సొమ్ములతో సరి.. చిందేసుకో మరి..!
యథేచ్ఛగా రికార్డింగ్ డ్యాన్సులు
ఆర్కెస్ట్రాల ముసుగులో కార్యక్రమాలు
పట్టించుకోని అధికారులు
భీమవరం : డెల్టా ప్రాంతంలోని గ్రామాల్లో జాతరల సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సు కార్యక్రమాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల వీరవాసరం మండలంలోని ఓ గ్రామంలో జాతర సందర్భంగా రికార్డింగ్ డ్యాన్స్‌లు నిర్వహిస్తుండగా స్థానికులు పోలీసులకు ఫోన్ చేసినా పట్టించుకోలేదని, జాతర నిర్వాహకులు పోలీసులకు ముడుపులు అందజేయడమే కారణమనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
కొద్దిరోజులుగా పెళ్లిళ్లు, జాతరలు, వేడుకల సమయంలో ఆర్కెస్ట్రాలు ఏర్పాటుచేస్తున్నారు. వీటిలో పాటలకు అనుగుణంగా యువతులతో నృత్యాలు చేయించి కుర్రకారును ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కురచ దుస్తులతో యువతను పెడదారి పట్టించేలా డ్యాన్స్‌లు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇందుకు అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లతో పాటు భారీగా ముడుపులు కారణంగా కొందరు చెబుతున్నారు.
పాలకొల్లు సర్కిల్ పరిధిలో..
పాలకొల్లు పోలీసు సర్కిల్ పరిధిలోని ఒక గ్రామంలో కొద్దిరోజుల క్రితం జాతర నిర్వహించారు. గరగ నృత్యాలు, బాణసంచా కాల్పులతో పాటు రికార్డింగ్ డాన్సులు హోరెత్తాయి. అసభ్యకర నృత్యాలు చేయగా ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై పోలీసు సిబ్బందిని ఆరా తీస్తే దీనిని ఆకతాయి పనిగా కొట్టిపారేసినట్టు చెబుతున్నారు.
అదేరోజు రాత్రి 11 గంటల నుంచి వేకువజాము 3 గంటల వరకు రికార్డింగ్ డ్యాన్స్‌లు జరిగినట్టు ఆ గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గ్రామంలోని కట్టుబాట్ల కారణంగా వారంతా మిన్నకుండిపోయారట. ఇక్కడ దీనిపై పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేయించాలని ఉన్న కట్టుబాట్లు కారణంగా విషయం బయటపడితే తమకు ఇబ్బందులు తప్పవని రికార్డింగ్ డ్యాన్స్‌లను వ్యతిరేకించే కొంతమంది యువకులు కిమ్మనకుండా మిన్నకుండి పోయినట్టు తెలిసింది.