సాక్షి, రంగారెడ్డి జిల్లా : రాజీవ్ విద్యా మిషన్‌ను లెక్కల చిక్కులు చుట్టుముట్టాయి. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఏ పద్దు కింద ఎంత మొత్తం ఉందనే లెక్క తేలకపోవడంతో వాటిని వినియోగించలేని పరిస్థితి నెలకొంది. సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం దండిగా నిధులు విడుదల చేసింది. వీటిలో కొంత భాగం నేరుగా పాఠశాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా, మరికొన్ని జిల్లా ప్రాజెక్టు అధికారి ఖాతాలో జమయ్యాయి. కాగా, వీటిని కూడా పాఠశాల ఖాతాకు బదిలీ చేశారు. దాదాపు పదేళ్లుగా ఈ ప్రక్రియ సాగింది. దండిగా నిధులు విడుదల చేయడం తప్ప.. ఏ పద్దు కింద ఎన్ని నిధులు ఖర్చు చేస్తుది అటు జిల్లా ప్రాజెక్టు యంత్రాంగం గానీ, ఇటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గానీ ప్రత్యేకంగా లెక్కలు రాయలేదు. ఇటీవల ప్రభుత్వం మిగులు నిధులను వెనక్కు పంపాలని ఆదేశించింది. లెక్కల్లో స్పష్టత లేకపోవడంతో చాలా నిధులు వెనక్కు రాకుండా పాఠశాల ఖాతాల్లోనూ మూలుగుతున్నాయి. ఈ లెక్కలు తేల్చే క్రమంలో భాగంగా ఆర్వీఎం అధికారులు మూడు నెలలుగా అధికారులు కుస్తీ పడుతున్నప్పకీ ఏటూ తేలకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు.
తిరిగొచ్చింది సగమే..
జిల్లాలో 2,314 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1,640 ప్రాథమిక పాఠశాలలు, 247 ప్రాథమికోన్నత పాఠశాలలు కాగా మరో 427 ఉన్నత పాఠశాలలున్నాయి. పాఠశాల గ్రాంట్లు, నిర్మాణ పనులు, నిర్వహణ, ఉపాధ్యాయుల బోధన, అభ్యసన నిధులు తదితర దాదాపు 18 కిపైగా పద్దుల కింద ఏటా ప్రతి పాఠశాలకు నిధులు విడుదలవుతున్నాయి. నిధులు విడుదల చేసే అంశంపై యంత్రాంగం ఆదినుంచి ఉదాసీనంగా వ్యవహరించింది. దీంతో ఏ పద్దు కింద ఎంత నిధులిచ్చాం.. ఎంత ఖర్చయ్యాయి.. మిగులు నిధులెన్ని.. అనే విషయాలపై దృష్టి సారించలేదు. దీంతో క్షేత్రస్థాయిలో వచ్చిన నిధులను అడ్డదిడ్డంగా ఖర్చు చేసి ఉపాధ్యాయులు చేతులు దులుపుకొన్నారు. ఇటీవల నిధులు వెనక్కు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జిల్లా ఆర్వీఎం అధికారులు ఉపాధ్యాయుల నుంచి తెప్పించేందుకు ఉపక్రమించింది. జిల్లాలో మొత్తంగా రూ.32 కోట్లు పాఠశాలల ఖాతాల్లో ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేయడంతో.. ఈ మేరకు చర్యలకు దిగిన యంత్రాంగానికి ఇప్పటివరకు కేవలం రూ.14 కోట్లు మాత్రమే వెనక్కు వచ్చాయి. మరో రూ.8కోట్ల మేర విద్యార్థుల యూనిఫాం బిల్లుల నేపథ్యంలో వాటిని అట్టిపెట్టినప్పటికీ.. మరో రూ.10 కోట్ల మేర లెక్కలు తేలడం లేదు.
బడి నుంచే తేల్చేద్దాం..
క్షేత్ర స్థాయిలో ఏ పద్దు కింద ఎన్ని నిధుల ఉన్నాయనే విషయాన్ని తేల్చేందుకు రాజీవ్ విద్యామిషన్ ప్రత్యేక ప్రొఫార్మాను రూపొందించింది. రెండ్రోజుల క్రితం జరిగిన విద్యాధికారుల సమావేశంలో ఈ ప్రొఫార్మాలను వారికి అందించింది. వీటిని పాఠశాలల వారీగా ప్రధానోపాధ్యాయులకు పంపి వారం రోజుల్లో వివరాలు ఇవ్వాలని మండల విద్యాధికారులకు స్పష్టం చేసింది. ఇందులో 18 కాలమ్స్‌తో కూడిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివరాలు వచ్చిన అనంతరం వాటిని క్రోడీకరించి జిల్లా స్థాయి వివరాలను తయారు చేస్తామని జిల్లా ఆర్వీఎం ప్రాజెక్టు అధికారి కిషన్‌రావు ‘సాక్షి’కి వివరించారు.
లెక్క తప్పింది..!
Published Sun, Sep 22 2013 2:25 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement