హలో.. మీరు బిగ్ బాస్ చూస్తారా? ఎందుకు చూస్తారు? ‘‘ఎందుకేంటి? అదో ఎంటర్టైన్మెంట్’’ అని అంటారా. అఫ్కోర్స్... చాలామంది ఇదే సమాధానం చెప్తారు. మరికొంతమంది ‘‘అదో చెత్త షో’’ అని కొట్టిపడేస్తారు. కానీ నిజానికి బిగ్ బాస్ ఒక గొప్ప సైకాలజీ షో.‘‘హలో... హలో... హలో.. బిగ్ బాస్ కూ సైకాలజీకి ఏంటి లింక్?’’ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చివరివరకు చదివి మీరే చెప్పండి.
తెలుగు బిగ్ బాస్ 2017లో మొదలై ఏడు సీజన్లు పూర్తి చేసుకుని ఎనిమిదో సీజన్ సెప్టెంబర్ ఒకటో తేదీన మొదలవ్వబోతోంది. మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తే, రెండో సీజన్ నాని హోస్ట్ చేశాడు. మూడో సీజన్ నుంచీ కింగ్ నాగార్జునే హోస్ట్ చేస్తున్నాడు. ఈసారి కూడా ఆయనే. ‘‘సర్లేవయ్యా, ఈ విషయాలు మాకూ తెలుసు. ముందు బిగ్ బాస్ కూ సైకాలజీకి ఉన్న లింకేంటో చెప్పు’’ అంటారా. వస్తున్నా, వస్తున్నా.. అక్కడికే వస్తున్నా.
బిగ్ బాస్ మూలాలు రెండో ప్రపంచ యుద్ధంలో ఉన్నాయంటే ఆశ్చర్యపోకండి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అడాల్ఫ్ ఎచ్మన్ అనే మిలిటరీ అధికారి హిట్లర్ ఆదేశాల మేరకు కొన్ని లక్షల మంది యూదులను కాన్సట్రేషన్ క్యాంపులలో పెట్టి చంపేశాడు. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక అతనిపై కోర్టు విచారణ జరిగింది. ఉన్నతాధికారుల ఆగ్నలు పాటించానే తప్ప తానెలాంటి తప్పూ చేయలేదని ఎచ్మన్ గాఠ్ఠిగా వాదించాడు. ఆ వాదనలు తోసేసి కోర్టు అతనికి శిక్ష విధించింది.
సైకాలజీ అధ్యయనాలు...
యేల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న మిల్ గ్రామ్ అనే సైకాలజీ ప్రొఫెసర్ కు ఎచ్మన్ వాదన ఆసక్తికరంగా అనిపించింది. ఉన్నతాధికారులు ఆదేశిస్తే ఎంత పనైనా చేస్తారా? విధేయతకు అంత శక్తి ఉందా? అనే ప్రశ్నలు అతని మనసులో తలెత్తాయి. దాన్ని అధ్యయనం చేయడం కోసం 1961లో ఒబీడియన్స్ పై ఒక స్టడీ చేశాడు. అందుకోసం కరెంట్ షాక్స్ తో ఒక ప్రయోగం చేశాడు. ఒక అథారిటీ ఫిగర్ చెప్తే ప్రమాదకరమైన కరెంట్ షాక్ ఇస్తారని ఆ అధ్యయనంలో తేలింది. అంటే ప్రజలు అధికారం ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతారని, అధికారంలో ఉన్నవారికి అత్యంత విధేయంగా ఉంటారని వెల్లడైంది.
ఆ తర్వాత పదేళ్లకు 1971లో స్టాన్పర్డ్ యూనివర్సిటీకి చెందిన ఫిలిప్ జింబార్డో అనె సైకాలజీ ప్రొఫెసర్ మరో ప్రయోగం చేశాడు. ఒక జైలులాంటి సెట్టింగ్ వేసి, అందులో కొందరు వాలంటీర్లను గార్డులుగా, మరికొందరిని ఖైదీలుగా ఉంచి, వారెలా ప్రవర్తిస్తారనే విషయాన్ని అధ్యయనం చేశాడు. ఇందులో గార్డులు అగ్రెసివ్ గా, దురుసుగా ప్రవర్తించగా, ఖైదీలు పాసివ్ గా, డిప్రెసివ్ గా మారారు. స్టాన్ఫర్డ్ ప్రిజన్ ఎక్స్ పెరిమెంట్ గా ఇది బాగా ఫేమస్.
ఆ తర్వాత జార్జ్ ఆర్వెల్ ‘1984’ అనే నవల రాశాడు. నిరంతర నిఘా, ప్రభుత్వ నియంత్రణ వల్ల వ్యక్తుల ప్రవర్తన ఎలా మారుతుంది? అనే విషయాన్ని చర్చిస్తుంది. ఇందులో హీరో మొదట తిరుగుబాటు ఆలోచనలతో ఉన్నా చివరకు బిగ్ బ్రదర్ ను ప్రేమించడం మొదలుపెడతాడు. ఈ నవల స్ఫూర్తితోనే 1999లో ‘బిగ్ బ్రదర్’ అనే రియాలిటీ షో మొదలైంది.
నవలలో లాగే ఇందులో కూడా నిరంతర పర్యవేక్షణ, వాస్తవాలను సెన్సార్ చేసి చూపించడం, పార్టిసిపెంట్స్ ఆకలిదప్పులు, నిద్రతో ఆడుకోవడం, పోటీ వాతావరణం, తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితులు, అందుకోసం చేసే ట్రిక్స్, చెప్పే అబద్ధాలు.. ఇలాంటివన్నీ చూడవచ్చు.
బిగ్ బాస్ చూస్తే ఏమొస్తుంది?
సాధారణ ప్రజలకు సైకాలజీ బోధించడానికి రియాలిటీ టీవీ చక్కని, లాజికల్ అవకాశం అంటాడు ప్రొఫెసర్ జింబార్డో. ఇతరుల ప్రవర్తనను గమనించడంపై అందరికీ ఆసక్తి ఉంటుంది. అందులోంచి విలువైన, నిజమైన సైకాలజీని ప్రజలకు అందించవచ్చంటాడు. అంతేకాదు... తానైతే జీవితాంతం చూడమన్నా చూస్తానని చెప్పాడు. అయితే మానవ ప్రవర్తనలోని చెత్త అంశాలను, తప్పుడు విలువలను ప్రోత్సహించే అంశాలు ప్రజలను తప్పుదారి పట్టించేవిలా ఉన్నాయని విమర్శించాడు. అంటే బిగ్ బాస్ షోలో మంచీ ఉంది, చెడూ ఉంది.. ఎవరేం తీసుకుంటారనేది వారివారి మనస్తత్వాలపై ఆధారపడి ఉంటుంది.
డిస్కవరీ ఛానెల్‌లో "ది హ్యూమన్ జూ" అనే కొత్త రియాలిటీ షోకు ప్రొఫెసర్ జింబార్డో ముఖ్య శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. ఇది కూడా బిగ్ బాస్ లాంటిదే. అయతే ఇందులో ఆ షో చూసేటప్పుడు ప్రేక్షకుల్లో జరిగే మార్పులను, తర్వాత ఏం జరుగుతుందనే విషయాన్ని అంచనా వేస్తారు. ఫస్ట్ ఇంప్రెషన్, బాడీ లాంగ్వేజ్, సోషల్ అట్రాక్షన్, గ్రూప్ డామినెన్స్, లై డిటెక్షన్, అందం ప్రభావం, సైజ్ ప్రభావం, సోషల్ ఇన్ఫ్లూయెన్స్ లాంటి అంశాలను అధ్యయనం చేశాడు. అందుకే బిగ్ బాస్ జస్ట్ ట్రాష్ కాదు. అందులో చాలా సైకాలజీ ఉంది.
ఎందుకు చూస్తారు?
చాలామంది ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తారు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. అందులోకి వచ్చే హౌస్మేట్లు కూడా డబ్బు, పేరు ప్రఖ్యాతుల కోసమే వస్తారు. అందులోనూ ఎలాంటి డౌట్ లేదు. అయితే హౌస్మేట్లలో తల్లి, తండ్రి, అక్క, చెల్లి, విలన్ లా ప్రవర్తించే వారిని చూడవచ్చు. వాళ్లతో ప్రేక్షకులు మమేకమవుతారు. వారిలో తమను లేదా తనకు తెలిసినవాళ్లను చూసుకుంటారు. అందుకే అభిమానులు, అభిమాన సంఘాలు, ఆర్మీలు ఏర్పడతాయి.
అయితే హౌస్మేట్లు ఆ పాత్రలను ఎందుకు ఎంచుకుంటారో, ఎందుకలా ప్రవర్తిస్తారో, వాళ్లకు ఏం అవసరమో గమనించడానికి బిగ్ బాస్ ఉపయోగపడుతుంది. గెలుపు, ఓటమి, ఆకలి, నిద్రలేమి, ఒత్తిళ్లు, ఒంటరితనం, అనుమానం... ఇవన్నీ మన ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో, ఎలా మార్చేస్తాయో తెలుసుకోవచ్చు.
అన్ని రివ్యూలూ ఒకే రకం కాదు...
’బిగ్ బాస్ తెలుగు రివ్యూస్’ అని సెర్చ్ చేస్తే యూట్యూబ్ లో వందల, వేల వీడియోలు కనిపిస్తాయి. ఆదిరెడ్డి అనే ఒక యూట్యూబర్ రివ్యూల వల్లనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లగలిగాడు. అయితే అవేవీ సైంటిఫిక్ సైకలాజికల్ అనాలసిస్ లు కావు. వాళ్లకు తెలిసింది, తోచింది చెప్పేస్తున్నారు. విదేశాల్లో ఇలా లేదు.
బ్రిటన్ లో బిగ్ బ్రదర్ షో కు జూడీ జేమ్స్ అని ఒక రెసిడెంట్ సైకాలజిస్ట్ ఉంది. ఆమె హౌస్మేట్ పర్సనాలిటీ, సోషల్ డైనమిక్స్, ఇతర అంశాల గురించి వారానికొకసారి విశ్లేషణ అందిస్తుంది. జెఫ్రీ బీటీ అనే సైకాలజిస్ట్ బిగ్ బ్రదర్ హౌస్మేట్ల బాడీ లాంగ్వేజ్ పై అధ్యయనం చేస్తున్నాడు. బిగ్ బ్రదర్ నుండి ఉదాహరణలను ఉపయోగించి ఒక అకడమిక్ పుస్తకం కూడా రాశాడు.
స్టీవెన్ స్టెయిన్ అనే సైకాలజిస్ట్ కెనడా బిగ్ బ్రదర్ కు పోటీదారుల ఎంపిక, సీజన్ ముగిశాక పోటీదారులు రియాలిటీకి ప్రవేశించడంలో సహాయపడటానికి డిబ్రీఫింగ్ థెరపీ సెషన్‌లను అందిస్తున్నాడు.
అలాగే చాలాదేశాల్లో సైకాలజిస్టులు పోటీదారుల మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో, షో సమయంలో, ఆ తర్వాత మద్దతును అందిస్తున్నారు. కానీ మనదేశంలో అలాంటి ప్రయత్నమేదీ కనిపించలేదు. ఆ లోటును భర్తీ చేసేందుకే ఈ ప్రయత్నం. బిగ్ బాస్ తెలుగు షో ద్వారా సైకాలజీ తెలుసుకునేందుకు, రియల్ లైప్ సైకాలజీ పాఠాలు నేర్చుకునేందుకు ఈ కాలమ్ తప్పకుండా ఫాలో అవ్వండి.
సైకాలజిస్ట్ విశేష్
+91 8019 000066
www.psyvisesh.com
Comments
Please login to add a commentAdd a comment