విశ్లేషణం: మనసున్న మాంత్రికుడు
న్యూక్లియర్ ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ అందుకున్న ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ సినిమాల మీద మక్కువతో తివిక్రమ్ శ్రీనివాస్‌గా మారి... ‘స్వయంవరం’ లాంటి చిన్న సినిమాకు మాటల రచయితగా తన ప్రయాణం మొదలుపెట్టి... నువ్వే-నువ్వే సినిమాతో దర్శకుడి అవతారమెత్తి... అతడు, జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది?... సినిమాలతో తన ‘త్రివిక్రమ’ స్వరూపాన్ని చూపించాడు. న్యూక్లియర్ ఫిజిక్స్ చదివిన ప్రభావమేమో మాటల తూటాలతో ఆంధ్ర ప్రేక్షకులను మాయ చేసేస్తున్నాడు. మరి ఈ మాటల మాంత్రికుడి మనస్తత్వమేమిటి?
మనసు మనిషి...
సినిమాల్లో మాటల తూటాలు పేల్చే త్రివిక్రమ్ బయట మాత్రం చాలా తక్కువగా మాట్లాడతాడు... ఈ మధ్యనే కొంచెం కొంచెం మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు గమనిస్తే... కూర్చుని ఉంటే కాళ్లు ఆడిస్తూ ఉంటాడు. నిల్చున్నా చాలా ఈజ్‌గా ఉంటాడు. తల కొంచెం కుడివైపుకు వంచి, తలాడిస్తూ మాట్లాడుతుంటాడు. ఇవన్నీ ఆయనది అనుభూతి ప్రధానమైన వ్యక్తిత్వమని చెప్తుంటాయి. ఈ వ్యక్తిత్వమున్నవారు మనుషులతో కలిసి ఉండటానికి ఇష్టపడుతుంటారు. మనుషుల గురించి తెలుసుకుంటారు. నచ్చినవారితో అనుబంధాన్ని పెంచుకుంటారు. వారితో బంధాలకు, బాంధవ్యాలకు ప్రాధాన్యతనిస్తుంటారు. వారితో గడపడానికి ఇష్టపడతారు. గట్టిగా మాట్లాడేవాళ్లంటే ఇష్టపడరు. అందుకేనేమో త్రివిక్రమ్‌కు మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్‌తో అంతగా అనుబంధం కుదిరింది. సునీల్‌తో స్నేహం ఏళ్లుగా కొనసాగుతోంది.
అయితే ఈ వ్యక్తిత్వమున్నవారు బాగా సెన్సిటివ్‌గా ఉంటారు. విషయాలను పర్సనల్‌గా తీసుకుంటారు. త్రివిక్రమ్ ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు కళ్లనీళ్లు పెట్టుకోవడం, తరచుగా కన్నీరు తుడుచుకోవడం మనం గమనించవచ్చు. అలాగే తరచూ నవ్వుతుంటారు. సూటిగా చూస్తూ మాట్లాడతారు. ఇవన్నీ ఆయన ఎలాంటి దాపరికాలు లేకుండా మనస్ఫూర్తిగా వ్యవహరిస్తారని చెప్తుంటాయి. ఆయన మాట్లాడేటప్పుడు స్వరం మంద్రస్థాయిలో ఉంటుంది. మాటల్లో ఒక ఫ్లో, ఒక నిజాయితీ కనిపిస్తుంది. మాటలకు చేతుల కదలికలకు మధ్య చక్కని సమన్వయం కనిపిస్తుంది. రెండూ కలిసి ఒక డ్యూయట్‌లా ఉంటుంది. మాట్లాడేటప్పుడు చేతులు ఓపెన్‌గా ఉంటాయి. ఇది ఆయన ఓపెన్‌నెస్‌ను చూపిస్తుంది. నిర్ణయాలు కొంచెం నిదానంగా తీసుకోవడం, పనులను వాయిదా వేయడం ఈ మనస్తత్వమున్నవారి బలహీనతలు. అందుకేనేమో త్రివిక్రమ్ సినిమాలు తక్కువగా తీస్తుంటారు.
మాటల్లోనూ మనసుంది
మాటల గురించి చెప్పకుండా త్రివిక్రమ్ గురించి చెప్తే అది అసంపూర్తిగానే మిగిలిపోతుంది. ఏ సినిమాకు కథ రాస్తున్నా, ఎలాంటి కేరెక్టర్‌కు డైలాగ్స్ రాస్తున్నా అందులో రచయిత వ్యక్తిత్వం తప్పకుండా ప్రతిఫలిస్తుంది. త్రివిక్రమ్ సినిమాలు, ఆయన రాసే మాటల్లో ఎక్కడా ద్వంద్వార్థాలు లేకపోవడం, అసభ్యత కనిపించకపోవడం ఆయన పాటించే విలువలకు దర్పణంగా నిలుస్తాయి.
పిల్లను ఇచ్చేటప్పుడు డబ్బులు ఉన్నోడా? లేనోడా? అని కాదు, మనసున్నోడా, చెడు అలవాట్లు లేనోడా? అని చూడండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది, కానీ సంస్కారం రాదు. ఎక్కడ నెగ్గాలో కాదురా... ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.
యుద్ధం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం. శత్రువుని ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం.
లాజిక్‌లు ఎవరూ నమ్మరు, అందరికీ మ్యాజిక్‌లే కావాలి. అందుకే మన దేశంలో సైంటిస్ట్‌లకన్నా బాబాలే బాగా ఫేమస్.
... ఈ మాటల్లో త్రివిక్రమ్ నమ్మే విలువలు, ఆయన సంస్కారం కనిపిస్తాయి, సమాజం పట్ల అవగాహన, అనురక్తి, సెటైర్ వినిపిస్తాయి. అంతేనా... ‘‘సింహం పడుకుంది కదా అని జూలుతో జడెయ్యకూడదురా... అలాగే పులి పలకరించిందికదా అని పక్కన నిలబడి ఫొటో తీయించుకోకూడదురోయ్...’’ అంటూ హాస్యాన్ని కూడా పండించగడు.
- విశేష్, సైకాలజిస్ట్