west godavari district police
-
నలుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం రాయనంలో నలుగురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 50 వేల నగదుతోపాటు 37 సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాల్పుల కేసు దర్యాప్తు వేగవంతం
ఏలూరు అర్బన్ : నగరంలో సంచలనం సృష్టించిన కాల్పుల కేసు దర్యాప్తు వేగవంతమైంది. తూరపాటి నాగరాజుపై హత్యాయత్నానికి పాల్పడిన దుండగుల ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా యత్నిస్తున్నారు. దుండగులు ఇతర ప్రాంతాలనుంచి నగరానికి వచ్చారా.. వస్తే ఏదైనా లాడ్జిలో బస చేశారా అనే దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు నగరంలోని అన్ని హోటళ్లు, లాడ్జిలు, డార్మిటరీల రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీలనూ పరిశీలిస్తున్నారు. గతంలో నగరంలో జరిగిన పైబోయిన రవి, మధు కేసుల్లో దుండగులు బీహార్ రాష్ట్రంలోని కొలిమిల్లో తయారు చేసిన నాటు తుపాకులు వాడడం, నాగరాజుపై దాడికి యత్నించిన ఘటనలో దొరికిన తూటా షెల్, మ్యాగ్జైన్లు కూడా నాటుతుపాకీలవేనని నిర్ధారణ కావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో బీహార్‌లోనూ దర్యాప్తు చేయాలని పోలీ సులు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇక నాగరాజుపై దాడికి దుండగులు 4 ఎంఎం నాటు తుపాకీని ఉపయోగించారని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కాల్పులు జరిగిన విధానం, బాధితునికైన గాయాన్ని పరిశీలిస్తే తుపాకీని వాడడంలో అనుభవం లేనివారే ఈ పని చేశారని పోలీసులు ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం. స్థానిక రౌడీషీటర్లు ఎవరైనా ఈ యత్నానికి పాల్పడ్డారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో రౌడీషీటర్ల కదలికలపైనా దృష్టి సారించారు. -
యువకుడు గన్‌తో తిరుగుతున్నాడని చెప్పినా....
నాలుగు రోజులపాటు ఏలూరులోనే కిరాయి హంతకులు ఓ యువకుడు గన్‌తో తిరుగుతున్నాడని ఉన్నతాధికారులకు సమాచారం అయినా పట్టించుకోని వైనం విజిబుల్ పోలీసింగ్ ఎక్కడ సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరు సిటీ : పచ్చని ‘పశ్చిమ’ ప్రశాంతతకు మారుపేరుగా నిలిచేది. ఇది ఒకప్పటి మాట. ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా హత్యలు, దోపిడీలు, దొంగతనాలు పెద్దఎత్తున చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు నేరగాళ్లు తుపాకులు చేతబట్టి పేట్రేగిపోతున్నారు.ఎక్కడ.. ఎవరు హత్యలకు తెగబడతారో.. ఎప్పుడు తుపాకీ పేలుతుందోననే భయం జిల్లా ప్రజలను వెంటాడుతోంది. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఏలూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఏప్రిల్ 4న న్యాయవాది పీడీఆర్ రాయల్ పట్టపగలే దారుణంగా హత్యకు గురయ్యాడు. 80 రోజుల అనంతరం అదే పోలీస్ స్టేషన్‌కు సమీపంలో తుపాకీ కాల్పుల ఘటన చోటుచేసుకోవటం చర్చనీయాంశమైంది. ఇదే ఏడాది ఫిబ్రవరిలో టూటౌన్ పరిధిలోని చేపల తూము సెంటర్లో చిన్నికృష్ణ అనే వ్యక్తిపై మిట్టమధ్యాహ్నం దుండగులు నడిరోడ్డుపై హత్యాయత్నం చేశారు. గడచిన 6 నెలల కాలంలో ఏలూరులో మూడు హత్యోదంతాలు చోటుచేసుకున్నాయి. ఉన్నతాధికారులతోపాటు, పోలీస్ బాస్‌లు సైతం నగరంలోనే ఉం టున్నా.. నేరస్తులు బెరుకు లేకుండా కార్యకలాపాలు సాగిస్తున్నారు. నిఘా వ్యవస్థ పనిచేస్తోందా! ఈ ఘటనలు చూస్తుంటే పోలీస్ నిఘా వ్యవస్థ పనిచేస్తోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పినకడిమికి చెం దిన తూరపాటి నాగరాజును మంగళవారం నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి చంపేందుకు యత్నించిన ఘటన నిఘా వైఫల్యానికి అద్దం పడుతోంది. ఒక వ్యక్తి తుపాకీతో తిరుగుతున్నాడని.. కాల్పుల ఘటనకు మూడురోజుల ముందే స్థానికులు నిఘా అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ పేటలోని ఓ లాడ్జిలో మకాం వేసి దుండగులు నిత్యం నాగరాజు కదలికలు గమనిస్తున్నా పోలీసులు పట్టుకోలేకపోయారు. రాజకీయ నాయకుల జోక్యం పెరిగిపోవటం వల్లే నేరస్తులకు పోలీసులంటే భయం లేకుండాపో తోందనే అభిప్రాయాన్ని పోలీస్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్ ఎక్కడ నియోజకవర్గానికి ఆరుగురు సిబ్బందితో పోలీస్ నిఘా బృందం పని చేస్తుంటుంది. నగరంలో ఎనిమిది మంది వరకూ నిఘా సిబ్బంది ఉన్నా రు. వరుస ఘటనలు జరుగుతున్నా అధికారులను అప్రమత్తం చేయటంలో ఆ వ్యవస్థ ఘోరంగా విఫలమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో సుమారు 3.20 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఎక్కడా విజిబుల్ పోలీసింగ్ కానరావడం లేదు. రాత్రి వేళల్లోనూ గస్తీకి సిబ్బందిని కేటాయించడం కష్టంగా మారింది. ఒక బీట్ చూసే సిబ్బంది రెండు, మూడు బీట్లు కవర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. నగరంలో వన్ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లకు ఒక సీఐ, టూ టౌన్‌కు ఒక సీఐ, ఐదుగురు ఎస్సైలు ఉన్నారు. వన్‌టౌన్ స్టేషన్లో 43మంది సిబ్బంది అవసరం కాగా, ప్రస్తుతం 40మంది పనిచేస్తున్నా రు. విధుల్లో 35మందే ఉంటున్నారు. టూటౌన్ స్టేషన్ పరిధిలో 70 సిబ్బంది అవసరం కాగా, 50మంది ఉన్నారు. వీరిలోనూ విధులు నిర్వర్తించేది 40 మందే. త్రీటౌన్ స్టేషన్లో 33 మంది సిబ్బందికి గానూ 31 మంది పనిచేస్తున్నారు. ఈ స్టేషన్ పరిధిలో కలెక్టరేట్, డీఐజీ బంగ్లా, న్యాయమూర్తుల భవనాలు, ఎస్పీ బంగ్లా ఉన్నాయి. వీటి బందోబస్తుకు 8మందికి పైగా సిబ్బందిని నియమిస్తున్నారు. మిగిలిన సిబ్బందితోనే నెట్టుకురావాల్సి ఉంది. ఒక్క ఏలూరులో కేవలం వందమంది సిబ్బందితోనే పోలీస్ వ్యవస్థ నడుస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలకు వస్తే పోలీస్ స్టేషన్లన్నీ ఖాళీ అవుతున్నాయి. -
ఉడాయించిన బెంగాలీ బాబు దొరికిపోయాడు
900 గ్రాముల బంగారంతో స్వర్ణకారుడు పరారీ నిందితుడిని బెంగాల్లో అరెస్ట్ చేసిన పోలీసులు 591 గ్రాముల ఆభరణాలు స్వాధీనం బంగారు ఆభరణాల తయారీలో సిద్ధహస్తుడు.. మంచి మాటకారి.. లావాదేవీల్లో పట్టువిడుపులతో ఖాతాదారుల నమ్మకం పొందాడు. ఇదంతా నాణానికి ఒక వైపు.. మంచివాడిగా నటించి అదను చూసి టోకరా వేశాడు ఇది అతని అసలైన నైజం. ఆభరణాలు తయారుచేయిస్తానని చెప్పి ఖాతాదారుల నుంచి 900 గ్రాముల బంగారం సేకరించి కుటుంబంతో సహా ఉడాయించిన ఓ బెంగాలీ బాబును పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అతని నుంచి సుమారు రూ.17 లక్షల విలువైన 591 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. ఏలూరు అర్బన్ : ఆభరణాలు తయారుచేయిస్తానని నమ్మించి మోసం చేసిన స్వర్ణకారుడిని జంగారెడ్డిగూడెం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్ విలేకరులకు వెల్లడించారు. బెంగాల్ రాష్ట్రం హుబ్లీ జిల్లాలోని డాంకుని తాలూకా ఆకడంక గ్రామానికి చెందిన ముషారఫ్ ముల్లా వృత్తిరీత్యా స్వర్ణకారుడు. ఎనిమిదేళ్ల కిందట జంగారెడ్డిగూడెం వచ్చి బంగారు నగల తయారీ వృత్తిలో స్థిరపడ్డాడు. అధునాతన డిజైన్లతో ఆభరణాలు తయారు చేయించడం, వ్యాపార లావాదేవీల్లో పట్టువిడుపులతో వ్యవహరించడంతో ఖాతాదారుల నమ్మకం పొందాడు. ఈ నేపథ్యంలో ముషారఫ్ స్థానిక స్వర్ణ వర్తకుల నుంచి ఆభరణాలు తయారుచేయిస్తానని 900 గ్రాముల బంగారాన్ని సేకరించాడు. గత ఏప్రిల్ 17న రాత్రి భార్య, బావమరిదితో పాటు బంగారం తీసుకుని బెంగాల్ పారిపోయాడు. దీంతో మోసపోయామని గ్రహించిన ఖాతాదారులు జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ భాస్కర్‌భూషణ్, జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకటరావు నేతృత్వంలో నిందితుడి ఆచూకీ కోసం జంగారెడ్డిగూడెం సీఐ జి.శ్రీనివాస్, మరికొందరు పోలీసులను బెంగా ల్ పంపారు. అక్కడ ముషారఫ్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా బెంగాల్ పోలీసుల సహకారంతో సీఐ శ్రీనివాస్ చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అరకిలో ఆభరణాలకు పైగా రికవరీ పోలీసులు బెంగాల్ నుంచి ముషారఫ్‌ను జిల్లాకు తీసుకువచ్చారు. విచారణలో అతని నుంచి 591 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారని వీటి విలువ రూ.17 లక్షల వరకు ఉంటుందని ఎస్పీ తెలిపారు. -
సొమ్ములతో సరి.. చిందేసుకో మరి..!
యథేచ్ఛగా రికార్డింగ్ డ్యాన్సులు ఆర్కెస్ట్రాల ముసుగులో కార్యక్రమాలు పట్టించుకోని అధికారులు భీమవరం : డెల్టా ప్రాంతంలోని గ్రామాల్లో జాతరల సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సు కార్యక్రమాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల వీరవాసరం మండలంలోని ఓ గ్రామంలో జాతర సందర్భంగా రికార్డింగ్ డ్యాన్స్‌లు నిర్వహిస్తుండగా స్థానికులు పోలీసులకు ఫోన్ చేసినా పట్టించుకోలేదని, జాతర నిర్వాహకులు పోలీసులకు ముడుపులు అందజేయడమే కారణమనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొద్దిరోజులుగా పెళ్లిళ్లు, జాతరలు, వేడుకల సమయంలో ఆర్కెస్ట్రాలు ఏర్పాటుచేస్తున్నారు. వీటిలో పాటలకు అనుగుణంగా యువతులతో నృత్యాలు చేయించి కుర్రకారును ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కురచ దుస్తులతో యువతను పెడదారి పట్టించేలా డ్యాన్స్‌లు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇందుకు అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లతో పాటు భారీగా ముడుపులు కారణంగా కొందరు చెబుతున్నారు. పాలకొల్లు సర్కిల్ పరిధిలో.. పాలకొల్లు పోలీసు సర్కిల్ పరిధిలోని ఒక గ్రామంలో కొద్దిరోజుల క్రితం జాతర నిర్వహించారు. గరగ నృత్యాలు, బాణసంచా కాల్పులతో పాటు రికార్డింగ్ డాన్సులు హోరెత్తాయి. అసభ్యకర నృత్యాలు చేయగా ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై పోలీసు సిబ్బందిని ఆరా తీస్తే దీనిని ఆకతాయి పనిగా కొట్టిపారేసినట్టు చెబుతున్నారు. అదేరోజు రాత్రి 11 గంటల నుంచి వేకువజాము 3 గంటల వరకు రికార్డింగ్ డ్యాన్స్‌లు జరిగినట్టు ఆ గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గ్రామంలోని కట్టుబాట్ల కారణంగా వారంతా మిన్నకుండిపోయారట. ఇక్కడ దీనిపై పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేయించాలని ఉన్న కట్టుబాట్లు కారణంగా విషయం బయటపడితే తమకు ఇబ్బందులు తప్పవని రికార్డింగ్ డ్యాన్స్‌లను వ్యతిరేకించే కొంతమంది యువకులు కిమ్మనకుండా మిన్నకుండి పోయినట్టు తెలిసింది. -
ఆ ఖాకీకి సరిపోలేదట !
ఏలూరు : కోడిపందేల మాటున జిల్లావ్యాప్తంగా చాలామంది పోలీసులు రూ.కోట్లు వెనకేసుకున్నారన్న వార్తలు కలకలం రేపుతుండగా.. మెట్ట ప్రాంతంలోని ఓ పోలీస్ అధికారి మాత్రం ఇంకా సొమ్ము కావాలని సిబ్బందిని వేధిస్తున్నట్టు తెలిసింది. కోడిపందేల పేరుతో ఖాకీలు సాగించిన వసూళ్లపై ‘పోలీసులకు ఎంతెంత’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. సర్కిళ్లు, స్టేషన్ల వారీగా సాగిన వసూళ్ల ఆరోపణలపై వెలువడిన కథనం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ వర్గాల నుంచి ఓ సమాచారం బయటకు పొక్కింది. మెట్ట ప్రాంతంలో పనిచేస్తున్న ఓ పోలీస్ అధికారికి పందేల నిర్వాహకుల నుంచి నేరుగా రూ.11 లక్షలు ముట్టాయి. అయినా.. తన పరిధిలో ఉన్న స్టేషన్ల నుంచి మామూళ్లు రాలేదని ఆయన కస్సుబుస్సు లాడినట్టు తెలిసింది. ‘మీరెవరూ ఇవ్వకుంటే పరిస్థితి ఏమిటి. ఉన్నత స్థాయిలో ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధికి కూడా సొమ్ము ఇవ్వాలి. ఎక్కడి నుంచి తేవాల‘ని తన కిందిస్థాయి సిబ్బందితో వాదులాడినట్టు సమాచారం. ‘అదేంటి సార్. మీ వాటా మీకు వచ్చిందిగా...’ అని అడిగితే.. ‘నాకే ఎదురు సమాధానం చెబుతారా. మీ సంగతి చూస్తా’నని ఆయన బెదిరింపులకు దిగారని అంటున్నారు. ఎక్కడికక్కడ వాటాలు వేసుకుని సొమ్ము పంచుకున్నా.. తమ వాటా కూడా లాగేసుకుంటున్నారని ఆ ప్రాంత పోలీసులు మొత్తుకుం టున్నారు. ఇదిలావుండగా, భీమడోలు పరిధిలోని పోలీసు సిబ్బందికి, అధికారికి వాటాల విషయంలో ఇదే రకమైన స్పర్థలు వచ్చాయంటున్నారు. మొత్తంగా చూస్తుంటే కోడిపందేల మాటున సాగిన వసూళ్లలో పోలీసులతోపాటు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకూ వాటాలు వెళ్లాయన్న వాదనలు వెలుగు చూస్తున్నాయి. -
165 కిలోల గంజాయి పట్టివేత
ఏలూరు : విశాఖపట్నం నుంచి ముంబై అక్రమంగా తరలిస్తున్న 165 కిలోల గంజాయిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులోని ఐదు బస్తాల గంజాయిని గుర్తించారు. గంజాయితోపాటు కారును పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన కోసూరి సతీష్‌కుమార్, పుష్పాల శ్రీనివాసనాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ మార్కెట్లో రూ.15 లక్షల వరకు ఉంటుందని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. -
దొంగ అరెస్ట్ : భారీగా నగదు స్వాధీనం
ఏలూరు: గత కొంత కాలంగా పలు చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఓ దొంగను పోలీసులు మంగళవారం అరెస్ట్ పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కొవ్వూరు తాలుకా తాళ్లపూడి గ్రామంలో అతడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 28 కాసులు బంగారంతోపాటు రూ. 5.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సదరు దొంగపై పలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పల్సర్ చూస్తే చాలు... పల్స్ పడిపోతుంది
260 ప్రత్యేక బృందాలు గాలింపు ... 15 చెక్‌పోస్ట్‌ల వద్ద ప్రత్యేక నిఘా... పట్టుకుంటే రూ. 50 వేలు కాదు రూ. లక్ష రూపాయిల రివార్డు అంటూ ఉన్నతాధికారుల ప్రకటన .... ఇదేదో ఎర్రచందనం స్మగ్లర్ కోసమో.... హత్యల మీద హత్యలు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న నరహంతకుడి కోసమో అనుకుంటే... అలా ఇలా కాదు ఖచ్చితంగా ముద్ద పప్పులో కాలేసినట్లే . మరి ఎవరి కోసం అని టెన్షన్ పట్టుకుందా అదేనండి పశ్చిమగోదావరి జిల్లాలో మహిళలు... యువతులు.. విద్యార్థినులనే లక్ష్యంగా చేసుకుని ఇంజెక్షన్ సూదితో దాడి చేస్తూన్న 'సూది బాబు' కోసం. ఎక్కడి నుంచి వస్తున్నాడో పల్సర్ బైక్‌పై సుడిగాలిలా దూసుకొస్తున్నాడు. అంతే వేగంగా మహిళలు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సిరంజి సూదితో పొడుస్తున్నాడు. బాధితులు ఏ జరిగిందో తెలుసుకునే లోపు బైక్‌పై అదే వేగంతో వెళ్లిపోతున్నాడు. గత శనివారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు విద్యార్థినులపై ఇంజెక్షన్లతో దాడి చేశాడు. ఆ రోజు ప్రారంభించిన వాడు శుక్రవారం వరకు జిల్లాలోని వివిధ గ్రామాలను కలియ తిరుగుతూ ఓ రోజులో కనీసం నలుగురు నుంచి ఆరుగురు యువతులపై సూదితో దాడి చేస్తున్నాడు. అఖరికి ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళలను కూడా వదలకుండా వారికి సూది గుచ్చి పారేసి పరారే... పరారే సాంగూ పాడుకుంటూ పరారైపోతున్నాడు. సూది దాడి చేస్తున్నది ఎవడో ఆకతాయి పని అని విద్యార్థినులు మొదట భావించారు. కానీ జిల్లాలో సూదీ దాడుల జరుగుతున్న తీరు... మీడియాలో వరుస కథనాలతో... ఇది ఆకతాయి దాడి కాదు... ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారని భావించి సదరు బాధితులంతా జిల్లాలోని పోలీస్స్టేషన్లకు క్యూ కట్టారు. చిరంజీవి లెక్చరర్‌గా నటించిన ఓ చిత్రంలో ...ఇక్కడ ఓ అధికారి కిడ్నాప్ అయ్యాడంటే ....ఆక్కడ కాదు మరో చోట అంటూ పోలీసులను ఎలా కన్ఫ్యూజన్లో నెట్టాడో ఆ మాదిరిగా ఈ సూది బాబు ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా నారి మణులపై సూదులతో దాడి చేసి పశ్చిమ పోలీసులుకు ఓ రేంజ్లో దిక్కులు చూపిస్తున్నాడు. సూదితో దాడి చేస్తున్నది ఒక్కడేనా లేక గ్యాంగ్ పనా అనే విషయం తెలియక పోలీసులు ఆయోమయంలో పడిపోయారు. దాంతో రంగంలోకి దిగిన అడిషనల్ డీజీ, డీఐజీలు బాధితులను పరామర్శించి... 'సూది బాబు' రంగు, రూపంపై ఆరా తీసి... అతడి ఊహా చిత్రాన్ని శుక్రవారం విడుదల చేశారు. ఇప్పటికే చైన్ స్నాచర్లతో ఇంట్లో బంగారం ఉన్న ఒంటిపై వేసుకుని బయటకు వచ్చేందుకు ఠారెత్తిపోతున్న ఈ మహిళామణులు... సూది బాబు దెబ్బకు బయటకు రావడమే మానేశారు. ఓ వేళ అత్యవసరంగా బయటకు వచ్చినా ఇలా వచ్చి అలా పని ముగించుకుని గోడకు కొట్టిన బంతిలా ఇంటికి వెళ్లిపోతున్నారు. ఈ సూది బాబు పల్సర్‌పై తిరుగుతున్నాడని తెలిసినప్పటి నుంచి ఆ వాహనాన్ని వృద్ధుడు నడుపుతున్నా చాలు... విద్యార్థినుల నుంచి వృద్ధ మహిళల పల్స్ రేట్ ఢాం అని పడిపోతుంది. మరి పోలీసుల పన్నిన వలలో సూదిబాబు చిక్కుతాడో లేదో అని జిల్లాలోని మహిళాలోకమంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. -
‘మాగంటి’పై చీటింగ్ కేసు
ఏలూరు : ఏలూరు ఆటోనగర్‌లో స్థలాల కేటాయింపుల్లో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించిది ఏలూరు ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మాగంటి నాగభూషణంపై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ డాక్టర్ కె.రఘురామ్‌రెడ్డి వెల్లడించారు. ఆటోనగర్‌లో ఇష్టారాజ్యంగా స్థలాలు కేటాయిస్తున్నారన్న వాదనల నేపథ్యంలో ‘పెద్దలే గద్దలు’ శీర్షికన గత నెల 22న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విది తమే. ఈ వ్యవహారంపై పోలీసులు సీరి యస్‌గా దృష్టి సారించారు. బాధితులూ ధైర్యంగా ముందుకొచ్చి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ రఘురామ్రెడ్డిలను గత నెల 28న కలిసి ఫిర్యాదు చేశారు. అసోసియేషన్ సభ్యులైన సబ్బవరపు నందనరావు, మోటూ రి మాధవరావులతోపాటు మెకానిక్‌లుగా పనిచేస్తున్న తమను సభ్యులుగా చేర్చమని కోరితే పట్టించుకోవటం లేదంటూ 75 మంది బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మాగంటి నాగభూషణంతోపాటు అసోసియేషన్ నేతలనూ విచారించారు. సోమవారం మాగంటిపై సెక్షన్-420తోపాటు 406, 468, 506 కింద రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ రఘురామ్‌రెడ్డి వెల్లడించారు. ప్రాథమిక విచారణ జరిపి కేసులు నమోదు చేసామని, దర్యాప్తులో భాగం గా ఏపీఐఐసీ అధికారుల నుంచి పూర్తివివరాలు కోరతామని చెప్పారు. పత్రాలు స్వాధీనం కాగా, సోమవారం రాత్రి పోలీసులు సెర్చ్ వారెంట్ తీసుకుని స్థానిక ఏఎస్ ఆర్ స్టేడియం సమీపంలోని మాగంటి నాగభూషణం ఇంట్లో సోదాలు చేపట్టా రు. ఆటోనగర్‌కు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సీఐ ధర్మేందర్‌రెడ్డి, ఎస్సై జి.ఫణీంద్ర, పెదపాడు ఎస్సై టి.నాగరాజు ఆధ్వర్యంలో 20మంది పోలీసులు సోదాలు జరిపారు. డీఐజీతో ఎమ్మెల్యేల భేటీ పోలీసులు మాగంటి నాగభూషణం ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలోనే ఏలూరు రేంజ్ డీఐజీ పి.హరికుమార్‌తో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి భేటీ కావడం చర్చనీయూంశమైంది. మాగంటి అరెస్ట్ కాకుండా పోలీ సులపై ఒత్తిళ్లు తీసుకు తెచ్చేందుకు ఆయనతో భేటీ అయ్యారన్న వాదనలు వినిపించాయి. డీఐజీతో చర్చలు జరిపిన అనంతరం వారిద్దరితోపాటు జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు నేరుగా మాగంటి నాగభూషణం ఇం టికి వెళ్లారు. ఓ పక్క పోలీసులు తని ఖీలు చేస్తున్న సమయంలోనే వారు ఇంట్లోకి వెళ్లి మాగంటితో చర్చలు జరి పారు. కాగా, సోదా చేస్తున్న పోలీసులపై మాగంటి కుటుంబ సభ్యులు కస్సుబుస్సులాడటం, సెర్చ్ వారెంట్ తీసుకుని వెళ్లిన పోలీసులకు సహకరించకపోవడం కొసమెరుపు. -
60 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం సమీపంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా లారీలో అక్రమంగా తరలిస్తున్న 60 కింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీని సీజ్ చేసి... పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.