ఏలూరు అర్బన్ : నగరంలో సంచలనం సృష్టించిన కాల్పుల కేసు దర్యాప్తు వేగవంతమైంది. తూరపాటి నాగరాజుపై హత్యాయత్నానికి పాల్పడిన దుండగుల ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా యత్నిస్తున్నారు. దుండగులు ఇతర ప్రాంతాలనుంచి నగరానికి వచ్చారా.. వస్తే ఏదైనా లాడ్జిలో బస చేశారా అనే దిశగా దర్యాప్తు ప్రారంభించారు.
ఈ మేరకు నగరంలోని అన్ని హోటళ్లు, లాడ్జిలు, డార్మిటరీల రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీలనూ పరిశీలిస్తున్నారు. గతంలో నగరంలో జరిగిన పైబోయిన రవి, మధు కేసుల్లో దుండగులు బీహార్ రాష్ట్రంలోని కొలిమిల్లో తయారు చేసిన నాటు తుపాకులు వాడడం, నాగరాజుపై దాడికి యత్నించిన ఘటనలో దొరికిన తూటా షెల్, మ్యాగ్‌జైన్లు కూడా నాటుతుపాకీలవేనని నిర్ధారణ కావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దీంతో బీహార్‌లోనూ దర్యాప్తు చేయాలని పోలీ సులు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇక నాగరాజుపై దాడికి దుండగులు 4 ఎంఎం నాటు తుపాకీని ఉపయోగించారని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కాల్పులు జరిగిన విధానం, బాధితునికైన గాయాన్ని పరిశీలిస్తే తుపాకీని వాడడంలో అనుభవం లేనివారే ఈ పని చేశారని పోలీసులు ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం. స్థానిక రౌడీషీటర్లు ఎవరైనా ఈ యత్నానికి పాల్పడ్డారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో రౌడీషీటర్ల కదలికలపైనా దృష్టి సారించారు.