ఆశలన్నీ కొత్త ప్రణాళికపైనే
కొత్త ప్రణాళిక ఇలా..
2014-15 సంవత్సర వార్షిక ప్రణాళికలో ప్రాధాన్యత అంశాలిలా ఉన్నాయి. వీటితో పాటు సాధారణ అంశాలైన ఉద్యోగుల వేతనాలు, కేజీబీవీల నిర్వహణ, పాఠశాలల గ్రాంట్లు తదితర ఇతర అంశాలు కూడా ఉంటాయి.
1,114 విద్యార్థులను కవర్ చేసేందుకు కొత్తగా 23 ప్రాథమిక పాఠశాలలు
142 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయడం
1,635 మంది పిల్లలకు ఇంటి నుంచి బడికి, తర్వాత ఇంటికి తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యం
705 అదనపు తరగతి గదుల ఏర్పాటు
రెండు పట్టణ, రెండు గ్రామీణ రెసిడెన్షియల్ హాస్టళ్లు
అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలకు ఫర్నీచర్
ప్రత్యేక పిల్లలకు ఫ్రెండ్లీ టాయిలెట్స్
716 ఎస్జీటీ పోస్టులు, 785 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల మంజూరు
రూ.315 కోట్లతో 2014-15 ఆర్వీఎం వార్షిక ప్రణాళిక ఖరారు
కొత్త అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన అధికారులు
గత ప్రణాళిక రూ.213 కోట్లు.. ఇచ్చింది రూ.126కోట్లే!
పూర్తిస్థాయి నిధుల రాకపై ఈసారీ అనుమానమే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా రాజీవ్ విద్యామిషన్ కొత్త వార్షిక ప్రణాళిక ఖరారైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రణాళికకు సర్కారు భారీగా కోతలు పెట్టడంతో కుదేలైన ఆర్వీఎం.. 2014-15 వార్షిక ప్రణాళికపైనే గంపెడాశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సరికొత్త అంశాలను జోడిస్తూ వార్షిక ప్రణాళికను తయారు చేసింది. తాజా ప్లాన్‌లో పెండింగ్ పనులు పూర్తి చేయడంతోపాటు కొత్తగా అదనపు తరగతి గదులు, రెసిడెన్షియల్ పాఠశాలలు, పాఠశాలల అప్‌గ్రెడేషన్, ఇంటి నుంచి బడికి విద్యార్థుల రవాణా, ఫర్నీచర్ తదితర కీలకాంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది.
గాడిన పెట్టేందుకు..
2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లా రాజీవ్ విద్యామిషన్ అధికారులు రూ.213 కోట్లతో ప్రణాళిక తయారు చేశారు. అయితే ఇందులో కేవలం రూ.126కోట్లకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో కీలకంగా చేపట్టే కార్యక్రమాలకు నిధులు కొరత ఏర్పడింది. దీంతో ఈ ఏడాది వ్యూహాత్మకంగా ప్రణాళికను తయారు చేశారు. ప్రాధాన్య అంశాలనే ప్రస్తావిస్తూ రూ.315కోట్లతో పక్కాగా ప్రణాళిక తయారు చేశారు. అయితే ప్రభుత్వం ఏమేరకు ఆమోదిస్తుందో వేచి చూడాలి.