దోపిడీకి ప్రయత్నించిన శాంతినగర్‌లోని రామకృష్ణ అద్దెకు ఉంటున్న ఇల్లు, ఏలూరు శాంతినగర్‌లో ఒక ఇంటిలో దోపిడీ దొంగల ముఠా (సీసీ టీవీ ఫుటేజి), సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఏలూరు డీఎస్పీ ఈశ్వరరావు
వారు నరరూప రాక్షసులు.ఆ గ్యాంగ్ పేరు వింటేనే సామాన్యులకు హడల్. అదే చెడ్డీ గ్యాంగ్. ఈ ముఠా సభ్యులు నగలు దోపిడీ చేయటమే కాదు.. మహిళలను మానభంగం చేస్తారు. ప్రాణాలను సైతం నిర్థాక్షిణ్యంగా తీసేస్తారు.
ఏలూరు టౌన్ :ఏలూరు నగరంలో ఈ గ్యాంగ్ గురువారం అర్ధరాత్రి 1.05 గంటలకు ఒక ఇంట్లో దోపిడీకి విఫలయత్నం చేసింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ ఇంటిలో అద్దెకు ఉంటున్న యజమాని అర్ధరాత్రి వేళ పోలీసులకు సమాచారం ఇచ్చినా సకాలంలో స్పందించకపోవటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భగవంతుడే తమని కాపాడాడని..లేకుంటే తమ కుటుంబం ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదంటూ యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సుమారు 45నిమిషాల పాటు ఆరుగురు దోపిడీ దొంగల ముఠా ఇంటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. 100 నంబర్‌కు ఫోన్ చేస్తే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినా పోలీసుల జాడ లేదని తెలు స్తోంది. విపత్కర పరిస్థితుల్లో స్నేహితులకు సమాచారం ఇవ్వటం, వరండాలో లైట్లు వేసి, అలజడి చేయటంతో కొంతసేపటికి దోపిడీ ముఠా వెనక్కుతగ్గినట్లు తెలుస్తోంది. ఈ విషయం నగరంలో దావానలంలా వ్యాప్తించటంతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ దోపిడీ ముఠా సంచరించటం పట్ల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. పోలీస్ అధికారులు మాత్రం ఇది షోలాపూర్ గ్యాంగ్ పనే అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరు నగరంలో గురువారం రాత్రి చెడ్డీ గ్యాంగ్ దోపిడీ దొంగల ముఠా హల్‌చల్ చేసింది. ఒక చేపల వ్యాపారి ఇంటిలో దోపిడీకి విఫలయత్నం చేసింది. శుక్రవారం ఉదయం సంఘటనా స్థలాన్ని ఏలూరు డీఎస్పీ కే.ఈశ్వరరావు, సీసీఎస్ డీఎస్పీ సత్యనారాయణ, త్రీటౌన్ సీఐ పీ.శ్రీనివాసరావు పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. దోపిడీ ముఠా ఎవరై ఉంటారనే అంశాలపై ఆరా తీశారు. రాత్రి సంఘటన జరిగిన పరిస్థితులను బాధితుని అడిగి తెలుసుకున్నారు.
పోలీసులు కథనం ప్రకారం.. ఏలూరు శాంతినగర్ 8వ రోడ్డు చివర దేవరపల్లి సత్యనారాయణ అనే న్యాయవాది నివాసముంటున్నారు. ఈ భవనం కింది పోర్షన్‌లో సరెళ్ళ రామకృష్ణ అనే చేపల వ్యాపారి తన కుటుం బంతో అద్దెకు ఉంటున్నారు. తాను ఉంటున్న ఇంటికి రామకృష్ణ సీసీ టీవీ కెమేరాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి 1.05 నిమిషాలకు ఇంటి బయట అలికిడి కావటంతో అతను సీసీ కెమెరాలను గమనించాడు. ఎవరో ఆరుగురు వ్యక్తులు బయట సంచరిస్తున్నట్లు కనిపించింది. ఆరుగురు ముఠా సభ్యులు ముఖానికి టవల్ కట్టుకుని, షార్ట్‌లు, నిక్కర్లు ధరించి ఉన్నారు. వారి వద్ద కత్తులు, రాడ్లు ఉన్నట్లు సీసీ టీవీ కెమేరాల్లో కన్పించింది. వెంటనే సహాయం కోసం 100 నంబర్‌కు డయల్ చేశాడు. స్టేట్ కాల్ సెంటర్‌లో ఉన్న పోలీసులు జిల్లా కాల్‌సెంటర్‌కు సమాచారం వెంటనే ఇవ్వలేదు. కొంతసేపటికి స్థానిక పోలీ సులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోయింది. అప్పటికే 45 నిమిషాల పాటు దోపిడీ ముఠా లోనికి ప్రవేశించేందుకు విఫలయత్నం చేస్తోంది. భయాందోళనలో ఉన్న రామకృష్ణ సహాయం కోసం పై అంతస్తులో ఉంటున్న ఇంటి యజమానికి, అతని స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఈ సందర్భంలో వరండాలో లైట్లు వేయటం, ఫోన్‌లో స్నేహితులకు సమాచారం అందిస్తూ కొంత అలజడి చేయటంతో దోపిడీ ముఠా ఇంటి వెనుక నుంచి గోడదూకి పారిపోయింది. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అధికారులు అక్కడ సిబ్బందిని పహారా పెట్టారు.
చెడ్డీ గ్యాంగా?.. షోలాపూర్ గ్యాంగా?
ఏలూరులో దోపిడీకి విఫలయత్నం చేసింది చెడ్డీ గ్యాంగా లేక షోలాపూర్ గ్యాంగా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు ముఠా సభ్యుల్లో కొందరు షార్ట్‌లు, ఇద్దరు నిక్కర్లు వేసుకుని, ముఖానికి గుడ్డలు కట్టుకున్నారు. నడుముకు కత్తులు ఉన్నాయి..ఒక వ్యక్తి భుజానికి బ్యాగు ధరించి ఉన్నాడు. ఈ ముఠా దొపిడీకి పాల్పడిన సందర్భంలో విచక్షణారహితంగా వ్యవహరిస్తారు. ఇంటిని దోచుకోవటంతోపాటు, యజమానులను సైతం నిర్ధాక్షిణ్యంగా చంపేస్తారని పోలీసులు చెబుతున్నారు. ఖాకీ సినిమా తరహాలో దోపిడీలకు పాల్ప డడం వీళ్ళకు వెన్నతోపెట్టిన విద్యగా చెబుతున్నారు.
ఆలస్యమే.ప్రాణాలు కాపాడిందా?
చేపల వ్యాపారి రామకృష్ణ గురువారం రాత్రి ఇంటికి ఆలస్యంగా చేరుకున్నాడు. రామకృష్ణ నిద్రకు ఉపక్రమించకముందే ఇంటిబయట ఏదో అలికిడి వినిపించింది. వెంటనే సీసీ కెమెరాలను గమనించాడు. ఈ సీసీ కెమెరాల ఆధారంగానే అప్రమత్తమై తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. ముందుగానే వచ్చి నిద్రపోయి ఉంటే దోపిడీ దొంగలు అంతా దోచుకుపోయేవారు. ప్రాణాలకు సైతం గ్యారంటీ లేకపోయేది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం కూడా తమను కాపాడిందని అంటున్నారు.
దోపిడీకి ఎలా ప్రయత్నించారంటే..
దోపిడీ దొంగలు ఏమి చేశారంటే...సుమారు 1.05 గంటల ప్రాంతంలో ఇంటి వెనుక వైపు గోడదూకి ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఆరుగురు ముఠా సభ్యులు షార్ట్‌లు, పైన బనియన్లు ధరించి, నడుముకు కత్తులు కట్టుకుని ఉన్నారు. చుట్టుపక్కల పరిస్థితిని గమనించి, ఇంటిలోని వారు బయటకు రాకుండా అక్కడే ఉన్న మోటారు సైకిల్‌ను డోర్ లాక్‌కు బలమైన ప్లాస్టిక్ తాడుతో గట్టిగా కట్టేశారు. అనంతరం వెనుకవైపు ఉన్న డోర్‌ను పగులగొట్టేందుకు ప్రయత్నించారు. బయట ఇద్దరు కాపలా ఉండగా, మరో నలుగురు వ్యక్తులు డోర్‌ను పగులగొట్టేందుకు విఫలయత్నం చేశారు. వెనుకతలుపు త్వరగా పగలకపోవటం, ఈలోగా అలజడి రావటంతో వెనుదిరిగినట్లు తెలుస్తోంది.
భీమడోలులో గతంలో దోపిడీ
మహారాష్ట్ర షోలాపూర్ ప్రాంతానికి చెందిన ఆరుగురు ముఠా సభ్యులు 3సంవత్సరాల క్రితం భీమడోలు ప్రాంతంలో ఓ నగల దుకాణంలోకి ప్రవేశించి 50 కాసుల బంగారాన్ని దోచుకువెళ్ళారు. వాళ్ళూ ఇదే తరహాలో నిక్కర్లు, బనియన్లు ధరించి ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ముఠానే ఇటీవల నెల్లూరు ప్రాంతంలో ఒక ఇంటిలోకి ప్రవేశించి దోచుకుని, అడ్డువచ్చిన ఇంటి యజ మానురాలిని కొట్టి చంపి, మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది.
పటిష్ట చర్యలు చేపడుతున్నాం : కే.ఈశ్వరరావు, ఏలూరు డీఎస్పీ
ఏలూరు నగర ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదు. నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. రాత్రి వేళల్లో పూర్తిస్థాయి నిఘాను మరింత పెంచుతున్నాం. ఏలూరులో సంచరించిన ముఠా చెడ్డీ గ్యాంగ్‌కు సంబంధించిన వారు కాదు. షోలాపూర్ గ్యాంగ్‌గా అనుమానం ఉంది. బాధితుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ప్రజల శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment