eluru city
-
ఏలూరులో చెడ్డీ గ్యాంగ్ ?
వారు నరరూప రాక్షసులు.ఆ గ్యాంగ్ పేరు వింటేనే సామాన్యులకు హడల్. అదే చెడ్డీ గ్యాంగ్. ఈ ముఠా సభ్యులు నగలు దోపిడీ చేయటమే కాదు.. మహిళలను మానభంగం చేస్తారు. ప్రాణాలను సైతం నిర్థాక్షిణ్యంగా తీసేస్తారు. ఏలూరు టౌన్ :ఏలూరు నగరంలో ఈ గ్యాంగ్ గురువారం అర్ధరాత్రి 1.05 గంటలకు ఒక ఇంట్లో దోపిడీకి విఫలయత్నం చేసింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ ఇంటిలో అద్దెకు ఉంటున్న యజమాని అర్ధరాత్రి వేళ పోలీసులకు సమాచారం ఇచ్చినా సకాలంలో స్పందించకపోవటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భగవంతుడే తమని కాపాడాడని..లేకుంటే తమ కుటుంబం ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదంటూ యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సుమారు 45నిమిషాల పాటు ఆరుగురు దోపిడీ దొంగల ముఠా ఇంటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. 100 నంబర్‌కు ఫోన్ చేస్తే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినా పోలీసుల జాడ లేదని తెలు స్తోంది. విపత్కర పరిస్థితుల్లో స్నేహితులకు సమాచారం ఇవ్వటం, వరండాలో లైట్లు వేసి, అలజడి చేయటంతో కొంతసేపటికి దోపిడీ ముఠా వెనక్కుతగ్గినట్లు తెలుస్తోంది. ఈ విషయం నగరంలో దావానలంలా వ్యాప్తించటంతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ దోపిడీ ముఠా సంచరించటం పట్ల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. పోలీస్ అధికారులు మాత్రం ఇది షోలాపూర్ గ్యాంగ్ పనే అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు నగరంలో గురువారం రాత్రి చెడ్డీ గ్యాంగ్ దోపిడీ దొంగల ముఠా హల్చల్ చేసింది. ఒక చేపల వ్యాపారి ఇంటిలో దోపిడీకి విఫలయత్నం చేసింది. శుక్రవారం ఉదయం సంఘటనా స్థలాన్ని ఏలూరు డీఎస్పీ కే.ఈశ్వరరావు, సీసీఎస్ డీఎస్పీ సత్యనారాయణ, త్రీటౌన్ సీఐ పీ.శ్రీనివాసరావు పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. దోపిడీ ముఠా ఎవరై ఉంటారనే అంశాలపై ఆరా తీశారు. రాత్రి సంఘటన జరిగిన పరిస్థితులను బాధితుని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కథనం ప్రకారం.. ఏలూరు శాంతినగర్ 8వ రోడ్డు చివర దేవరపల్లి సత్యనారాయణ అనే న్యాయవాది నివాసముంటున్నారు. ఈ భవనం కింది పోర్షన్లో సరెళ్ళ రామకృష్ణ అనే చేపల వ్యాపారి తన కుటుం బంతో అద్దెకు ఉంటున్నారు. తాను ఉంటున్న ఇంటికి రామకృష్ణ సీసీ టీవీ కెమేరాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి 1.05 నిమిషాలకు ఇంటి బయట అలికిడి కావటంతో అతను సీసీ కెమెరాలను గమనించాడు. ఎవరో ఆరుగురు వ్యక్తులు బయట సంచరిస్తున్నట్లు కనిపించింది. ఆరుగురు ముఠా సభ్యులు ముఖానికి టవల్ కట్టుకుని, షార్ట్‌లు, నిక్కర్లు ధరించి ఉన్నారు. వారి వద్ద కత్తులు, రాడ్లు ఉన్నట్లు సీసీ టీవీ కెమేరాల్లో కన్పించింది. వెంటనే సహాయం కోసం 100 నంబర్‌కు డయల్ చేశాడు. స్టేట్ కాల్ సెంటర్లో ఉన్న పోలీసులు జిల్లా కాల్‌సెంటర్‌కు సమాచారం వెంటనే ఇవ్వలేదు. కొంతసేపటికి స్థానిక పోలీ సులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోయింది. అప్పటికే 45 నిమిషాల పాటు దోపిడీ ముఠా లోనికి ప్రవేశించేందుకు విఫలయత్నం చేస్తోంది. భయాందోళనలో ఉన్న రామకృష్ణ సహాయం కోసం పై అంతస్తులో ఉంటున్న ఇంటి యజమానికి, అతని స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఈ సందర్భంలో వరండాలో లైట్లు వేయటం, ఫోన్లో స్నేహితులకు సమాచారం అందిస్తూ కొంత అలజడి చేయటంతో దోపిడీ ముఠా ఇంటి వెనుక నుంచి గోడదూకి పారిపోయింది. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అధికారులు అక్కడ సిబ్బందిని పహారా పెట్టారు. చెడ్డీ గ్యాంగా?.. షోలాపూర్ గ్యాంగా? ఏలూరులో దోపిడీకి విఫలయత్నం చేసింది చెడ్డీ గ్యాంగా లేక షోలాపూర్ గ్యాంగా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు ముఠా సభ్యుల్లో కొందరు షార్ట్‌లు, ఇద్దరు నిక్కర్లు వేసుకుని, ముఖానికి గుడ్డలు కట్టుకున్నారు. నడుముకు కత్తులు ఉన్నాయి..ఒక వ్యక్తి భుజానికి బ్యాగు ధరించి ఉన్నాడు. ఈ ముఠా దొపిడీకి పాల్పడిన సందర్భంలో విచక్షణారహితంగా వ్యవహరిస్తారు. ఇంటిని దోచుకోవటంతోపాటు, యజమానులను సైతం నిర్ధాక్షిణ్యంగా చంపేస్తారని పోలీసులు చెబుతున్నారు. ఖాకీ సినిమా తరహాలో దోపిడీలకు పాల్ప డడం వీళ్ళకు వెన్నతోపెట్టిన విద్యగా చెబుతున్నారు. ఆలస్యమే.ప్రాణాలు కాపాడిందా? చేపల వ్యాపారి రామకృష్ణ గురువారం రాత్రి ఇంటికి ఆలస్యంగా చేరుకున్నాడు. రామకృష్ణ నిద్రకు ఉపక్రమించకముందే ఇంటిబయట ఏదో అలికిడి వినిపించింది. వెంటనే సీసీ కెమెరాలను గమనించాడు. ఈ సీసీ కెమెరాల ఆధారంగానే అప్రమత్తమై తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. ముందుగానే వచ్చి నిద్రపోయి ఉంటే దోపిడీ దొంగలు అంతా దోచుకుపోయేవారు. ప్రాణాలకు సైతం గ్యారంటీ లేకపోయేది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం కూడా తమను కాపాడిందని అంటున్నారు. దోపిడీకి ఎలా ప్రయత్నించారంటే.. దోపిడీ దొంగలు ఏమి చేశారంటే...సుమారు 1.05 గంటల ప్రాంతంలో ఇంటి వెనుక వైపు గోడదూకి ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఆరుగురు ముఠా సభ్యులు షార్ట్‌లు, పైన బనియన్లు ధరించి, నడుముకు కత్తులు కట్టుకుని ఉన్నారు. చుట్టుపక్కల పరిస్థితిని గమనించి, ఇంటిలోని వారు బయటకు రాకుండా అక్కడే ఉన్న మోటారు సైకిల్‌ను డోర్ లాక్కు బలమైన ప్లాస్టిక్ తాడుతో గట్టిగా కట్టేశారు. అనంతరం వెనుకవైపు ఉన్న డోర్‌ను పగులగొట్టేందుకు ప్రయత్నించారు. బయట ఇద్దరు కాపలా ఉండగా, మరో నలుగురు వ్యక్తులు డోర్‌ను పగులగొట్టేందుకు విఫలయత్నం చేశారు. వెనుకతలుపు త్వరగా పగలకపోవటం, ఈలోగా అలజడి రావటంతో వెనుదిరిగినట్లు తెలుస్తోంది. భీమడోలులో గతంలో దోపిడీ మహారాష్ట్ర షోలాపూర్ ప్రాంతానికి చెందిన ఆరుగురు ముఠా సభ్యులు 3సంవత్సరాల క్రితం భీమడోలు ప్రాంతంలో ఓ నగల దుకాణంలోకి ప్రవేశించి 50 కాసుల బంగారాన్ని దోచుకువెళ్ళారు. వాళ్ళూ ఇదే తరహాలో నిక్కర్లు, బనియన్లు ధరించి ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ముఠానే ఇటీవల నెల్లూరు ప్రాంతంలో ఒక ఇంటిలోకి ప్రవేశించి దోచుకుని, అడ్డువచ్చిన ఇంటి యజ మానురాలిని కొట్టి చంపి, మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది. పటిష్ట చర్యలు చేపడుతున్నాం : కే.ఈశ్వరరావు, ఏలూరు డీఎస్పీ ఏలూరు నగర ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదు. నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. రాత్రి వేళల్లో పూర్తిస్థాయి నిఘాను మరింత పెంచుతున్నాం. ఏలూరులో సంచరించిన ముఠా చెడ్డీ గ్యాంగ్‌కు సంబంధించిన వారు కాదు. షోలాపూర్ గ్యాంగ్‌గా అనుమానం ఉంది. బాధితుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ప్రజల శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తాం. -
యువకుడు గన్‌తో తిరుగుతున్నాడని చెప్పినా....
నాలుగు రోజులపాటు ఏలూరులోనే కిరాయి హంతకులు ఓ యువకుడు గన్‌తో తిరుగుతున్నాడని ఉన్నతాధికారులకు సమాచారం అయినా పట్టించుకోని వైనం విజిబుల్ పోలీసింగ్ ఎక్కడ సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరు సిటీ : పచ్చని ‘పశ్చిమ’ ప్రశాంతతకు మారుపేరుగా నిలిచేది. ఇది ఒకప్పటి మాట. ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా హత్యలు, దోపిడీలు, దొంగతనాలు పెద్దఎత్తున చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు నేరగాళ్లు తుపాకులు చేతబట్టి పేట్రేగిపోతున్నారు.ఎక్కడ.. ఎవరు హత్యలకు తెగబడతారో.. ఎప్పుడు తుపాకీ పేలుతుందోననే భయం జిల్లా ప్రజలను వెంటాడుతోంది. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఏలూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఏప్రిల్ 4న న్యాయవాది పీడీఆర్ రాయల్ పట్టపగలే దారుణంగా హత్యకు గురయ్యాడు. 80 రోజుల అనంతరం అదే పోలీస్ స్టేషన్‌కు సమీపంలో తుపాకీ కాల్పుల ఘటన చోటుచేసుకోవటం చర్చనీయాంశమైంది. ఇదే ఏడాది ఫిబ్రవరిలో టూటౌన్ పరిధిలోని చేపల తూము సెంటర్లో చిన్నికృష్ణ అనే వ్యక్తిపై మిట్టమధ్యాహ్నం దుండగులు నడిరోడ్డుపై హత్యాయత్నం చేశారు. గడచిన 6 నెలల కాలంలో ఏలూరులో మూడు హత్యోదంతాలు చోటుచేసుకున్నాయి. ఉన్నతాధికారులతోపాటు, పోలీస్ బాస్‌లు సైతం నగరంలోనే ఉం టున్నా.. నేరస్తులు బెరుకు లేకుండా కార్యకలాపాలు సాగిస్తున్నారు. నిఘా వ్యవస్థ పనిచేస్తోందా! ఈ ఘటనలు చూస్తుంటే పోలీస్ నిఘా వ్యవస్థ పనిచేస్తోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పినకడిమికి చెం దిన తూరపాటి నాగరాజును మంగళవారం నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి చంపేందుకు యత్నించిన ఘటన నిఘా వైఫల్యానికి అద్దం పడుతోంది. ఒక వ్యక్తి తుపాకీతో తిరుగుతున్నాడని.. కాల్పుల ఘటనకు మూడురోజుల ముందే స్థానికులు నిఘా అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ పేటలోని ఓ లాడ్జిలో మకాం వేసి దుండగులు నిత్యం నాగరాజు కదలికలు గమనిస్తున్నా పోలీసులు పట్టుకోలేకపోయారు. రాజకీయ నాయకుల జోక్యం పెరిగిపోవటం వల్లే నేరస్తులకు పోలీసులంటే భయం లేకుండాపో తోందనే అభిప్రాయాన్ని పోలీస్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్ ఎక్కడ నియోజకవర్గానికి ఆరుగురు సిబ్బందితో పోలీస్ నిఘా బృందం పని చేస్తుంటుంది. నగరంలో ఎనిమిది మంది వరకూ నిఘా సిబ్బంది ఉన్నా రు. వరుస ఘటనలు జరుగుతున్నా అధికారులను అప్రమత్తం చేయటంలో ఆ వ్యవస్థ ఘోరంగా విఫలమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో సుమారు 3.20 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఎక్కడా విజిబుల్ పోలీసింగ్ కానరావడం లేదు. రాత్రి వేళల్లోనూ గస్తీకి సిబ్బందిని కేటాయించడం కష్టంగా మారింది. ఒక బీట్ చూసే సిబ్బంది రెండు, మూడు బీట్లు కవర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. నగరంలో వన్ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లకు ఒక సీఐ, టూ టౌన్‌కు ఒక సీఐ, ఐదుగురు ఎస్సైలు ఉన్నారు. వన్‌టౌన్ స్టేషన్లో 43మంది సిబ్బంది అవసరం కాగా, ప్రస్తుతం 40మంది పనిచేస్తున్నా రు. విధుల్లో 35మందే ఉంటున్నారు. టూటౌన్ స్టేషన్ పరిధిలో 70 సిబ్బంది అవసరం కాగా, 50మంది ఉన్నారు. వీరిలోనూ విధులు నిర్వర్తించేది 40 మందే. త్రీటౌన్ స్టేషన్లో 33 మంది సిబ్బందికి గానూ 31 మంది పనిచేస్తున్నారు. ఈ స్టేషన్ పరిధిలో కలెక్టరేట్, డీఐజీ బంగ్లా, న్యాయమూర్తుల భవనాలు, ఎస్పీ బంగ్లా ఉన్నాయి. వీటి బందోబస్తుకు 8మందికి పైగా సిబ్బందిని నియమిస్తున్నారు. మిగిలిన సిబ్బందితోనే నెట్టుకురావాల్సి ఉంది. ఒక్క ఏలూరులో కేవలం వందమంది సిబ్బందితోనే పోలీస్ వ్యవస్థ నడుస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలకు వస్తే పోలీస్ స్టేషన్లన్నీ ఖాళీ అవుతున్నాయి. -
అటు దణ్ణం పెట్టుకుంటుంటే... ఇటు ...
ఏలూరు : దేవాలయం ముందు నిలబడి దేవుడికి నమస్కారం చేసుకుంటున్న భక్తురాలి మెడలో గొలుసును దుండగులు తెంచుకెళ్లారు. ఈ ఘటన శనివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటు చేసుకుంది. స్థానిక శంకరమఠం వద్ద సాయిబాబా గుడి ముందు మహిళ దండం పెట్టుకుంటుంది. అయితే అప్పటికే అక్కడ బైక్‌పై ఓ యువకుడు వేచి ఉండగా మరో యువకుడు ఆగమేఘాల మీద దూసుకొచ్చి... దండంపెట్టుకుంటున్న మహిళ మెడలోని బంగారపు గొలుసు తెంపి.. అంతే వేగంతో బైక్‌పై అక్కడి నుంచి పరారైయ్యాడు. గొలుసు లాగే సమయంలో మహిళ కిందపడటంతో... సదరు మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ విషయం గమనించిన స్థానికులు చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్లు స్థానికుల చేతికి చిక్కలేదు. బాధితురాలని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అరగంట ముందెళ్లాలి
రేపటి నుంచి 31 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు 103 కేంద్రాల్లో.. జీపీఎస్ నిఘాలో..ఏలూరు సిటీ :ఇంటర్మీడియెట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి ఈనెల 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో జరుగుతున్న తొలి పరీక్షలు కావటంతో కాలేజీ యాజ మాన్యాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జిల్లాలో 103 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫస్టియర్, సెకండియర్ కలిపి ఈ ఏడాది 68,109 మంది పరీక్షలు రాయనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య 8,640 పెరిగింది. గత ఏడాది 59,469 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, ఈ ఏడాది 68,109 మందిపరీక్షలు రాయనున్నారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 33,394 మంది కాగా, జనరల్ కోర్సులకు సంబంధించి 30,297 మంది ఉన్నారు. వీరిలో బాలురు 13,687మంది, బాలికలు 16,610 మంది. 3,097 మంది ఒకేషనల్ కోర్సులకు విద్యార్థులుండగా, వారిలో ాలురు 1,735 మంది, బాలికలు 1,362 మంది ఉన్నారు. సెకండియర్‌కు సంబంధించి 34,715 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, వారిలో జనరల్ కోర్సుల విద్యార్థులు 30,907 మంది ఉన్నారు. వీరిలో బాలురు 14,296 మంది, బాలికలు 16,611 మంది. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 3,808 మంది విద్యార్థుల్లో బాలురు 2,018 మంది, బాలికలు 1,790 మంది ఉన్నారు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. జీపీఎస్ నిఘా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) సహాయంతో ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాల నుంచి సెల్ఫోన్ల ద్వారా వెళ్లే ప్రతి కాల్‌ను రికార్డు చేసేలా చర్యలు చేపట్టారు. ఎక్కడైనా అనుమానం, ఆరోపణలు వస్తే వెంటనే ఆయా సెంటర్లకు సంబంధించిన కాల్స్‌ను పరిశీలిస్తారు. సెల్ఫోన్ల ద్వారా ప్రశ్నాపత్రాల లీకేజీలకు బ్రేక్‌లు వేయటంతోపాటు, ఇంటిదొంగల భరతం పట్టేందుకు ప్రణాళిక రచించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు సెల్‌ఫోన్ వాడే అవకాశం ఉంది. అదీకూడా పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ కోసం మాత్రమే. ఆలస్యంగా వచ్చే విద్యార్థులు సహేతుకమైన కారణాలు తెలియజేయాల్సి ఉందని ఆర్ఐఓ బి.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. జిల్లాలో నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్లు, జిల్లా హైపవర్ కమిటీ ఏర్పాటు చేశారు. 103 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 103 మంది డిపార్టుమెంటల్ అధికారులు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటిండెంట్లను నియమించారు. 35 రూట్లలో ప్రశ్నాపత్రాలు పంపిణికీ ఏర్పాట్లు చేశారు. పటిష్ట చర్యలు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించటంతోపాటు ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. విద్యార్థులు అర్ధ గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. నియమిత సమయం అనంతరం ప్రవేశం ఉంది. ఇందుకు సహేతుకమైన కారణాలు చూపించాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులెవరూ సెల్ఫోన్లు తీసుకువెళ్లకూడదు. ఇన్విజిలేటర్లు కూడా సెల్ఫోన్లు వాడకుండా చర్యలు చేపట్టాం. పరీక్షా కేంద్రాల సమీపంలో నెట్ సెంటర్లు, జిరాక్స్ కేంద్రాలను మూసివేయిస్తాం. పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుంది. - బి.వెంకటేశ్వరరావు, ఆర్ఐవో -
సిలబస్ లేటరుు్యంది
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : భవిష్యత్‌కు కీలకమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన ఆలస్యమవుతోంది. సిలబస్ పూర్తికాకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పేట్లు లేవు. నవంబర్ నాటికే పాఠ్యాంశాల బోధన పూర్తిచేయాల్సి ఉండగా, డిసెంబర్ నెలాఖరుకైనా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో పాఠశాలలు 53 రోజులపాటు మూతపడ్డాయి. దీంతో బోధన పూర్తికాలేదు. ఒకేసారి పాఠాలన్నీ చదవాల్సి రావటంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులపై వత్తిడి పెరుగుతోంది. ప్రైవేటు విద్యాసంస్థలు ఒకవైపు స్కూళ్లు నడుపుతూనే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనగా.. ప్రభుత్వ పాఠశాలలు మాత్రం మూతపడ్డారుు. దీంతో జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే సుమారు 44వేల మంది విద్యార్థులు తంటాలు పడుతున్నారు. అదనపు బోధనా దినాలు గాలికి... సమైక్యాంధ్ర ఉద్యమం చేసిన 53 రోజులకు సంబంధించిన పాఠ్యాంశాలను బోధించేం దుకు వీలుగా ఉపాధ్యాయులు 33రోజులపాటు అదనంగా పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కొంతమంది ఉపాధ్యాయులు తాము ఉద్యమంలో పాల్గొనలేదని, ఇప్పుడు సెలవు రోజుల్లో పనిచేయాలంటే కుదరదని చెబుతున్నారు. కొందరైతే సెలవు రోజుల్లోనూ పనిచేస్తున్నామని చెబుతున్నా.. విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. నవంబర్ నెలలో సిలబస్ పూర్తిచేసి.. ఆ తరువాత అర్ధసంవత్సర పరీక్షలు నిర్వహించి.. జనవరిలో పాఠ్యాంశాల పునశ్చరణ చేయాల్సి ఉంది. ఇవేమీ ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించటం లేదు. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 465కు పైగా ఉండగా, ప్రైవేటు విద్యాసంస్థలు 350కు పైగా ఉన్నా యి. ప్రైవేటు స్ళూలో విద్యార్థుల పరిస్థితి బాగానే ఉన్నా, ప్రభుత్వ స్కూళ్ళలోని విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయూరైంది. ప్రణాళిక వేశాం : డీఈవో త్రైమాసిక పరీక్షలు నిర్వహించిన అనంతరం పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రణాళికను అమలు చేస్తామని ఆర్.నరసింహరావు చెప్పారు. ఇప్పటికే ఉదయం, సాయంత్రం పాఠశాలల వేళల గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. జనవరి నుంచి పాఠ్యాంశాల పునశ్చరణ ప్రారంభి విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ చేసి వెనుకబడ్డ వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. సీ, డీ గ్రేడ్ విద్యార్థులు ఏఏ సబ్జెక్టులో వెనుకబడ్డారో పరిశీలించి ఆయా సబ్జెక్టులో ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఉత్తీర్ణతే ధ్యేయంగా కాకుండా పాఠ్యాంశాల అవగాహనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉండే ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. -
రూ.2 కోట్ల నిధులు ఖర్చు చేయని హెడ్మాస్టర్లు
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు, నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం రాజీవ్ విద్యామిషన్ (ఎస్ఎస్ఏ) ఏటా నిధులను సమకూర్చుతోంది. కోట్లాది రూపాయల నిధులను ఆయా గ్రాంట్ల కింద పాఠశాలలకు మంజూరు చేస్తారు. కానీ సదరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్లు తమ నిజాయితీని నిరూపించుకోవాలనే ఆలోచనతో పిల్లల అభ్యున్నతికి వినియోగించాల్సిన నిధులను వృథా చేశారు. ఇదే విషయాన్ని విజి‘లెన్స్’ నివేదికలు తేల్చిచెబుతున్నాయి. మూడేళ్లుగా రాజీవ్ విద్యామిషన్ మంజూరు చేసిన నిధులను ఖర్చు చేయకుండా పిల్లలకు అన్యాయం చేశారని ఉన్నతాధికారులు తేల్చారు. అసలు నిధులు ఎందుకు ఖర్చు చేయలేదో వివరణ ఇవ్వాలంటూ మెమోలు జారీ చేయాలని ఆర్వీఎం రాష్ట్ర పథక సంచాలకులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. రూ.వందకోట్లు వెనక్కి ఇదేంటి నిధులు మెక్కేయకుండా బాగానే ఆదా చేశారుగా అని చూసేవారికి అనిపించినా.. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సక్రమంగా వినియోగించకుండా వృథా చేయటం ఫలితంగా మూడేళ్లుగా జిల్లాకు వివిధ గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధులు భారీస్థాయిలో ఏకంగా రూ.100 కోట్ల వరకు వెనక్కి మళ్లినట్టు తెలుస్తోంది. 2008-09, 2009-10, 2010-11 విద్యాసంవత్సరాల్లో స్కూల్ గ్రాంట్స్, మెయింటినెన్స్ గ్రాంట్, స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్ల రూపంలో భారీగా నిధులు విడుదల చేశారు. ఈ నిధులు ఆయా బ్యాంకు ఖాతాలకు చేరినా మురిగిపోయే వరకు చూడడం మినహా విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. రూ.2కోట్ల నిధులు ఖర్చు చేస్తే విద్యార్థులకు స్కూళ్లలో మంచి జరిగేది. కానీ సొమ్ములు దాచుకుని వారికి ద్రోహం చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నిధులతో పాఠశాలల్లో మరుగుదొడ్లు, పాఠశాల మరమ్మతులు, పరికరాల మరమ్మతులు, బోధనా సామగ్రి ఇలా విద్యార్థులకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నవాటికి ఖర్చు చేయాల్సిన నిధులను వ్యర్థం చేసినట్టు విజిలెన్స్ అధికారులు తనిఖీలో గుర్తించారు. పైగా అప్పటి రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు ఆఫీసర్ కూడా సక్రమంగా పర్యవేక్షణ చేయలేదని నివేదికల్లో పేర్కొన్నట్టు చెబుతున్నారు. ఈఏడాది స్కూల్ మెయింటినెన్స్ గ్రాంట్, స్కూల్ గ్రాంట్‌గా రూ.4 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఎలిమెంటరీ పాఠశాలకు ఒక్కోదానికి రెండు గ్రాంట్లు కలిపి రూ.10వేలు, యూపీ స్కూల్‌కు రూ.17వేలు, ఉన్నత పాఠశాలకు రూ.17 వేలు మంజూరు చేశారు. గతంలో అయితే ఒక్కో పాఠశాలకు సుమారు రూ.27 నుంచి రూ.32వేల వరకు నిధులు మంజూరు అయ్యేవి.