
విశ్లేషణం: పోరాటమే జీవితం... వ్యక్తిత్వం
ఆమె ప్రజల తరపున వీధుల్లో నిలబడి పోరాడగలరు... ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పట్టించగలరు... విద్యార్థులను, జర్నలిస్టులను మావోయిస్టులనగలరు... నిండు లోక్‌సభలో సహచర ఎంపీ కాలర్ పట్టుకోగలరు...
ఆమె ప్రజల తరపున వీధుల్లో నిలబడి పోరాడగలరు... ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పట్టించగలరు... విద్యార్థులను, జర్నలిస్టులను మావోయిస్టులనగలరు... నిండు లోక్‌సభలో సహచర ఎంపీ కాలర్ పట్టుకోగలరు... స్పీకర్‌పైకి కాగితాలు విసరగలరు... తాను నమ్మిన సిద్ధాంతంకోసం, తనను నమ్మిన ప్రజలకోసం ఎవరినైనా ఎదిరించి మాట్లాడగలరు. పశ్చిమ బెంగాల్ ప్రజల ప్రియ దీదీ అమె.
దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మమతా బెనర్జీ తొమ్మిదేళ్లకే తండ్రిని కోల్పోయారు. చిన్నతనంలోనే కాంగ్రెస్ రాజకీయాల్లోకి ప్రవేశించి మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా ఎదిగారు. పశ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న సీపీఎంకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. సీపీఎంతో కుమ్మక్కయిందంటూ కాంగ్రెస్‌నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కానీ ఆమె వ్యక్తిత్వంలో, ప్రవర్తనలో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కూడా ఆమె ఘర్షణాత్మక వైఖరినే అవలంబిస్తున్నారు. సుదీర్ఘకాలం ఆమె చేసిన పోరాటాలే అందుకు కారణం.
నా భావాలే నాకు ముఖ్యం
మమతా బెనర్జీ మాట్లాడుతున్నప్పుడు మీరెప్పుడైనా గమనించారా? తల కొద్దిగా కుడివైపుకు వాలి ఉంటుంది. ఎవరేం ప్రశ్నించినా ఆమె ముందుగా కుడివైపు కిందకు చూసిన తర్వాత తల పెకైత్తి మాట్లాడతారు. ఇవన్నీ మమత అనుభూతి ప్రధానమైన వ్యక్తి అని చెప్తాయి. ఆమెకు తన భావాలు, తన అనుభవాలే ప్రామాణికం... ఆ తర్వాతే ఏదైనా. ఆమె మాట్లాడేటప్పుడు చేతులు కట్టుకుని కూర్చుంటారు. ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తుంటే తల పక్కకు తిప్పేసుకుంటారు. దీన్ని బట్టి కూడా ఆమె తన అనుభవాలనే ప్రామాణికంగా తీసుకుంటారని, ఎదుటివారు చెప్పేది వినేందుకు సిద్ధంగా ఉండరని తెలుస్తుంది. అంతేకాదు విరుద్ధ భావనలు అంగీకరించేందుకు ఆమె సిద్ధంగా ఉండరు. మాటల్లోనే కాదు బాడీ లాంగ్వేజ్‌లో కూడా అది స్పష్టంగా కనిపిస్తుంది.
నేను చెప్పిందే వినాలి
మమతలో ఆవేశం ఎక్కువ. ఆ ఆవేశాన్ని నిగ్రహించుకునే శక్తి తక్కువ. తానెక్కడున్నాను... ఎవరితో మాట్లాడుతున్నాను... ఏ స్థానంలో ఉండి మాట్లాడుతున్నాననే స్పృహ లేకుండా తన మనసుకు తోచింది అనేస్తారు, చెప్పాలనుకున్నది చెప్పేస్తారు.. అది పార్లమెంటయినా, టీవీ ఇంటర్వ్యూ అయినా, బహిరంగ సభయినా సరే. నాయకత్వంలో ఆమెది అథారిటేటివ్ శైలి. తాను చెప్పేది వినాలే తప్ప, ఎవరేం చెప్పినా పట్టించుకోరు. ఎవరేం చెప్పినా వినాలన్న విషయాన్ని కూడా ఆమె అంగీకరించరు. చూపుడువేలు చూపిస్తూ అదిరిస్తున్నట్లుగా, బెదిరిస్తున్నట్లుగా మాట్లాడతారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలైనా సరే, విదేశీ ప్రతినిధులైనా సరే తన మాట వినాల్సిందే అన్నట్లుగా ప్రవరిస్తారు.
తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం మమత బలమైతే, తన భావాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించలేకపోవడం ఆమె బలహీనత. పట్టుదలకు మొండితనానికి మధ్య ఉండే సన్నని గీతను ఆమె ఎప్పుడో చెరిపేశారు. తనను ప్రశ్నించేది ఎవరన్నది క్షణకాలం కూడా ఆలోచించకుండా వారిపై మావోయిస్టు లేదా కమ్యూనిస్టు ముద్ర వేయడం ఆమె అసహనానికి పరాకాష్ట. అంతేకాదు ఆమెలో పారనాయిడ్ లక్షణాలున్నాయన్న అనుమానాలకు కూడా తావిస్తోంది. పైకి గంభీరంగా కనిపించే దీదీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సివచ్చినప్పుడు ఆందోళనకు లోనవుతారు. చేతిలో పెన్నును అటూ ఇటూ తిప్పుతూ తన ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. గొంతెత్తి మాట్లాడి తన ఆందోళనను దాచుకునేందుకు ప్రయత్నిస్తారు.
అయినా దీదీ దీదీనే
మమత తొలినాటినుంచీ నేత చీర, భుజానికో సంచీతో అతి సాధారణంగా జీవించారు. ప్రజల తరఫున వీధులెక్కి పోరాడారు. అందుకోసం ఎన్ని కష్టాలనైనా భరించారు, సహించారు. ఇవన్నీ ఆమెను బెంగాల్ ప్రజలకు దగ్గర చేశాయి.. బెంగాలీల ‘దీదీ’గా మార్చాయి.
- విశేష్, సైకాలజిస్ట్