మనసు కోతిలాంటిది. ఎప్పుడూ ఒకచోట కుదురుగా ఉండదు. ఈ క్షణం ఒక అంశం గురించి ఆలోచిస్తుంటే, మరుక్షణం మరో అంశంపైకి గెంతుతుంది. కొందరు ఒకే విషయం గురించి అతిగా ఆలోచిస్తూ బాధపడుతుంటారు. సకల మానవ దు:ఖానికి కారణమైన మనసును నియంత్రించడం కోసం అనాదిగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
యోగ: చిత్తవృత్తి నిరోధక: అనే సూత్రంతోనే పతంజలి యోగసూత్రాలు మొదలవుతాయి. అష్టాంగమార్గం ద్వారానే దు:ఖాన్ని తప్పించుకోగలమని బౌద్ధం బోధిస్తుంది. జపాన్ లోని బౌద్ధులు కూడా మనసును నియంత్రించుకోవడం గురించి అన్వేషించి ఏడు టెక్నిక్స్ అందించారు. సైకాలజీ అనేది పుట్టకముందే, వేల సంవత్సరాల కిందటే మొదలైన ఈ టెక్నిక్స్ ను ఇప్పటికీ అక్కడ చాలామంది ఉపయోగిస్తున్నారు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
1. షోగనై: మీ కంట్రోల్ లో ఉన్న విషయాల గురించి, మీ కంట్రోల్ లేని విషయాల గురించి బాధపడకూడదు. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కదా. సింపుల్. మీ కంట్రోల్ లో ఉన్న విషయాల గురించి బాధపడటం ఎందుకు? వాటిని ప్రయత్నించి సాధించాలి. మీ కంట్రోల్ లేని విషయాల గురించి ఎంత ఆలోచించినా, ఎంత ప్రయత్నించినా అర్థం లేదు కదా. ఈ వైఖరిని అనుసరిస్తే అనవసర ఆలోచనలు మీ మనసులోకి రానే రావు. మీజీవితంలో కష్టాలూ రావు. వచ్చినా... మీ కంట్రోల్ లో ఉన్నదైతే పరిష్కరించుకుంటారు, లేనిదైతే వదిలేసి ముందుకు సాగవచ్చు.
2. షిరిన్-యోకు: బిజీ బిజీ జీవితంతో విసిగిపోయినప్పుడు.. ‘‘అబ్బ, ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్తే ప్రాణానికి హాయిగా ఉంటుందబ్బా’’ అని అనుకుని ఉంటారుగా. అంతదూరం వెళ్లాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ ఉన్న ప్రకృతితో మమేకం అవ్వండి. పచ్చదనంలో సమయం గడపండి. అతిగా ఆలోచించకుండా ఉండటానికి ఇది ఉత్తమమైన మార్గం. మీ మనసును శాంతపరచడానికి ఇది ఉపయోగపడుతుంది.
3. నేన్ బుత్సు: అతిగా ఆలోచించడం నుంచి మనసును మళ్లించడానికి సులువైన మార్గం జపం. అంటే మీరు విశ్వసించే, మీకు నచ్చిన పదాన్ని జపించండి. ఏ పని చేస్తున్నా దానిపైనే ధ్యాస నిలపండి. దానివల్ల ఇతర అంశాల గురించే ఆలోచించే అవకాశం తగ్గుతుంది, మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
4. జాజెన్: ఇది జెన్ బౌద్ధమతంలో విస్తృతంగా అభ్యసించే ధ్యానం యొక్క రూపం. చాలా సులువైన విధానం. మీ ఆలోచనలను మీరు ఎలాంటి జడ్జ్ మెంట్ లేకుండా పరిశీలించడం. అంటే ఒక సాక్షిలా ఆలోచనలను పరిశీలించడం. ఎప్పుడైతే మీరు ఆలోచనలకు స్పందించకుండా, విశ్లేషించకుండా ఉంటారో అప్పుడవి ఆటోమేటిక్ గా తగ్గుతాయి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.
5. గమాన్: జీవితం సుఖదుఖాల, విజయాపజయాల మిశ్రమం. ఒక్కోసారి అనుకోని తీరులో కష్టం ఎదురవ్వవచ్చు. అప్పుడు కుంగిపోకూడదు. నాకే ఎందుకిలా జరిగిందంటూ ఆలోచిస్తూ ఉండిపోకూడదు. ఆలోచనల వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని, అడుగు వేసినప్పుడే ఫలితాలు వస్తాయని గుర్తించి.. ముందడుగు వేయాలి.
6. వాబీ-సాబీ: జీవితంలో అన్నీ తాత్కాలికమేననీ, ఏదీ శాశ్వతం పరిపూర్ణం కావని గుర్తించమని చెప్పే జపనీస్ టెక్నిక్ ఇది. ఎప్పడైతే ఈ విషయాన్ని అంగీకరిస్తారో, అప్పడు పర్ ఫెక్ట్ గా ఉండాలనే ఒత్తిడి నుంచి మీరు తప్పించుకోగలరు. అప్పుడు అతిగా ఆలోచించడం నుంచి మీరు తప్పించుకోగలరు, ప్రశాంతంగా ఉండగలరు.
7. ఇకబెనా: ఇది పువ్వులను అందంగా అమర్చే ఆసక్తికరమైన టెక్నిక్. మీరు పువ్వులను అమర్చేటప్పుడు మీ ధ్యాస మొత్తం వాటిపైనే ఉండాలి. వాటిపై శ్రద్ధ నిలపడం ద్వారా మీ మనసు అందాన్ని సృష్టించడంలో మునిగిపోతుంది. అతిగా ఆలోచించడం నుంచి తప్పించుకుని ప్రశాంతంగా ఉండగలరు. దీన్నే ఫ్లో స్టేట్ అంటారు.
మరెందుకు ఆలస్యం వీటిలో మీకు నచ్చిన టెక్నిక్ ఉపయోగించి ఓవర్ థింకింగ్ నుంచి తప్పించుకోండి. అయితే ఇవి మానసిక సమస్యలున్నవారికి కాదని, సైకోథెరపీకి ప్రత్యామ్నాయం కాదనే ఎరుకతో ఉండండి. ఈ ప్రయత్నాలేవీ మీ ఓవర్ థింకింగ్ ను ఆపలేకపోతే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ లోని కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ ద్వారా మీ ఓవర్ థింకింగ్ ను తప్పించుకునేందుకు సహాయపడగలరు.
సైకాలజిస్ట్ విశేష్
8019 000066
psy.vishesh@gmail.com
Comments
Please login to add a commentAdd a comment