రూ. 8 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం  | Rs 8 crore worth of drugs seized | Sakshi
Sakshi News home page

రూ. 8 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం 

Published Wed, Feb 7 2024 4:32 AM | Last Updated on Wed, Feb 7 2024 11:44 AM

Rs 8 crore worth of drugs seized - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/పంజగుట్ట: మెట్రోనగరాల్లో తన నెట్‌వర్క్‌ ద్వారా డ్రగ్స్‌ దందా చేస్తున్న నైజీరియన్‌ స్టాన్లీ ఉదోకాఇయూలను తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీఎస్‌ నాబ్‌) అధికారులు పట్టుకున్నారు. ఇతడి నుంచి రూ.8 కోట్ల విలువైన ఎనిమిది రకాలైన మాదకద్రవ్యాలు స్వాదీనం చేసుకున్నట్టు పశ్చిమ మండల డీసీపీ ఎం.విజయ్‌కుమార్‌ చెప్పారు. ఎస్పీ కేసీఎస్‌ రఘువీర్, ఏసీపీఎస్‌.మోహన్‌కుమార్, ఇన్‌స్పెక్టర్‌ పి.రాజేష్ తో కలిసి పంజగుట్ట ఠాణాలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.  

బిజినెస్‌ వీసాపై ముంబై వచ్చి... గోవాలో స్థిరపడి 
నైజీరియాకు చెందిన స్టాన్లీ 2009 నవంబర్‌లో బిజినెస్‌ వీసాపై ముంబైకి వచ్చాడు. తొలినాళ్లలో రెడీమేడ్‌ వ్రస్తాల వ్యాపారం చేశాడు. వ్యాపార విస్తరణలో భాగంగా 2012లో తన మకాం గోవాకు మార్చాడు. అక్కడి కండోలిమ్‌ ప్రాంతంలో కొందరు స్నేహితులతో కలిసి ఉంటూ రెడీమేడ్‌ దుస్తుల వ్యాపారం చేశాడు. పాస్‌పోర్టు పోగొట్టుకొని, వీసా గడువు ముగిసినా అక్రమంగా తిష్టవేశాడు.

ఈ విషయం పసిగట్టిన గోవా పోలీసులు అరెస్టు చేయడంతో ఆరు నెలలు జైలులో ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కండోలిమ్‌లోనే ఉండే రాజస్తానీ యువతి ఉషాచండేల్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికే తన భర్త నుంచి వేరుపడిన ఆమెను వివాహం చేసుకున్నాడు.

ఇద్దరూ కలిసి స్టాన్లీ గ్రోసరీ పేరుతో కిరాణ దుకాణం ఏర్పాటు చేశారు. అక్కడకు సరుకులు ఖరీదు చేయడానికి వచ్చే ఇద్దరు నైజీరియన్లతో స్టాన్లీకి పరిచయమైంది. ఓ దశలో ఆర్థిక నష్టాల్లో చిక్కుకున్న స్టాన్లీకి ఈ ఇద్దరూ ఇచ్చిన సూచనల మేరకు ఎక్కువ లాభాలు ఉంటాయనే ఉద్దేశంతో డ్రగ్స్‌ దందా మొదలెట్టాడు.  

సేల్స్‌ నుంచి సప్లై చైన్‌ వరకు... 
తొలినాళ్లలో స్టాన్లీ ఆ ఇద్దరు నైజీరియన్ల నుంచి డ్రగ్స్‌ తీసుకొని స్థానికంగా విక్రయించేవాడు. వస్త్ర వ్యాపారంలో కంటే ఎక్కువ లాభాలు వస్తుండటంతో దీనినే కొనసాగించాడు. ఇద్దరు మిత్రులు నైజీరియాకు వెళ్లడంతో వారి డ్రగ్స్‌ వ్యాపారాన్నీ స్టాన్లీ టేకోవర్‌ చేశాడు. విదేశాల నుంచి డ్రగ్స్‌ తెప్పించడం, స్థానికంగా ఉన్న పెడ్లర్స్‌కు సప్లై చేయడం... ఇలా ఓ డ్రగ్స్‌ చైన్‌ ఏర్పాటు చేశాడు.

2017లో ఇదే ఆరోపణలపై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులకు చిక్కి జైలుకు వెళ్లాడు. అక్కడ ఏర్పడిన పరిచయాలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. బయటకు వచ్చాక డ్రగ్స్‌ దందాను మరింత విస్తరించాడు. నైజీరియాతోపాటు నెదర్లాండ్స్‌లో ఉన్న డ్రగ్‌ సప్లయర్స్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు.

వారికి ఆర్డర్లు ఇస్తూ కొరియర్‌తో పాటు విమానాల్లో వివిధ రకాలైన డ్రగ్స్‌ తెప్పించుకునేవాడు. ఆయా దేశాల నుంచి కొందరు ట్రాన్స్‌పోర్టర్లు పెద్ద క్యాప్సూల్స్‌ రూపంలో కడుపులో దాచుకొని, బ్యాగుల్లోని రహస్య అరల్లో సర్దుకుని తీసుకొచ్చేవారు.  

మాదకద్రవ్యాలు ముంబై టు గోవా 
మాదకద్రవ్యాలు తొలుత ముంబై వచ్చేవి. అక్కడ ఉన్న సప్లయర్స్‌ ద్వారా గోవాకు తెప్పించుకునేవాడు. వీటిని కస్టమర్లతో పాటు ఇతర పెడ్లర్స్‌కు సరఫరా చేయడానికి ముగ్గురు దళారులను ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి ప్రయాణ ఖర్చులతో పాటు ఒక్కో గ్రాము డెలివరీ చేసినందుకు రూ.2 వేల కమీషన్‌ ఇచ్చేవాడు.

నైజీరియా వెళ్లిన ఇద్దరు మిత్రులు సైతం తమ పాత కస్టమర్ల ద్వారా వారికి వచ్చే ఆర్డర్స్‌ను వాట్సాప్‌ ద్వారా ఇతడికి పంపేవారు. ఇలా చేసినందుకు వారికీ గ్రాముకు రూ.2 వేలు కమీషన్‌ ఇచ్చేవాడు. ఇలా తన వ్యాపారాన్ని విస్తరించిన స్టాన్లీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 511 మంది కస్టమర్లు ఉండగా, వారిలో ఏడుగురు నగరానికి చెందిన వారు.

ఆర్థిక లావాదేవీలన్నీ క్రిప్టో కరెన్సీ లేదా హవాలా రూపంలో చేస్తుంటాడు. ముంబైలో వస్త్రవ్యాపారం చేస్తుండగా పరిచయమైన నెట్‌వర్క్‌నే వాడుకుంటున్నాడు. స్టాన్లీ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గోవాలో రూ.కోటి ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు.  

ఎస్‌ఆర్‌ నగర్‌లో దొరికిన తీగ లాగితే...  
టీఎస్‌ నాబ్‌ అధికారులు గత నెల 18న ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దాడి చేసి 14 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 38 ఎక్స్‌టసీ పిల్స్‌ స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో కీలక నిందితుడైన బాబూసోను లోతుగా విచారించగా, డ్రగ్స్‌ స్టాన్లీ ద్వారా వస్తున్నాయని తేలింది. దీంతో గోవా వెళ్లిన టీఎస్‌ నాబ్‌ పోలీసులు నెల రోజులు శ్రమించి స్టాన్లీ ఆచూకీ కనిపెట్టారు.

అతడి కదలికలపై నిఘా ఉంచిన అధికారులు మంగళవారం డ్రగ్స్‌ డెలివరీ ఇవ్వడానికి పంజగుట్టకు వచ్చినట్టు తెలుసుకున్నారు. అక్కడ వలపన్ని స్టాన్లీని పట్టుకోవడంతో పాటు అతడి నుంచి 557 గ్రాముల కొకైన్, 902 ఎక్స్‌టసీ మాత్రలు, 21 గ్రాముల హెరాయిన్, 45 గ్రాముల ఓజీ వీడ్, 105 ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్, 215 గ్రాముల చరస్, 7 గ్రాముల యాంఫెటమైన్, 190 గ్రాముల గంజాయి, 8 సెల్‌ఫోన్లు, రూ.5.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

పరారీలో ఉన్న సిటీలోని ఏడుగురు కస్టమర్ల కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్‌ దందా వివరాలు తెలిసిన వారు 8712671111కు కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement