ఛేంజ్, హోప్... ప్రచార పదాలు, పథాలు | A Voice can Change world, says Barack Obama | Sakshi
Sakshi News home page

ఛేంజ్, హోప్... ప్రచార పదాలు, పథాలు

Published Sun, Nov 10 2013 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM

ఛేంజ్, హోప్... ప్రచార పదాలు, పథాలు

ఛేంజ్, హోప్... ప్రచార పదాలు, పథాలు

విశ్లేషణం: ‘‘ఒక గొంతు ఒక గదిని మార్చగలదు. ఒక గదిని మార్చిన గొంతు ఒక సిటీని మార్చగలదు. ఒక సిటీని మార్చిన గొంతు ఒక రాష్ట్రాన్ని మార్చగలదు. ఒక రాష్ట్రాన్ని మార్చిన గొంతు ఒక దేశాన్ని మార్చగలదు. ఒక దేశాన్ని మార్చిన గొంతు ప్రపంచాన్నే మార్చగలదు. అది మీ గొంతే. మీ గొంతు ప్రపంచాన్నే మార్చగలదు’’.
 
 అతనేం గొప్ప కుటుంబంలో పుట్టలేదు... అతని కుటుంబానికి రాజకీయ నేపథ్యమూ లేదు... అతనేం ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకోలేదు... ప్రపంచం గుర్తించేటంత గొప్ప విజయాలూ సాధించలేదు.. కానీ అనూహ్యంగా అమెరికా ప్రజల మనసులు కొల్లగొట్టాడు... అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు... తొలి నల్లజాతి, ముస్లిం నేపథ్యమున్న అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగుపెట్టాడు... ప్రపంచం మొత్తం తన వైపే చూసేలా చేసుకున్నాడు... అతనే బరాక్ హుస్సేన్ ఒబామా!
 
 ఈ అద్భుతం ఒబామా వ్యక్తిత్వం, వాక్చాతుర్యం వల్లనే సాధ్యమైంది. మీరెప్పుడైనా ఒబామా ఉపన్యాసం విన్నారా? లేదంటే ఈ రోజే వినండి యూ ట్యూబ్‌లో. అతని ఉపన్యాసాల్లో ‘నేను’ అనే పదం కన్నా ‘మీరు’, ‘మనం’ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తాయి. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని తన కళ్లతోనే కాక ప్రజల దృష్టినుంచి కూడా పరిశీలిస్తాడు. గతం కంటే వర్తమానానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. అందమైన భవిష్యత్తు పట్ల విశ్వాసం కల్పిస్తాడు. ‘ఛేంజ్’, ‘హోప్’... ఒబామా ప్రచార పదాలు, పథాలు. ఆశలేని వ్యక్తి, మార్పులేని వ్యక్తి ప్రపంచంలో కానరాడు. ఆ రెండు పదాలను తన ప్రచారానికి ఎంచుకోవడంలోనే ఒబామా తెలివితేటలు కనిపిస్తాయి.
 
 ఎడమచేతి వాటం కల ఒబామా సృజనాత్మకంగా ఆలోచిస్తాడు. గొప్ప లక్ష్యాలను ఊహిస్తాడు, వాటిని సాధించేందుకు శ్రమిస్తాడు, రిస్క్ తీసుకునేందుకు వెనకాడడు. అందంగా, ఆకట్టుకునేలా మాట్లాడటం ఆయన బలం. ఒబామా ఉపన్యసించేటప్పుడు చూపుడువేలు, బొటనవేలు కలిసి ఉండే ఒబామా మార్కు ముద్రను చూడండి. తాను మాట్లాడుతున్న అంశాలపట్ల తన సంతృప్తికి ఆ ముద్ర అద్దం పడుతుంది.  అంతేకాదు... ఎవరైనా కలం పట్టుకుని సంతకం చేయాలంటే ఆ ముద్రనే వాడాలి. అంటే... ఓటు వేయడానికి ముందు సంతకం చేసేటప్పుడు ఓటరు మనసులో ఒబామా రూపం కదలాడుతుందన్న మాట. దీన్నే ‘స్టీలింగ్ ఆఫ్ యాంకర్’ అంటారు. అంతేకాదు... తన ప్రత్యర్థి గురించి మాట్లాడేటప్పుడు పెదవులు బిగిస్తాడు. తద్వారా తన అనంగీకారాన్ని ప్రజలకు తెలపడమే కాకుండా వారు కూడా అలాగే ఫీల్ అయ్యేలా చేస్తాడు.
 
 వ్యక్తిత్వ వికాస నిపుణుడు...

 ‘మనకు మార్పు కావాలి’, ‘మనం కోరుకునే మార్పు మన నుంచే రావాలి’, మార్పుకోసం నినదించే లక్షల గొంతుకల ముందు ఏ శక్తీ ఎదురునిలవలేదు’, ‘మార్పు తీసుకువచ్చే సామర్థ్యం మాకుందని విశ్వసించమని అడగడంలేదు, మీ సామర్థాన్ని మీరు విశ్వసించండి’, ‘మీ పరాజయాలు మీ జీవితాన్ని నిర్దేశించకూడదు, మీకు జీవితపాఠాలు నేర్పాలి’, ‘మార్పు సులభం కాదు, కానీ సాధ్యమే’, ‘మనం భిన్న ప్రాంతాలనుంచి వచ్చి ఉండవచ్చు, మనకు భిన్న కథనాలు ఉండవచ్చు. కానీ మనందరి ఆశ ఒక్కటే, అది మన అమెరికన్ కల’... ఇవన్నీ ఏ వ్యక్తిత్వ వికాస నిపుణుడో చెప్పిన మాటలు కాదు. బరాక్ ఒబామా తన ఉపన్యాసాల్లో పలికిన పలుకులు. మార్పు తప్పదనే విషయం అమెరికన్లకు అర్థమయ్యేలా చెప్పగలిగాడు. ఆ మార్పు తానేనని వారి మనసులకు చేరేలా చేయగలిగాడు. ‘మనం సాధించగలం’ అనే నమ్మకాన్ని వారికి కల్పించాడు. తాను సాధించి చూపించాడు. తన ఆశను, ఆశయాన్ని అమెరికన్లందరి ఆశగా, ఆశయంగా మార్చగలగడమే ఒబామా విజయరహస్యం.
 - విశేష్, సైకాలజిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement