బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలలో అయినా, నిజ జీవితంలో అయినా మీరు చూసేదంతా నిజంకాదు. అది మీ పర్సెప్షన్ మాత్రమే. అదెలాగంటారా? బిగ్ బాస్ లో24 గంటల సంఘటనలను ఎడిట్ చేసి ఒక గంటలో చూపిస్తారు. మనం చూసినదాన్ని బట్టి అందులోని కంటెస్టెంట్లపై మనకు ఒక అభిప్రాయం, అవగాహన ఏర్పడుతుంది. ఆ అవగాహన ఆధారంగానే ఇష్టపడటం, వ్యతిరేకించడం, ఓట్లు వేయడం జరుగుతుంది. జీవితంలోనైనా అంతే.
ఏ వ్యక్తీ మరో వ్యక్తి జీవితాన్ని 24/7 చూడలేడు. అతనితో పాటు జీవించే కుటుంబ సభ్యులైనా సరే అతని మనసులోని మధనాన్ని అర్థం చేసుకోలేడు. మనకు కనిపించిన ప్రవర్తనను బట్టి ఆ వ్యక్తి గురించి ఒక అంచనాకు వస్తాం. అలా అంచనాకు రావడానికి మన అనుభవాలు, నమ్మకాలు, విలువలు, విశ్వాసాలు అన్నీ బ్యాక్ గ్రౌండ్ లో పనిచేస్తాయి. అలా మన పంచేద్రియాల ద్వారా వచ్చిన సమాచారాన్ని మన అనుభవాలు, నమ్మకాలు, విలువలు, విశ్వాసాలు ఆధారంగా మనం ఎలా అర్థం చేసుకుంటామనేదే పర్సెప్షన్. మనకు అర్థమైనదే నిజం కాదు, అది ఒక పర్సెప్షన్ మాత్రమే, ఎవరి పర్సెప్షన్ వారికి ఉంటుందనే సూత్రాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే విభేదాలే ఉండవు.
ఇక బిగ్ బాస్ షో విషయానికి వస్తే.. కంటెస్టంట్లు తాము ఉన్నది ఉన్నట్లు కాక, తామెలా కనిపించాలనుకుంటున్నారో అలాగే ప్రవర్తిస్తారు. దాని ఆధారంగానే మనం ఒక అవగాహనకు వస్తాం. ఉదాహరణకు అభయ్ నవీన్ తన తండ్రి మరణం, నటన, దర్శకత్వం అవకాశం గురించి మాట్లాడాడు. తాను దర్శకుడు అవ్వడం వల్ల నటించననే అపోహతో అవకాశాలు తగ్గాయని చెప్పాడు. తనను తాను ఎక్స్ ప్లోర్ చేసుకోవడం కోసం హౌస్ లోకి వెళ్తున్నానన్నాడు. అయితే ఈ మాటలన్నీ అతను తనను తాను ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకోవాలనుకుంటున్నాడో అందులో భాగమే తప్ప, అతని పూర్తి పర్సనాలిటీ కాదు.
ప్రతీ మనిషిలోనూ నాలుగు రకాల సెల్ప్ లు ఉంటాయి. రియల్ సెల్ఫ్, ఐడియల్ సెల్ఫ్, పబ్లిక్ సెల్ఫ్, బిహేవియరల్ సెల్ఫ్. మనకు కనిపించేది బిహేవియరల్ సెల్ఫ్ మాత్రమే. రియల్ సెల్ఫ్ అంటే మన నిజస్వరూపం, ఇతరులకు తెలియనిది, చూపించనిది. ఐడియల్ సెల్ఫ్ అంటే మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అది.
పబ్లిక్ సెల్ఫ్ అంటే మనం పబ్లిక్ లో ఎలా కనిపించాలనుకుంటున్నామో, కనిపిస్తామో అది. బిహేవియల్ సెల్ఫ్ అంటే మనం ఎలా ప్రవర్తిస్తామో అది. ఉదాహరణకు ఆదిత్య ఓం తాను డిప్రెషన్‌ని అధిగమించి "పునర్జన్మ" కోసం బిగ్ బాస్ లోకి ప్రవేశించానని చెప్పాడు. ఇది అతని పబ్లిక్ సెల్ఫ్ ను సూచిస్తుంది.
విష్ణుప్రియ తన IQ తక్కువని, ఎంటర్టయిన్మెంట్ కోసం ప్రయత్నిస్తానని చెప్పింది. తాను సరదాగా ఉన్నట్లు ప్రవర్తిస్తున్నా ఆమె రియల్ సెల్ప్ లోతులు ఎవ్వరికీ తెలీదు.
యష్మి తన బ్రేకప్ గురించి, మూడ్ స్వింగ్స్ గురించి మాట్లాడుతూ తనను తాను బలమైన వ్యక్తిగా చెప్పుకుంది. అది ఆమె ప్రొజెక్టెడ్ లేదా పబ్లిక్ సెల్ఫ్ మాత్రమే. ఆమె రియల్ సెల్ప్ ఏమిటో ఎవరికీ తెలియదు.
నిఖిల్ శాంతిని కోరుకుంటున్నానంటూ నిత్యం గొడవలుండే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాడు. దాన్ని బట్టి అది అతని రియల్ సెల్ఫా లేక ఆటకోసం ప్రదర్శించిన ప్రొజెక్టెడ్ సెల్ఫా అని ప్రశ్నించవచ్చు.
మన సోషల్ సెల్ఫ్ చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి మారుతుంది. ఉదాహరణకు మణికంఠ ప్రాంక్ ఎలిమినేషన్ సమయంలో ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యి తన సున్నితత్వాన్ని చూపించాడు. అలాగే తాను ఒత్తిడి, రిజెక్షన్ తో బాధపడుతున్నట్లు చెప్పాడు. అలాగే ఒకానొక సందర్భంలో ఇకపై నటించలేనంటూ విగ్ తీసేశాడు. అంటే పబ్లిక్ సెల్ఫ్ ను పక్కనపెట్టేశాడు.
మనం మన నమ్మకాలను ధృవీకరించే విషయాలను మాత్రమే గమనిస్తాం, మన నమ్మకాలకు విరుద్ధంగా ఉన్న సమాచారాన్ని నిర్లక్ష్యం చేస్తాం. దీన్నే పర్సెప్షన్ బయాస్ అంటారు.
ఉదాహరణకు, బేబక్క వంటలో నిర్లక్ష్యం చేస్తోందని సోనియా ఆరోపించింది. కానీ అది ఆమె పర్సెప్షన్ బయాస్ కావచ్చు. కానీ బిగ్ బాస్ టీమ్ దాన్ని ఎడిట్ చేసి చూపించిన దాన్ని బట్టి ప్రేక్షకులు ఎవరో ఒకరివైపు నిలబడతారు. నిజజీవితంలోనూ ఇలాగే జరుగుతుంది. మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి ఒకవైపు నిలబడతాం.
బిగ్ బాస్ కు నిజజీవితానికి లింక్ ఏంటంటే... మనం మనకు చూపించే, కనిపించే దాన్ని బట్టి బిగ్ బాస్ కంటెస్టెంట్లపై ఎలా అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటామో, తీర్పులిస్తామో నిజజీవితంలోనూ అదే చేస్తాం. సోషల్ మీడియా కూడా అంతే.
జీవితంలో జరిగే ముఖ్య సంఘటనలను సోషల్ మీడియాలో చూపుతాం. దాన్ని బట్టి ఆనందంగా ఉన్నారని అనుకోవచ్చు. కానీ నిజానికి చాలా కష్టాల్లో, బాధల్లో ఉండవచ్చు. కానీ మనం మనకు కనిపించిన దాన్ని బట్టే అవగాహనకు వస్తాం. మనం చూసేది, చూపించేది జీవితంలో ఒక భాగం మాత్రమే. అందుకే కనిపించేదంతా నిజంకాదు, అదొక పర్సెప్షన్ మాత్రమే.
-సైకాలజిస్ట్ విశేష్
8019 000066
www.psyvisesh.com
Comments
Please login to add a commentAdd a comment