనూ అంతం, గాయం, భారతీయుడు, అనగనగా ఒక రోజు లాంటి మూవీస్ చేసింది. 2018లో చివరగా 'బ్లాక్ మెయిల్' సినిమాలో కనిపించిన ఊర్మిళ.. 2019లో రాజకీయాల్లోకి వెళ్లింది. తొలుత కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత ఏడాది శివసేన పార్టీలో చేరిపోయింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ.. మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు ట్రై చేస్తోంది.ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు ఊర్మిళ జడ్జిగా వ్యవహరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment