ఉడాయించిన బెంగాలీ బాబు దొరికిపోయాడు | thief arrest in west bengal | Sakshi
Sakshi News home page

ఉడాయించిన బెంగాలీ బాబు దొరికిపోయాడు

Published Tue, Jun 14 2016 8:54 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

ఉడాయించిన బెంగాలీ బాబు దొరికిపోయాడు - Sakshi

ఉడాయించిన బెంగాలీ బాబు దొరికిపోయాడు

  • 900 గ్రాముల బంగారంతో స్వర్ణకారుడు పరారీ
  • నిందితుడిని బెంగాల్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు
  • 591 గ్రాముల ఆభరణాలు స్వాధీనం
  •  
    బంగారు ఆభరణాల తయారీలో సిద్ధహస్తుడు.. మంచి మాటకారి.. లావాదేవీల్లో పట్టువిడుపులతో ఖాతాదారుల నమ్మకం పొందాడు. ఇదంతా నాణానికి ఒక వైపు.. మంచివాడిగా నటించి అదను చూసి టోకరా వేశాడు ఇది అతని అసలైన నైజం. ఆభరణాలు తయారుచేయిస్తానని చెప్పి ఖాతాదారుల నుంచి 900 గ్రాముల బంగారం సేకరించి కుటుంబంతో సహా ఉడాయించిన ఓ బెంగాలీ బాబును పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అతని నుంచి సుమారు రూ.17 లక్షల విలువైన 591 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు.
     
    ఏలూరు అర్బన్ : ఆభరణాలు తయారుచేయిస్తానని నమ్మించి మోసం చేసిన స్వర్ణకారుడిని జంగారెడ్డిగూడెం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్ విలేకరులకు వెల్లడించారు. బెంగాల్ రాష్ట్రం హుబ్లీ జిల్లాలోని డాంకుని తాలూకా ఆకడంక గ్రామానికి చెందిన ముషారఫ్ ముల్లా వృత్తిరీత్యా స్వర్ణకారుడు. ఎనిమిదేళ్ల కిందట జంగారెడ్డిగూడెం వచ్చి బంగారు నగల తయారీ వృత్తిలో స్థిరపడ్డాడు.

    అధునాతన డిజైన్‌లతో ఆభరణాలు తయారు చేయించడం, వ్యాపార లావాదేవీల్లో పట్టువిడుపులతో వ్యవహరించడంతో ఖాతాదారుల నమ్మకం పొందాడు. ఈ నేపథ్యంలో ముషారఫ్ స్థానిక స్వర్ణ వర్తకుల నుంచి ఆభరణాలు తయారుచేయిస్తానని 900 గ్రాముల బంగారాన్ని సేకరించాడు. గత ఏప్రిల్ 17న రాత్రి భార్య, బావమరిదితో పాటు బంగారం తీసుకుని బెంగాల్ పారిపోయాడు.

    దీంతో మోసపోయామని గ్రహించిన ఖాతాదారులు జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ భాస్కర్‌భూషణ్, జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకటరావు నేతృత్వంలో నిందితుడి ఆచూకీ కోసం జంగారెడ్డిగూడెం సీఐ జి.శ్రీనివాస్, మరికొందరు పోలీసులను బెంగా ల్ పంపారు. అక్కడ ముషారఫ్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా బెంగాల్ పోలీసుల సహకారంతో సీఐ శ్రీనివాస్ చాకచక్యంగా  అరెస్ట్ చేశారు.
     
    అరకిలో ఆభరణాలకు పైగా రికవరీ
     పోలీసులు బెంగాల్ నుంచి ముషారఫ్‌ను జిల్లాకు తీసుకువచ్చారు. విచారణలో అతని నుంచి 591 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారని వీటి విలువ రూ.17 లక్షల వరకు ఉంటుందని ఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement