రవికుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. 29 సంవత్సరాలు. కాలేజీ రోజుల్లో అర్ధరాత్రి చదువుల కోసం కాఫీ తాగడం మొదలుపెట్టాడు. క్రమంగా అది అలవాటుగా మారింది. ఉద్యోగంలో చేరాక పనిలో ఒత్తిడి తట్టుకోవడానికి కాఫీ తీసుకోవడం ఎక్కువైంది. మొదట్లో రోజూ ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగేవాడు. కొన్ని సంవత్సరాలుగా అది రోజుకు ఐదారు కప్పులకు పెరిగింది.
ప్రతి కప్పులో సుమారు 100–150 మి. గ్రా. కెఫీన్ ఉంటుంది. కాఫీతో పాటు కోలా, ఎనర్జీ డ్రింక్స్ కూడా తాగడం వల్ల అతను రోజూ 600 మి. గ్రా. కంటే ఎక్కువ కెఫీన్ తీసుకుంటున్నాడు. ఇది రోజువారీ పరిమితి కంటే 400 మి. గ్రా. ఎక్కువ. ఇప్పుడు కాఫీ లేదా సాఫ్ట్ డ్రింక్ తాగకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాడు. మానాలని ప్రయత్నించినా సాధ్యంకావట్లేదు. కాఫీ మానేస్తే విపరీతంగా తలనొప్పి. నిద్ర పట్టట్లేదు. డాక్టర్‌ను కలిశాడు. అతను కాఫీకి అడిక్ట్ అయ్యాడని, మానేయమని చెప్పాడు. మానేశాడు. మళ్లీ తలనొప్పి, నిద్ర పట్టకపోవడం మామూలయ్యాయి. దాంతో డాక్టర్ సలహా మేరకు సైకాలజిస్ట్‌ని సంప్రదించాడు. సైకాలజీ అనగానే ఆశ్చర్యపోయాడు రవికుమార్.
‘ఏంటి సర్, కాఫీ తాగడమేమైనా మెంటల్ ఇల్‌నెసా? దానికి కూడా సైకాలజిస్ట్‌ను కలవాలా?’ అని అడిగాడు.
‘అతిగా ఏ పని చేసినా అది వ్యసనమే. కాఫీ వ్యసనంగా మారడం, దాన్నుంచి బయటపడలేకపోవడం కూడా ఒక మానసిక సమస్యే. ఒక పద్ధతి ప్రకారం దాన్నుంచి బయటపడాలి. అందుకు సైకోథెరపీ అవసరం’ అని డాక్టర్ చెప్పారు. దాంతో సైకాలజిస్ట్‌ని సంప్రదించాడు రవికుమార్.
మూడు నెలల చికిత్స తర్వాత, రవి విజయవంతంగా రోజుకు ఒక కప్పు కాఫీకి మాత్రమే పరిమితమయ్యాడు. విత్ డ్రాయల్ లక్షణాలేవీ కనిపించలేదు. కెఫీన్ పై ఆధారపడకుండానే పని చేయగలుగుతున్నాడు. ఇప్పుడు మరింత ఎనర్జిటిక్‌గా, కంట్రోల్డ్‌గా ఉంటున్నాడు.
కెఫీన్ వ్యసనం లక్షణాలు..
– కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్ తాగనప్పుడు తలనొప్పి.
– పని ముగించుకుని అలసిపోయినప్పటికీ, రాత్రి నిద్ర పట్టకపోవడం, దీర్ఘకాలిక నిద్ర లేమి.
– తక్కువ వ్యవధిలో ఎక్కువ కాఫీ తాగినప్పుడు విశ్రాంతి లేకపోవడం, ఆత్రుత, చికాకు.
– స్ట్రాంగ్ కప్ కాఫీ లేకుండా దినచర్య మొదలుపెట్టలేకపోవడం. పని, మీటింగ్స్ అన్నీ కెఫీన్‌పై ఆధారపడటం.
– కెఫీన్ తీసుకోవడం తగ్గించడానికి ప్రయత్నించినప్పుడు, పనితీరు పేలవంగా మారడం.
– ఉద్యోగంలో పని ఒత్తిడిని, డిమాండ్స్‌ను ఎదుర్కోవడానికి ఎక్కువ కెఫీన్ తీసుకోవడం.
– సరైన ఆహారం, వ్యాయామం వంటి వాటిని వదిలేయడం. శక్తి కోసం కెఫీన్ పై మాత్రమే ఆధారపడటం.
విత్ డ్రాయల్ లక్షణాలు..
– కాఫీ మానేసిన 24 గంటల్లో తీవ్రమైన తలనొప్పి.
– విపరీతమైన అలసట, మామూలు పనులు కూడా చేయలేకపోవడం.
– ఆందోళన, కుంగుబాటు.. ఏదో కోల్పోయిన ఫీలింగ్, ఏదో జరుగుతుందన్న భయం.
– పనిపై ఏమాత్రం దృష్టి పెట్టలేకపోవడం, గడువులోపు పూర్తి చేయలేకపోవడం, చేసిన పనిలో తప్పులు.
నిదానంగా, పద్ధతిగా..
హఠాత్తుగా కాఫీ మానేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని గుర్తించిన రవి, వైద్యుని సలహా మేరకు మొదట రోజుకు నాలుగు కప్పులు మాత్రమే తీసుకున్నాడు. ఆ తర్వాత మూడు, ఆ తర్వాత రెండు కప్పులకు పరిమితమయ్యాడు.
– నెమ్మదిగా కెఫీన్ లేని కాఫీ, హెర్బల్ టీలకు మారాడు. ఒత్తిడిని తట్టుకునేందుకు కాఫీపై ఆధారపడకుండా ఉండటానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) చికిత్స తీసుకున్నాడు.
– కెఫీన్ పై ఆధారపడకుండా పని సంబంధిత ఒత్తిడిని నిర్వహించడానికి మెలకువలను నేర్చుకున్నాడు.
– మైండ్‌ఫుల్‌నెస్, శ్వాస వ్యాయామాలు, పని సమయంలో విరామాల ద్వారా ఒత్తిడిని అధిగమించాడు. సమతుల ఆహారం, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, స్థిరమైన నిద్రతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాడు. కెఫీన్ నుంచి వచ్చే శక్తిని సరైన పోషకాహారం, శారీరక శ్రమ ద్వారా వచ్చే సహజ శక్తితో భర్తీ చేశాడు.
– అతను కాఫీ లేదా సాఫ్ట్ డ్రింక్ వైపు వెళ్లినప్పుడు వారిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా మద్దతుగా నిలిచారు.
– సైకాలజిస్ట్ విశేష్
Comments
Please login to add a commentAdd a comment