ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు, నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం రాజీవ్ విద్యామిషన్ (ఎస్‌ఎస్‌ఏ) ఏటా నిధులను సమకూర్చుతోంది. కోట్లాది రూపాయల నిధులను ఆయా గ్రాంట్ల కింద పాఠశాలలకు మంజూరు చేస్తారు. కానీ సదరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్లు తమ నిజాయితీని నిరూపించుకోవాలనే ఆలోచనతో పిల్లల అభ్యున్నతికి వినియోగించాల్సిన నిధులను వృథా చేశారు. ఇదే విషయాన్ని విజి‘లెన్స్’ నివేదికలు తేల్చిచెబుతున్నాయి. మూడేళ్లుగా రాజీవ్ విద్యామిషన్ మంజూరు చేసిన నిధులను ఖర్చు చేయకుండా పిల్లలకు అన్యాయం చేశారని ఉన్నతాధికారులు తేల్చారు. అసలు నిధులు ఎందుకు ఖర్చు చేయలేదో వివరణ ఇవ్వాలంటూ మెమోలు జారీ చేయాలని ఆర్వీఎం రాష్ట్ర పథక సంచాలకులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
రూ.వందకోట్లు వెనక్కి
ఇదేంటి నిధులు మెక్కేయకుండా బాగానే ఆదా చేశారుగా అని చూసేవారికి అనిపించినా.. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సక్రమంగా వినియోగించకుండా వృథా చేయటం ఫలితంగా మూడేళ్లుగా జిల్లాకు వివిధ గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధులు భారీస్థాయిలో ఏకంగా రూ.100 కోట్ల వరకు వెనక్కి మళ్లినట్టు తెలుస్తోంది. 2008-09, 2009-10, 2010-11 విద్యాసంవత్సరాల్లో స్కూల్ గ్రాంట్స్, మెయింటినెన్స్ గ్రాంట్, స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్‌ల రూపంలో భారీగా నిధులు విడుదల చేశారు. ఈ నిధులు ఆయా బ్యాంకు ఖాతాలకు చేరినా మురిగిపోయే వరకు చూడడం మినహా విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. రూ.2కోట్ల నిధులు ఖర్చు చేస్తే విద్యార్థులకు స్కూళ్లలో మంచి జరిగేది. కానీ సొమ్ములు దాచుకుని వారికి ద్రోహం చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈ నిధులతో పాఠశాలల్లో మరుగుదొడ్లు, పాఠశాల మరమ్మతులు, పరికరాల మరమ్మతులు, బోధనా సామగ్రి ఇలా విద్యార్థులకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నవాటికి ఖర్చు చేయాల్సిన నిధులను వ్యర్థం చేసినట్టు విజిలెన్స్ అధికారులు తనిఖీలో గుర్తించారు. పైగా అప్పటి రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు ఆఫీసర్ కూడా సక్రమంగా పర్యవేక్షణ చేయలేదని నివేదికల్లో పేర్కొన్నట్టు చెబుతున్నారు. ఈఏడాది స్కూల్ మెయింటినెన్స్ గ్రాంట్, స్కూల్ గ్రాంట్‌గా రూ.4 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఎలిమెంటరీ పాఠశాలకు ఒక్కోదానికి రెండు గ్రాంట్‌లు కలిపి రూ.10వేలు, యూపీ స్కూల్‌కు రూ.17వేలు, ఉన్నత పాఠశాలకు రూ.17 వేలు మంజూరు చేశారు. గతంలో అయితే ఒక్కో పాఠశాలకు సుమారు రూ.27 నుంచి రూ.32వేల వరకు నిధులు మంజూరు అయ్యేవి.
రూ.2 కోట్ల నిధులు ఖర్చు చేయని హెడ్మాస్టర్లు
Published Wed, Nov 27 2013 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
Advertisement
Advertisement