యువకుడు గన్‌తో తిరుగుతున్నాడని చెప్పినా....
- నాలుగు రోజులపాటు ఏలూరులోనే కిరాయి హంతకులు
- ఓ యువకుడు గన్‌తో తిరుగుతున్నాడని ఉన్నతాధికారులకు సమాచారం అయినా పట్టించుకోని వైనం
- విజిబుల్ పోలీసింగ్ ఎక్కడ
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరు సిటీ : పచ్చని ‘పశ్చిమ’ ప్రశాంతతకు మారుపేరుగా నిలిచేది. ఇది ఒకప్పటి మాట. ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా హత్యలు, దోపిడీలు, దొంగతనాలు పెద్దఎత్తున చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు నేరగాళ్లు తుపాకులు చేతబట్టి పేట్రేగిపోతున్నారు.ఎక్కడ.. ఎవరు హత్యలకు తెగబడతారో.. ఎప్పుడు తుపాకీ పేలుతుందోననే భయం జిల్లా ప్రజలను వెంటాడుతోంది.
జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఏలూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఏప్రిల్ 4న న్యాయవాది పీడీఆర్ రాయల్ పట్టపగలే దారుణంగా హత్యకు గురయ్యాడు. 80 రోజుల అనంతరం అదే పోలీస్ స్టేషన్‌కు సమీపంలో తుపాకీ కాల్పుల ఘటన చోటుచేసుకోవటం చర్చనీయాంశమైంది. ఇదే ఏడాది ఫిబ్రవరిలో టూటౌన్ పరిధిలోని చేపల తూము సెంటర్‌లో చిన్నికృష్ణ అనే వ్యక్తిపై మిట్టమధ్యాహ్నం దుండగులు నడిరోడ్డుపై హత్యాయత్నం చేశారు.
గడచిన 6 నెలల కాలంలో ఏలూరులో మూడు హత్యోదంతాలు చోటుచేసుకున్నాయి. ఉన్నతాధికారులతోపాటు, పోలీస్ బాస్‌లు సైతం నగరంలోనే ఉం టున్నా.. నేరస్తులు బెరుకు లేకుండా కార్యకలాపాలు సాగిస్తున్నారు.
నిఘా వ్యవస్థ పనిచేస్తోందా!
ఈ ఘటనలు చూస్తుంటే పోలీస్ నిఘా వ్యవస్థ పనిచేస్తోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పినకడిమికి చెం దిన తూరపాటి నాగరాజును మంగళవారం నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి చంపేందుకు యత్నించిన ఘటన నిఘా వైఫల్యానికి అద్దం పడుతోంది. ఒక వ్యక్తి తుపాకీతో తిరుగుతున్నాడని.. కాల్పుల ఘటనకు మూడురోజుల ముందే స్థానికులు నిఘా అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఆర్‌ఆర్ పేటలోని ఓ లాడ్జిలో మకాం వేసి దుండగులు నిత్యం నాగరాజు కదలికలు గమనిస్తున్నా పోలీసులు పట్టుకోలేకపోయారు. రాజకీయ నాయకుల జోక్యం పెరిగిపోవటం వల్లే నేరస్తులకు పోలీసులంటే భయం లేకుండాపో తోందనే అభిప్రాయాన్ని పోలీస్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
విజిబుల్ పోలీసింగ్ ఎక్కడ
నియోజకవర్గానికి ఆరుగురు సిబ్బందితో పోలీస్ నిఘా బృందం పని చేస్తుంటుంది. నగరంలో ఎనిమిది మంది వరకూ నిఘా సిబ్బంది ఉన్నా రు. వరుస ఘటనలు జరుగుతున్నా అధికారులను అప్రమత్తం చేయటంలో ఆ వ్యవస్థ ఘోరంగా విఫలమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో సుమారు 3.20 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఎక్కడా విజిబుల్ పోలీసింగ్ కానరావడం లేదు. రాత్రి వేళల్లోనూ గస్తీకి సిబ్బందిని కేటాయించడం కష్టంగా మారింది. ఒక బీట్ చూసే సిబ్బంది రెండు, మూడు బీట్లు కవర్ చేయాల్సిన పరిస్థితి ఉంది.
నగరంలో వన్ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లకు ఒక సీఐ, టూ టౌన్‌కు ఒక సీఐ, ఐదుగురు ఎస్సైలు ఉన్నారు. వన్‌టౌన్ స్టేషన్‌లో 43మంది సిబ్బంది అవసరం కాగా, ప్రస్తుతం 40మంది పనిచేస్తున్నా రు. విధుల్లో 35మందే ఉంటున్నారు. టూటౌన్ స్టేషన్ పరిధిలో 70 సిబ్బంది అవసరం కాగా, 50మంది ఉన్నారు. వీరిలోనూ విధులు నిర్వర్తించేది 40 మందే. త్రీటౌన్ స్టేషన్‌లో 33 మంది సిబ్బందికి గానూ 31 మంది పనిచేస్తున్నారు.
ఈ స్టేషన్ పరిధిలో కలెక్టరేట్, డీఐజీ బంగ్లా, న్యాయమూర్తుల భవనాలు, ఎస్పీ బంగ్లా ఉన్నాయి. వీటి బందోబస్తుకు 8మందికి పైగా సిబ్బందిని నియమిస్తున్నారు. మిగిలిన సిబ్బందితోనే నెట్టుకురావాల్సి ఉంది. ఒక్క ఏలూరులో కేవలం వందమంది సిబ్బందితోనే పోలీస్ వ్యవస్థ నడుస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలకు వస్తే పోలీస్ స్టేషన్లన్నీ ఖాళీ అవుతున్నాయి.