పల్సర్ చూస్తే చాలు... పల్స్ పడిపోతుంది
260 ప్రత్యేక బృందాలు గాలింపు ... 15 చెక్పోస్ట్ల వద్ద ప్రత్యేక నిఘా... పట్టుకుంటే రూ. 50 వేలు కాదు రూ. లక్ష రూపాయిల రివార్డు అంటూ ఉన్నతాధికారుల ప్రకటన .... ఇదేదో ఎర్రచందనం స్మగ్లర్ కోసమో.... హత్యల మీద హత్యలు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న నరహంతకుడి కోసమో అనుకుంటే... అలా ఇలా కాదు ఖచ్చితంగా ముద్ద పప్పులో కాలేసినట్లే . మరి ఎవరి కోసం అని టెన్షన్ పట్టుకుందా అదేనండి పశ్చిమగోదావరి జిల్లాలో మహిళలు... యువతులు.. విద్యార్థినులనే లక్ష్యంగా చేసుకుని ఇంజెక్షన్ సూదితో దాడి చేస్తూన్న 'సూది బాబు' కోసం.
ఎక్కడి నుంచి వస్తున్నాడో పల్సర్ బైక్పై సుడిగాలిలా దూసుకొస్తున్నాడు. అంతే వేగంగా మహిళలు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సిరంజి సూదితో పొడుస్తున్నాడు. బాధితులు ఏ జరిగిందో తెలుసుకునే లోపు బైక్పై అదే వేగంతో వెళ్లిపోతున్నాడు. గత శనివారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు విద్యార్థినులపై ఇంజెక్షన్లతో దాడి చేశాడు. ఆ రోజు ప్రారంభించిన వాడు శుక్రవారం వరకు జిల్లాలోని వివిధ గ్రామాలను కలియ తిరుగుతూ ఓ రోజులో కనీసం నలుగురు నుంచి ఆరుగురు యువతులపై సూదితో దాడి చేస్తున్నాడు. అఖరికి ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళలను కూడా వదలకుండా వారికి సూది గుచ్చి పారేసి పరారే... పరారే సాంగూ పాడుకుంటూ పరారైపోతున్నాడు.
సూది దాడి చేస్తున్నది ఎవడో ఆకతాయి పని అని విద్యార్థినులు మొదట భావించారు. కానీ జిల్లాలో సూదీ దాడుల జరుగుతున్న తీరు... మీడియాలో వరుస కథనాలతో... ఇది ఆకతాయి దాడి కాదు... ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారని భావించి సదరు బాధితులంతా జిల్లాలోని పోలీస్స్టేషన్లకు క్యూ కట్టారు.
చిరంజీవి లెక్చరర్గా నటించిన ఓ చిత్రంలో ...ఇక్కడ ఓ అధికారి కిడ్నాప్ అయ్యాడంటే ....ఆక్కడ కాదు మరో చోట అంటూ పోలీసులను ఎలా కన్ఫ్యూజన్లో నెట్టాడో ఆ మాదిరిగా ఈ సూది బాబు ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా నారి మణులపై సూదులతో దాడి చేసి పశ్చిమ పోలీసులుకు ఓ రేంజ్లో దిక్కులు చూపిస్తున్నాడు. సూదితో దాడి చేస్తున్నది ఒక్కడేనా లేక గ్యాంగ్ పనా అనే విషయం తెలియక పోలీసులు ఆయోమయంలో పడిపోయారు. దాంతో రంగంలోకి దిగిన అడిషనల్ డీజీ, డీఐజీలు బాధితులను పరామర్శించి... 'సూది బాబు' రంగు, రూపంపై ఆరా తీసి... అతడి ఊహా చిత్రాన్ని శుక్రవారం విడుదల చేశారు.
ఇప్పటికే చైన్ స్నాచర్లతో ఇంట్లో బంగారం ఉన్న ఒంటిపై వేసుకుని బయటకు వచ్చేందుకు ఠారెత్తిపోతున్న ఈ మహిళామణులు... సూది బాబు దెబ్బకు బయటకు రావడమే మానేశారు. ఓ వేళ అత్యవసరంగా బయటకు వచ్చినా ఇలా వచ్చి అలా పని ముగించుకుని గోడకు కొట్టిన బంతిలా ఇంటికి వెళ్లిపోతున్నారు. ఈ సూది బాబు పల్సర్పై తిరుగుతున్నాడని తెలిసినప్పటి నుంచి ఆ వాహనాన్ని వృద్ధుడు నడుపుతున్నా చాలు... విద్యార్థినుల నుంచి వృద్ధ మహిళల పల్స్ రేట్ ఢాం అని పడిపోతుంది. మరి పోలీసుల పన్నిన వలలో సూదిబాబు చిక్కుతాడో లేదో అని జిల్లాలోని మహిళాలోకమంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది.