ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో జనవరి 4వ తేదీ నుంచి ఏడో విడత భూ పంపిణీ చేపట్టనున్నట్లు కలెక్టర్ విజయకుమార్ తెలిపారు. పొదిలిలో మంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడో విడత భూ పంపిణీకి సంబంధించి 7,716 ఎకరాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. 5,766 మంది రైతులకు భూమిని పంపిణీ చేసేందుకు పట్టాదారు పాస్‌పుస్తకాలు కూడా సిద్ధం చేశామన్నారు. 10వ తేదీలోపు భూ పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
‘పచ్చతోరణం’కు 7,200 ఎకరాలు...
ఇందిరమ్మ పచ్చతోరణం పథకానికి సంబంధించి జిల్లాలో 7,383 మందికి 7,200 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ వివరించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీలను గుర్తించి పచ్చతోరణం పథకం కింద మొక్కలు పెంచే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. డ్వామా ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 2 లక్షల 4 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యం కాగా, ప్రస్తుతం లక్షా 14 వేల మరుగుదొడ్లు గ్రౌండింగ్‌లో ఉన్నాయని, మార్చి నాటికి వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పరిశ్రమల స్థాపనకు భూసేకరణ...
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు భూ సేకరణ చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పామూరు-కనిగిరి రోడ్డులో 12,500 ఎకరాలు సేకరించాలని కందుకూరు ఆర్డీవోను ఆదేశించినట్లు చెప్పారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్‌తో మాట్లాడామన్నారు. ప్రకాశం అక్షర విజయం కార్యక్రమంలో భాగంగా 6.50 లక్షల మంది నిరక్షరాస్యులను గుర్తించామని, 20 వేల మంది వలంటీర్లతో 20 వేల 30 అక్షర కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. మార్చి 21లోపు నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా చేసి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
*25.14 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీకి ప్రతిపాదనలు...
రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు 25.14 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు కలెక్టర్ తెలిపారు. 39 మండలాల్లో 25,642 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. 44,633 మంది చిన్న, సన్నకారు రైతులు నష్టపోయినట్లు తెలిపారు. 1000 చేనేత కుటుంబాలకు 5 వేల రూపాయల చొప్పున సాయం అందించాలని ప్రతిపాదించామన్నారు. రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో అదనపు తరగతి గదుల నిర్మాణాలను వేగవంతం చేసినట్లు వెల్లడించారు. 654 తరగతి గదులకుగానూ 633 పూర్తిచేశామన్నారు. 8 నెలల క్రితం ప్రారంభంకాని వాటిని రద్దు చేయాలన్న యోచనలో ఉండగా, అనతికాలంలోనే మంచి పురోగతి సాధించినట్లు కలెక్టర్ వివరించారు. విలేకర్ల సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, ముఖ్య ప్రణాళికాధికారి కేటీ వెంకయ్య, డీఆర్‌డీఏ పీడీ పద్మజ తదితరులు పాల్గొన్నారు.
4 నుంచి ఏడో విడత భూ పంపిణీ
Published Sat, Dec 28 2013 4:46 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement
Advertisement