విశ్లేషణం: ఆ తిక్కకున్న లెక్కేంటట?
ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని కచ్చితంగా అంచనా వేయాలంటే పరీక్షలు నిర్వహించాలి. అయితే అన్ని సందర్భాల్లోనూ, అందరి విషయంలోనూ అది సాధ్యంకాదు... ప్రముఖుల విషయంలో అసలే సాధ్యంకాదు. అయితే వారు మాట్లాడే తీరు, వాడే పదాలు, బాడీ లాంగ్వేజ్, జీవన విధానం, వివిధ సందర్భాల్లో వారి ప్రవర్తన, స్పందనను గమనించడం ద్వారా కూడా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. అలాంటి ప్రయత్నమే ఈ ‘విశ్లేషణం’.
కొంచెం తిక్కుంది.. దానికి లెక్కుంది...
పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే చాలు అభిమానుల్లో పవర్ ప్రవహిస్తుంది. ఆయన మనుషుల్లో/ మనుషులతో కలవడు... కలిసినా పెద్దగా మాట్లాడడు... కానీ అభిమానులకు ఆయనో వ్యసనం. ఎందుకంటే ఆయన మాటల్లో మనిషి కనిపిస్తాడు... ఆ మనిషిలో నిజాయితీ కనిపిస్తుంది.
పవన్‌కళ్యాణ్ అనగానే మెడమీద చెయ్యి రుద్దుకుంటూ కోపంగా చూసే యాంగ్రీ యంగ్‌మ్యాన్ ‘బద్రి’ గుర్తొస్తాడు. అయితే అది సినిమాలకు సంబంధించిన మేనరిజమ్ మాత్రమే. బాహ్యప్రపంచంలో ఆ మేనరిజమ్ కనిపించదు... కళ్లలో అంత కోపమూ కనిపించదు. అసలాయన కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తే కదా. పక్కకు లేదా కిందకు చూస్తుంటారు. మాట్లాడేతీరు కూడా తనతో తాను మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటుంది. స్వరం కూడా మంద్రస్థాయిలో ఉంటుంది. వాడే పదాల్లో భావోద్వేగాలకు, మనసుకు సంబంధించిన పదాలు ఎక్కువగా ఉంటాయి. వీటినిబట్టి ఆయనో అంతర్ముఖుడని, కెనైస్థటిక్ పర్సన్ (ఫీలింగ్స్‌కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి) అని చెప్పవచ్చు. వీరికి భావోద్వేగాలు, స్పందనలు ఎక్కువగా ఉంటాయి. పలు సందర్భాల్లో పవన్ అలా స్పందించడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఆయన మనుషులతో అంతగా కలవక పోయినా వాళ్లు ఆయనతో అంతగా కనెక్ట్ అవుతుంటారు.
మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఎవరైనాసరే కాస్త మంచి డ్రస్ వేసుకుంటారు.. కాస్త జాగ్రత్తగా ఉంటారు. పద్ధతిగా కూర్చుంటారు. కానీ పవర్‌స్టార్‌ను గమనించండి. చాలా క్యాజువల్ డ్రెస్‌లో వస్తారు.. మరింత క్యాజువల్‌గా ఒక కాలు మడిచి దానిమీద మరో కాలు వేసుకుని కూర్చుంటారు. ఇలా కూర్చోవడం అతని బిడియపు స్వభావాన్ని వ్యక్తం చేస్తుంది. అతని శరీరం పైభాగం ఎంత రిలాక్స్‌డ్‌గా కనిపిస్తున్నా, అతనెంతగా నవ్వుతున్నా... అతనింకా తన కవచంతో తను ఉన్నాడనే విషయం తెలుస్తుంది.
ఆయనెంత హీరో అయినా పదిమందిలో మాట్లాడాలంటే, ముఖ్యంగా మీడియాతో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. చేతిలో ఓ పెన్ పెట్టుకుని కదుపుతూ తన నెర్వస్‌నెస్‌ను, యాంగ్జయిటీని రిలీజ్ చేసుకుంటారు. ఇక ఎవరైనా పొగుడుతుంటే ఫక్కున నవ్వేసి తనలోని ఇబ్బందిని, ఒత్తిడిని వదిలించుకుంటారు.
సినిమా పరిశ్రమ అంటేనే వెలుగు జిలుగులు. కానీ పవన్ జీవనశైలి వాటిని దూరంగా ఉంటుంది. షూటింగ్ అయిపోగానే తన ఫాంహౌస్‌కు వెళ్లిపోవడం, మొక్కలతో తన ప్రేమను పంచుకోవడం, పుస్తకాల్లో మునిగిపోవడం, మౌనాన్ని ఆస్వాదించడం... ఇవన్నీ చూస్తే పవన్‌లో మనకో తాత్వికుడు కనిపిస్తాడు. పలు సందర్భాల్లో ఆయన మాట్లాడిన మాటల్లో అలాగే వినిపిస్తాడు. ‘‘నేను మాస్టర్ అనుకుంటే గ్రోత్ ఆగిపోతుంది. విద్యార్థిగా ఉంటే నిరంతరం నేర్చుకోవచ్చు’’, ‘‘ఏమీ తెలియనప్పుడు మనకంతా తెలుసనుకుంటాం. నేర్చుకోవడం మొదలుపెట్టాక మనకు ఏమీ తెలియదని తెలుసు కుంటాం’’, ‘‘రియల్ యు అనేది ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలి. అయినా ఎప్పటికీ తెలియదు. చనిపోయాక తెలుస్తుందేమో’’, ‘‘సినిమాకన్నా జీవితం ఎక్కువ డ్రమటిక్‌గా ఉంటుంది’’... ఇవన్నీ ఆయన మాటలే.
సమాజం పట్ల తనకున్న అభిప్రాయాలను పవన్ ప్రతి సినిమాలో ఒక పాట ద్వారా వ్యక్తం చేయడం మనకు తెలుసు. అయితే అది సినిమాలకు మాత్రమే పరిమితం కాదు... అది ఆయన మనసు భాష. పవన్ మిగతా విషయాలు మాట్లాడేటప్పటికీ, సమాజం గురించి మాట్లాడేటప్పటికీ స్వరంలో తేడా స్పష్టంగా తెలిసిపోతుంది. సమాజం గురించి మాట్లాడాలంటే ఆయన గొంతు గంభీరంగా మారిపోతుంది. మాటల్లో ఏదో తెలియని ఆవేదన ధ్వనిస్తుంది. అన్యాయాలపై కోపం కనిపిస్తుంది. ఏదో చేయాలనే భావం వినిపిస్తుంది. అందుకేనేమో ‘పవనిజం’ అభిమానుల మతమైంది.
పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే తన ప్రపంచంనుంచి బయటకువచ్చి పదిమందిలో కలవడం మొదలుపెట్టారు. ఆయన దీన్నే కొనసాగిస్తే, కాస్తంత కుదురుగా కూర్చుని మాట్లాడితే, మాట్లాడేటప్పుడు కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే... ఆయన మరిన్ని మనసుల్ని దోచుకోగలడు.. మరింతమంది మనుషులకు ఆత్మీయుడు కాగలడు.
- విశేష్, సైకాలజిస్ట్