వేటు పడినా..సీటులోనే
భానుగుడి (కాకినాడ) :సర్వశిక్షాభియాన్‌ను ‘సర్వభక్షాభియాన్’గా మార్చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) పీఓ వెన్నపు చక్రధరరావుపై వేటు వేస్తూ ఎట్టకేలకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్వీఎం ప్రవేశపెట్టిన పలు పథకాల అమలులో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను విధుల నుంచి తొలగించి, విచారణ జరిపించాలని ఆ శాఖ డెరైక్టర్ ఉషారాణి ఆదేశించారు. వెన్నపు అవినీతి, అందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల ఆధారాలు మాయం కావడంపై ‘సాక్షి’ ‘సర్వ‘భక్ష’ అభియాన్’, ‘వాటి మాయం వెనుక మర్మమేమిటో’ పేరిట ప్రచురించిన కథనాలతో ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చింది. అయితే ఈనెల 4న జారీ అయిన ఆదేశాలపై ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడంతో వెన్నపు తన స్థానంలో కొనసాగుతూనే ఉన్నారు.
ఇవీ ఆరోపణలు
బడుగు విద్యార్థులకు స్కూల్‌బ్యాగ్‌ల పంపిణీ, ఏకరూప దుస్తులు, కార్ల వినియోగంలో, అధికారులకు టీఏ, డీఏ కేటాయింపులో, కేజీబీవీ ఉద్యోగ నియామకాల్లో అవినీతికి పాల్పడ్డారని, 2013లో రిపబ్లిక్‌డే శకటాల తయారీలో కలెక్టర్ ఆదేశాల్ని బేఖాతరు చేశారని, 2010 ఆర్‌ఎస్‌టీసీ నిధుల బడ్జెట్ విషయంలో తప్పుడు గణాంకాలు చూపారని వెన్నపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 13-5-2013 మే 13న ఉద్యోగంలో చేరినా ఆలనెల నాలుగు నుంచి వేతనం తీసుకున్నారన్న ఆరోపణా ఉంది.
జూలైలోనే మంత్రికి ఫిర్యాదు
వెన్నపు అవినీతిపై స్వచ్ఛంద సంస్థలు మంత్రి గంటా శ్రీనివాసరావుకు జులై 7న ఫిర్యాదు చేయగా విచార ణ జరిపించాలని కలెక్టర్ ను ఆదేశించారు. కలెక్టర్ ఏజేసీ మార్కండేయులు ఆధ్వర్యంలో నియమించిన కమిటీ ఫిర్యాదులోని 9 అంశాల్లో ఏడింటికి ఆధారాలు ఉన్నాయని తేల్చింది. ఈ నివేదికను కలెక్టర్ ఆగస్టు 13న వి ద్యాశాఖ డెరైక్టర్‌కు అందించిన నేపథ్యంలో ఆర్వీఎం డెరైక్టర్ వెన్నపును తక్షణం విధుల నుంచి తొలగించి, విచారణ జరిపించాలని ఈనెల 4న ఆదేశించారు. రెండు వారాలు కావస్తున్నా.. ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం, ఆయన పీఓగా కొనసాగడం గమనా ర్హం. వెన్నపుపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన స్వచ్ఛంద సంస్థలే కాక ఆర్వీఎం ఉద్యోగులూ కోరడం విశేషం.