ఉడ్తా షెహర్‌! హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న డ్రగ్స్‌.. | Huge Marijuana and Drugs Usage In Hyderabad | Sakshi
Sakshi News home page

ఉడ్తా షెహర్‌! హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న డ్రగ్స్‌..

Published Tue, Feb 27 2024 12:57 AM | Last Updated on Tue, Feb 27 2024 12:57 AM

Huge Marijuana and Drugs Usage In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ డ్రగ్స్‌ అడ్డాగా మారుతోంది. యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసే మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు నగరంలో జోరుగా సాగుతున్నాయి. గంజాయి ఆకులతో తయారు చేసే హష్‌ ఆయిల్‌ మొదలుకుని, కొకైన్, హెరాయిన్, బ్రౌన్‌షుగర్, ఎండీఎంఏ, ఎల్‌ఎస్డీ బ్లాట్స్‌ లాంటి ఖరీదైన సింథటిక్‌ డ్రగ్స్‌ విచ్చలవిడిగా లభిస్తున్నాయి. పాఠశాల విద్యార్థుల నుంచి కాలేజీ కుర్రాళ్ల వరకు.. ప్రైవేట్‌ ఉద్యోగుల నుంచి సాఫ్ట్‌వేర్‌ నిపుణుల వరకు.. వైద్యులు, వ్యాపారవేత్తలతో పాటు సినీ ప్రముఖులు సైతం వీటి బారిన పడ్డట్టు తెలుస్తోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంత నిర్బంధం విధిస్తున్నా.. వాళ్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ డ్రగ్‌ పెడ్లర్స్‌ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు.

గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో జరిగిన పార్టీలో దాని యజమాని కుమారుడు సహా పలువురు ప్రముఖులపై కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇంటర్‌నెట్‌లో డార్క్‌ వెబ్‌ ద్వారా కావాల్సిన డ్రగ్‌ను ఎంచుకోవడం.. సోషల్‌ మీడియా యాప్‌ ద్వారా సరఫరాదారుడిని సంప్రదించడం.. బిట్‌ కాయిన్స్‌ రూపంలో నగదు చెల్లించడం.. డెడ్‌ డ్రాప్‌ లేదా కొరియర్‌ ద్వారా సరుకు తెప్పించుకోవడం..ఇలా పూర్తి వ్యవస్థీకృతంగా మాదకద్రవ్యాల దందా సాగిపోతోంది. వారాంతంలో హోటళ్లు, పబ్‌లు, రిసార్టుల్లో యథేచ్ఛగా డ్రగ్‌ పార్టీలు జరిగిపోతున్నాయి. 

దుమ్ము రేపుతున్న రేవ్‌ పార్టీలు 
ఒక్క రాడిసన్‌ హోటలే కాదు.. రాత్రి అయిందంటే చాలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్‌ తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, రిసార్టులు, పబ్‌లు రేవ్‌ పార్టీలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఇందుకోసం కొందరు నిర్వాహకులు ప్రత్యేకంగా యాప్‌లు నిర్వహిస్తున్నారు. పార్టీలకు హాజరు కావాలని భావించే వారంతా వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని రిజిస్టర్‌ చేసుకోవాలి. పార్టీ జరిగే ప్రాంతంలోకి ప్రవేశించే సమయంలో దానికి సంబంధించిన ఓటీపీని కూడా అక్కడి వారికి చెప్పాల్సి ఉంటుంది.  

పచ్చబొట్లలో డ్రగ్‌ గుట్టు 
కొందరు సొంతంగా యాప్స్, వాట్సాప్, టెలిగ్రాం గ్రూపులు నిర్వహిస్తూ మూడో కంటికి తెలియకుండా కస్టమర్లకు రేవ్‌ పార్టీలపై సమాచారం అందిస్తున్నాన్నారు. పార్టీకి హాజరయ్యే కస్టమర్‌ చేతులపై తాత్కాలిక పచ్చబొట్లు ముద్రిస్తున్నారు. ఈ టాటూ ఆధారంగానే ఏ డ్రగ్‌ సరఫరా చేయాలన్నది సప్లై చేసే వారికి తెలుస్తుంది. కుడి చేయి మణికట్టు మీద టాటూ వేస్తే అతడికి గంజాయి, హష్‌ ఆయిల్‌ సరఫరా చేయాలని అర్థం. ఎడమ చేతిపై టాటూ ఉంటే కొకైన్, ఎండీఎంఏ, ఎక్స్‌టసీ వంటి మాదకద్రవ్యాలు సరఫరా అవుతాయి. కొన్ని పబ్‌ల నిర్వాహకులు ‘స్పెషల్‌’, ‘ఆఫర్‌’, ‘స్కీమ్‌’, ‘లిమిటెడ్‌’పేరుతో ప్రత్యేక కోడ్‌ భాషను పార్టీల సందర్భంగా వాడుతున్నట్లు సమాచారం.  

రేవ్‌ తీరే వేరు 
అర్ధరాత్రి ప్రారంభమయ్యే రేవ్‌ పార్టీలు తెల్లవారే వరకు జరుగుతుంటాయి. వీటి నిర్వహణకు మద్యం, మాదకద్రవ్యాలు, మ్యూజిక్‌ సిస్టమ్‌తో పాటు ల్యాప్‌టాప్‌ లేదా స్క్రీన్‌ తప్పనిసరి. అడ్డూ అదుపు లేకుండా సాగే ఈ పార్టీల్లో హోరెత్తే మ్యూజిక్‌లో మత్తెక్కించే మద్యం, మగత పుట్టించే డ్రగ్స్‌తో రెచ్చిపోయి నాట్యం చేసే యువత.. ల్యాప్‌టాప్‌ లేదా స్క్రీన్‌ పై ‘పైట్రాన్స్‌’ఇమేజెస్‌గా పిలిచే ఓ రకమైన ఫొటోల్ని చూస్తుంటారు. అక్కడ సైకెడెలిక్‌గా పిలిచే ప్రత్యేక మ్యూజిక్‌ కూడా నడుస్తుంటుంది.

ఇవి వారిని మరింత రెచ్చగొట్టడంతో పాటు ఉత్తేజాన్ని ఇస్తుంటాయి. ఈ రేవ్‌ పార్టీ తీరుతెన్నులు, అక్కడకు వచ్చే వారి వస్త్రధారణ ఫలితంగా టీనేజ్‌లోనే పెళ్లి కాకుండా ‘లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌’లు పెరిగిపోతుండటం ఆందోళనకర అంశమని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక వ్యవస్థీకృతంగా కాకుండా కొద్దిమంది స్నేహితులు కలిసి చేసుకునే రేవ్‌ పార్టీలకు హోటళ్లు అడ్డాలుగా మారుతున్నాయి. దీనికోసం కనెక్టింగ్‌ రూమ్స్‌ వినియోగిస్తున్నారు.  

కొత్త ట్రెండ్‌.. డ్రగ్‌ టూర్స్‌ 
రాజధానిలో ఇటీవల కాలంలో డ్రగ్‌ టూర్స్‌ పెరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. టాస్‌్కఫోర్స్, ఎస్‌ఓటీ, హెచ్‌–న్యూ, టీఎస్‌–నాబ్‌ వంటి ప్రత్యేక వింగ్స్‌ రాజధానిలో జరుగుతున్న డ్రగ్స్‌ దందాపై నిఘా పెంచాయి. ఇది ఇక్కడ పెడ్లర్స్‌ కదలికలకు, మాదకద్రవ్యాల అందుబాటుకు కొంత సమస్యగా మారింది. మరోవైపు వీటి ఖరీదు కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో డ్రగ్స్‌ వినియోగదారులు ప్రత్యేక టూర్స్‌ ఏర్పాటు చేసుకుంటున్నట్లు సమాచారం. వీకెండ్స్‌లో సిటీకి చెందిన అనేక మంది హైక్లాస్‌ యూత్‌ గోవాతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

పిల్లల పైనా గంజాయి పంజా 
నగరంలో లభిస్తున్న మాదకద్రవ్యాల్లో గంజాయిది ప్రథమ స్థానం. ఒకప్పుడు కేవలం గంజాయి మొక్క ఆకుల్ని మాత్రమే ప్యాక్‌ చేసి సరఫరా చేసే వాళ్లు. అయితే భారీ స్థాయిలో దీన్ని సేకరించి, ప్యాక్‌ చేసి, వాహనాల్లో తరలించి విక్రయించడంలో రిస్క్‌ ఎక్కువ. దీంతో ఇటీవల కాలంలో గంజాయికి బదులుగా హష్‌ ఆయిల్‌ అక్రమ రవాణా పెరిగింది. గంజాయి ఆకుల్ని ప్రాసెస్‌ చేయడం ద్వారా దీన్ని తయారు చేస్తున్నారు. కొన్నిసార్లు క్రీమ్‌ మాదిరిగా ఉండే చరస్‌ను సరఫరా చేస్తున్నారు. లీటర్‌ ఖరీదు అత్యంత లాభదాయకంగా రూ.లక్షల్లో ఉండటంతో పాటు రవాణా, విక్రయం, వినియోగం తేలిక కావడంతో స్మగ్లర్లు వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ హష్‌ ఆయిల్‌తో తయారవుతున్న చాక్లెట్లు కూడా విచ్చలవిడిగా లభిస్తున్నాయి. పాఠశాల విద్యార్థులకు సైతం ఇవి అందుబాటులోకి వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.  

సింథటిక్‌ డ్రగ్స్‌ కేరాఫ్‌ విదేశాలు 
సింథటిక్‌ డ్రగ్స్‌ సౌతాఫ్రికా, నైజీరియా లాంటి దేశాల నుంచి వస్తున్నాయి. సముద్ర, విమాన మార్గాల్లో వచ్చి తొలుత ముంబై, గోవాలకు చేరుకుంటున్నాయి. అక్కడ ఉంటున్న డి్రస్టిబ్యూటర్లు వీటిని దేశ వ్యాప్తంగా ఉంటున్న పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నారు. వీరి నుంచి ఈ డ్రగ్స్‌ వినియోగదారులకు చేరుతున్నాయి. ఈ దందా కోసం పెడ్లర్స్‌ వివిధ రకాలైన సోషల్‌ మీడియా యాప్స్‌ వాడుతున్నారు. తమ ఐడీలను డార్క్‌వెబ్‌లోని డ్రగ్స్‌ ఫోరమ్స్‌లో తమ వద్ద లభించే డ్రగ్స్‌ వివరాలు, వాటి రేట్లను ఉంచుతున్నారు.

రేటు ఖరారైన తర్వాత బైనాన్స్‌ లేదా వజీరెక్స్‌ వంటి వాటి ద్వారా క్రిప్టో కరెన్సీగా మారిన నగదును స్వీకరిస్తూ కొరియర్‌ ద్వారా లేదా డెడ్‌ డ్రాప్‌ విధానంలో సరుకు పంపిస్తున్నారు. కొరియర్‌లో అయితే తమ అసలు చిరునామా రాయకుండా వస్తువులు, వ్రస్తాల మాదిరిగా ప్యాక్‌ చేసి లేదా కాగితాల మధ్యలో ఉంచి పంపిస్తున్నారు. ఎక్కువ సందర్భాల్లో ఎంపిక చేసిన ఓ ప్రాంతంలో డ్రగ్‌ పార్సిల్‌ ఉంచి ఆ వివరాలను మెసెంజర్‌ ద్వారా అందిస్తున్నారు. దీన్నే డెడ్‌ డ్రాప్‌ విధానం అంటారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement