ఖమ్మం: అక్రమాల పుట్టగా పేరున్న రాజీవ్ విద్యామిషన్ అధికారులు మరోసారి తమ నిజ స్వరూపం బయటపెట్టారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు వంటపాత్రలు, ఇతర వస్తువుల సరఫరాలో చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వస్తున్నాయి. టెండర్లలో చూపించినట్టుగా కాకుండా నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి నాసికరం వస్తువులు సరఫరా చేసినట్లు తెలిసింది.
ఇందులో షాపుల యజమానులతో ఆర్వీఎం అధికారులు కుమ్మక్కయ్యారనే విమర్శలు వస్తున్నాయి. కొత్తగా నియమితులైన పలువురు కేజీబీవీ ప్రత్యేకాధికారులు దీనిపై ప్రశ్నిస్తే.... ‘ఇది షరా మామూలే.. దీనిపై మీరు ఎక్కువగా మాట్లాడితే ఉన్నతాధికారుల దృష్టిలో పడుతారు’ అని ఆర్వీఎంలో పనిచేస్తున్న ఓ అధికారి బెదిరించడంతో వారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు. చేసేది లేక ఆ వస్తువులనే వినియోగిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం తెలిసిన జిల్లా ఉన్నతాధికారులు ఆర్వీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
బాలికల విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను నెలకొల్పింది. ఈ క్రమంలో జిల్లాలో మైదాన ప్రాంతంలో 21, ఐటీడీఏ పరిధిలో 12 కేజీబీవీలు మంజూరు చేశారు. మైదాన ప్రాంతంలో 15 కేజీబీవీలకు అన్ని వసతులతో కూడిన సొంత భవనాలు నిర్మించారు. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వంట చేసి పెట్టేందుకు ప్రభుత్వం రూ. 35,09,854 మంజూరు చేసింది. ఈ డబ్బులతో ఐరన్ స్టవ్‌లు, అల్యూమిలియం వంటపాత్రలు, గ్రైండర్, ఇడ్లీపాత్రలు, చపాతీ, దోశ పాత్రలు, 10, 5 కేజీల బొగ్‌నాస్, స్టీల్ బకెట్‌లు, స్టీల్ బేసిన్లు, రైస్ స్పూన్‌లు, చెంచాలు, టీ మగ్గులు, ఐరన్ క్యాబ్‌గిర్, మంచినీటి డ్రమ్ములు, ప్లేట్లు, గ్లాసులు, ట్రంక్ బాక్సులు, కార్పెట్లు, బెడ్‌షీట్‌లు మొదలైనవి కొనుగోలు చేయాలి.
ఇందుకోసం ఆయా వస్తువులు సరఫరా చేసే షాపు యజమానుల నుంచి టెండర్లు పిలిచారు. ఏ వస్తువు ఎన్ని కేజీలు ఉండాలి, ఎన్ని లీటర్లు ఉండాలి, ఏ కంపెనీకి చెందినవి సరఫరా చేయాలి అనే వివరాలను టెండర్ నోటీసులో పేర్కొన్నారు. దీనికి సమ్మతించి టెండర్లు వేసిన షాపులను జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. అయితే వస్తువుల సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు తెలియజేసేందుకు షాంపిల్‌గా కొన్ని వస్తువులను తీసుకొచ్చి అధికారులకు చూపించారు.
ఇంతవరకూ బాగానే ఉన్నా.. తీరా వస్తువులు సరఫరా చేసేటప్పటికి జిల్లా అధికారులకు టోకరా ఇచ్చి పలు నాసిరకం వస్తువులు సరఫరా చేసినట్లు సమాచారం. వీటిలో గ్రైండర్, తాగునీటి డ్రమ్ములు టెండర్లలో పేర్కొన్నవి కాకుండా వేరే కంపెనీవి సరఫరా చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారంలో ఆర్వీఎంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అధికారులకు, షాపు యజమానులకు మధ్యవర్తిత్వం చేసి కమీషన్లు కాజేసినట్లు సమాచారం. కాగా, ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఉన్నతాధికారి ఆర్వీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారనే ప్రచారం జరుగుతోంది.
ఇక్కడంతా షరా మామూలే...
నిధుల దుర్వినియోగం, బిల్లులు పెట్టడం, ఉపాధ్యాయులకు, ఇతర ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం, వస్తువుల కొనుగోలులో అవకతవకలు షరా మామూలే అని ఆ శాఖలో పనిచేస్తున్న అధికారులు చెపుతుండడం విశేషం. ఏళ్ల తరబడి ఆర్వీఎంలో కీలక శాఖలో పనిచేసే ఉద్యోగులు, అక్కడ పనిచేసే ఔట్ సోర్సింగ్ అధికారులను అనుకూలంగా మల్చుకొని నిధులు కాజేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
గతంలో కూడా కృత్రిమ అవయవాల కొనుగోలు, ఫిజియోథెరఫీ సెంటర్లలో ఏర్పాటు చేసిన బల్లలు, కంటిచూపు లోపం గల విద్యార్థులకు సరఫరా చేసిన కళ్లజోళ్లు మొదలైన వాటిల్లో అవకతవకలు జరిగాయని, వాటిని పట్టించుకున్న నాథుడే లేడని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆర్వీఎం ద్వారా కొనుగోలు చేసే వస్తువులు, నిధుల వ్యయంపై దృష్టి సారిస్తే అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. ఆ దిశగా అధికారులు దృష్టి సారించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
కొను‘గోల్‌మాల్’
Published Thu, Jul 3 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM
Advertisement
Advertisement