కోడి పందాలపై డేగకన్ను  | Police Nigha On Cock Fights | Sakshi
Sakshi News home page

కోడి పందాలపై డేగకన్ను 

Published Mon, Jan 13 2020 8:41 AM | Last Updated on Mon, Jan 13 2020 8:41 AM

Police Nigha On Cock Fights - Sakshi

సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహించే వారిపై పోలీసులు డేగ కన్ను వేశారు. అటు జిల్లాలోను, ఇటు నగరంలోనూ ఈ సంక్రాంతికి కోడి పందాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి, చోడవరంలో ఎక్కువగా కోడిపందాలు నిర్వహిస్తుంటారు. అదేవిధంగా నగరంలో విశాఖ తూర్పు, భీమిలి, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల్లో కూడా గతంలో నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో గత ఏడాది కోడిపందాలు నిర్వహించిన వారిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశామని.., వారు మళ్లీ పందాల నిర్వహణకు ముందుకొస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గత వారం రోజుల నుంచి నగరంలో కొన్ని చోట్ల విచ్చలవిడిగా కోడి కత్తులు తయారుచేస్తూ విక్రయిస్తున్నారు. టాస్‌్కఫోర్స్‌ పోలీసులు ఇప్పటికే 245 కోడి కత్తులను కూడా స్వా«దీనం చేసుకున్నారు. ఇప్పటికే కోర్టులు కూడా పందాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ పందాలు నిర్వహించే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలనే ఆదేశాలున్నాయి.

ఇవీ హాట్‌స్పాట్‌లు 
నగర పరిధిలో కోడి పందాలు జరిగే ప్రాంతాలను పోలీసులు హాట్‌స్పాట్‌లుగా గుర్తించారు. వీటీలో ఆరిలోవ, దువ్వాడ, భీమిలి మండలం తాటితూరు, ఆనందపురం మండలం గుళ్లేపల్లి, పద్మనాభం మండలం రేవిడి, పాండ్రంగి తదితర ప్రాంతాలున్నాయి. అలాగే జిల్లాలోని పాయకరావుపేట మండలం పీఎల్‌ పురం, మంగవరం, పెదరామభద్రపురం, వెంకటనగరం, కుమారపురం, పాల్మాన్‌పేట, నక్కపల్లి మండలం వేంపాడు, నెల్లిపూడి, గొడిచెర్ల, దేవవరం, రమణయ్య పేట, రేబాక, డీఎల్‌ పురం, తీనార్ల, ఎస్‌.రాయవరం మండలం పెదగుమ్ములూరు, లింగరాజుపాలెం, పెదుప్పలం, కోటఉరట్ల మండలం పాములవాక, రామచంద్రాపురం, ములగల లోవ, యలమంచిలి మండలం పెదపల్లి, గూండ్రుబిల్లి, పులపర్తి, ఏటికొప్పాక, రాంబిల్లి మండలం లాలంకోడూరు, దిమిలి, కట్టుబోలు, మురకాడ, మామిడికొత్తూరు, నాతవరం గునుపూడి, వైబీ పట్నం, నర్సీపట్నం మండలం లింగాపురం, అప్పన్న దొరపాలెం, గొలుగొండ మండలం పాకలపాడు, ఏఎల్‌ పురం, అమ్మపేట, జోగంపేట, చీడిగుమ్ముల తదితర ప్రాంతాల్లో ఏటా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

స్పెషల్‌ టీంల ఏర్పాటు 
ఇటు నగరంలోనూ, అటు జిల్లాలోనూ కోడి పందాలు నిర్వహించుకుండా మండలంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐల ఆధ్వర్యంలో స్ఫెషల్‌ టీంలు పనిచేస్తున్నాయి. ఆదివారం నుంచి 18వ తేదీ వరకు ఈ టీంలు నిఘా కొనసాగిస్తాయి. కోడిపందాల నిర్వాహకుల సమచారం తెలుసుకుని అక్కడకు వెళ్లి కేసులు నమోదు చేస్తారు. టాస్‌్కఫోర్స్, క్రైం, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులందరూ ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement