ఆ ఖాకీకి సరిపోలేదట !
ఏలూరు : కోడిపందేల మాటున జిల్లావ్యాప్తంగా చాలామంది పోలీసులు రూ.కోట్లు వెనకేసుకున్నారన్న వార్తలు కలకలం రేపుతుండగా.. మెట్ట ప్రాంతంలోని ఓ పోలీస్ అధికారి మాత్రం ఇంకా సొమ్ము కావాలని సిబ్బందిని వేధిస్తున్నట్టు తెలిసింది. కోడిపందేల పేరుతో ఖాకీలు సాగించిన వసూళ్లపై ‘పోలీసులకు ఎంతెంత’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కలకలం రేపింది.
సర్కిళ్లు, స్టేషన్ల వారీగా సాగిన వసూళ్ల ఆరోపణలపై వెలువడిన కథనం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ వర్గాల నుంచి ఓ సమాచారం బయటకు పొక్కింది. మెట్ట ప్రాంతంలో పనిచేస్తున్న ఓ పోలీస్ అధికారికి పందేల నిర్వాహకుల నుంచి నేరుగా రూ.11 లక్షలు ముట్టాయి.
అయినా.. తన పరిధిలో ఉన్న స్టేషన్ల నుంచి మామూళ్లు రాలేదని ఆయన కస్సుబుస్సు లాడినట్టు తెలిసింది. ‘మీరెవరూ ఇవ్వకుంటే పరిస్థితి ఏమిటి. ఉన్నత స్థాయిలో ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధికి కూడా సొమ్ము ఇవ్వాలి. ఎక్కడి నుంచి తేవాల‘ని తన కిందిస్థాయి సిబ్బందితో వాదులాడినట్టు సమాచారం.
‘అదేంటి సార్. మీ వాటా మీకు వచ్చిందిగా...’ అని అడిగితే.. ‘నాకే ఎదురు సమాధానం చెబుతారా. మీ సంగతి చూస్తా’నని ఆయన బెదిరింపులకు దిగారని అంటున్నారు. ఎక్కడికక్కడ వాటాలు వేసుకుని సొమ్ము పంచుకున్నా.. తమ వాటా కూడా లాగేసుకుంటున్నారని ఆ ప్రాంత పోలీసులు మొత్తుకుం టున్నారు.
ఇదిలావుండగా, భీమడోలు పరిధిలోని పోలీసు సిబ్బందికి, అధికారికి వాటాల విషయంలో ఇదే రకమైన స్పర్థలు వచ్చాయంటున్నారు. మొత్తంగా చూస్తుంటే కోడిపందేల మాటున సాగిన వసూళ్లలో పోలీసులతోపాటు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకూ వాటాలు వెళ్లాయన్న వాదనలు వెలుగు చూస్తున్నాయి.